
‘రెండున్నరేళ్లలో మళ్ళీ పవర్‌లోకి వస్తాం’
రేవంత్ రెడ్డి కంటే ఎక్స్‌ట్రాలు చేస్తున్నారో అందరి పేర్లు బరాబర్ రాసి పెట్టుకుంటామన్న కేటీఆర్.
తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ గులాబీ జెండా ఎగరడం ఖాయమని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. రెండున్నరేళ్లలో మళ్ళీ తమ పార్టీ అధికారంలోకి వస్తుందని అన్నారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ పాలనపై కన్నా రాజకీయ కక్షసాధింపులకే ప్రాధాన్యం ఇస్తుందని విమర్శలు గుప్పించారు. ఈ ప్రభుత్వ పాలనలో సంతోషంగా ఎవరూ లేరని, ప్రతి వర్గం ప్రజలు కూడా తీవ్ర అసంతృప్తి, నిరాశతోనే ఉన్నారని అన్నారు. రైతులకు సంక్షేమ పథకాలే కాకుండా కనీసం యూరియా కూడా అందడటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులకు ఫీజు రియంబర్స్‌మెంట్ లభించడం లేదని, గురుకుల విద్యార్థులకు నాణ్యమైన ఆహారమే అందడం లేదని మండిపడ్డారు. కేసీఆర్ పాలనలో అందరికీ న్యాయం జరిగిందని, ఈ ప్రభుత్వ పాలనలో అంతా అన్యాయమే జరుగుతుందని దుయ్యబట్టారు. ప్రజలంతా కూడా కాంగ్రెస్‌కు ఓటేసి తప్పు చేశామని అనుకుంటున్నారని, కేసీఆర్ మళ్ళీ సీఎం కావాలని కోరుకుంటున్నారిన వ్యాఖ్యానించారు.
‘‘రేవంత్ రెడ్డి పరిస్థితి విచిత్రంగా ఉంది. భూముల విలువలు పడిపోయాయి. యూరియా కోసం రైతులు నానాతిప్పలు పడాల్సి వస్తుంది. పదేళ్లలో రేషన్ కార్డులు ఇవ్వలేదని ఐఏఎస్ అధికారులు కూడా అబద్ధాలు చెప్తున్నారు. ఐఏఎస్ అధికారులు రాజకీయాలు మాట్లాడటం సరికాదు. రుణమాఫీ విషయంలో సర్కార్ పూర్తిగా విఫలమైంది. కాంగ్రెస్‌పై రైతులు ఆగ్రహంతో ఉన్నారు. ఓట్లు ఉన్నప్పుడు కాదు.. నాట్లు వేసేటప్పుడు రైతుబంధు ఇవ్వాలి. స్థానిక సంస్థల ఎన్నికలు ముగిసిన తర్వాత రైతు బంధు ఆపేస్తుంది. అసెంబ్లీ సమావేశాలు పెట్టి బీసీ సబ్‌ప్లాన్‌ను ప్రవేశపెట్టాలి. రేవంత్‌కు కేసీఆర్ అంటే భయం పట్టుకుంది. అందుకే ఢిల్లీలో వెళ్లినా కేసీఆర్ నామస్మరణ ఆపడం లేదు. బీఆర్ఎస్ చేసిన మంచిని కార్యకర్తలు సరిగా ప్రచారం చేయలేకపోయారు. అందుకే బీఆర్ఎస్ ఓడిపోయింది. కేసీఆర్‌ను సీఎం చేయడానికి అంతా కలిసికట్టుగా మళ్ళీ కృషి చేయాలి’’ అని కేటీఆర్ పిలుపునిచ్చారు.
అందరి లెక్కలు సరిచేస్తాం..
‘‘కొందరు అధికారులు అత్యుత్సాహానికి పోయి అనవసరంగా రాజకీయాలు మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ కార్యకర్తల్లా ప్రవర్తిస్తున్నారు. ఐఏఎస్, ఐపీఎస్ హోదాల్లో ఉండి చిలకపలుకులు పలుకుతున్నారు. ఎవరెవరైతే ఎగిరెగిరి పడుతున్నారో.. రేవంత్ రెడ్డి కంటే ఎక్స్‌ట్రాలు చేస్తున్నారో అందరి పేర్లు బరాబర్ రాసి పెట్టుకుంటాం. ప్రతి ఒక్కరి మాటలు గుర్తు పెట్టుకుంటాం. అన్ని లెక్కలు సరిచేస్తాం. ఆ బాధ్య నాది’’ అని అన్నారు.