కాళేశ్వరంలోనే కాదు పాలమూరు ప్రాజెక్టులోనూ  అక్రమాలు
x
నిర్మాణంలో ఉన్న పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం

కాళేశ్వరంలోనే కాదు పాలమూరు ప్రాజెక్టులోనూ అక్రమాలు

పాలమూరు ప్రాజెక్టుకు రూ.32,863 కోట్లు ఖర్చు చేసినా ఒక్క ఎకరానికి కూడా అందని సాగునీరు.


తెలంగాణ రాష్ట్రంలో గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో కాళేశ్వరం ప్రాజెక్టు ఒక్కటే కాదు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం నిర్మాణంలోనూ అడుగుఅడుగునా అక్రమాలు జరిగాయని నిబంధనలు ఉల్లంఘించి నిర్మాణ అనుమతులు లేకుండానే ప్రాజెక్టు పనులు చేపట్టారని విచారణల్లో వెల్లడైంది.

కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో పలు అక్రమాలు జరిగాయని జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారణలో వెలుగు చూసింది. కాళేశ్వరంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, ఇంజినీర్లు అధిక అంచనాలతో, నిర్మాణ నాణ్యత లోపాలతో కాసులు కైంకర్యం చేశారని కమిషన్ ఎత్తి చూపించింది. ఇది వెలుగు చూసిన మూడు రోజులకే పాల‌మూరు రంగారెడ్డి ప్రాజెక్టు బాగోతం ఆర్టీఐ సమాచారంతో బయటపడింది.

2015నుంచి నిర్మాణంలోనే...

ద‌క్షిణ తెలంగాణ జిల్లాల‌కు సాగు, తాగునీరు అందించేందుకు కొత్తగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన కొద్ది రోజుల్లోనే పాల‌మూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు 2015 వ సంవత్సరం జూన్ నెలలో పాల‌నాప‌ర‌మైన మంజూరు ఇచ్చారు. ఈ ప్రాజెక్టు పనులను 2015లోనే చేపట్టారు. రూ.32,000 కోట్ల అంచ‌నా వ్యయంతో నాలుగేళ్లలో అంటే 2019జూన్ లోగా ఈ ప్రాజెక్టును పూర్తి చేయాల‌ని నిర్ణ‌యించారు. కానీ ఈ ప్రాజెక్టు నిర్మాణానికి ఈ ఏడాది మార్చి నెలాఖరు వరకు రూ.32,863.68 కోట్లను ఖర్చు చేసినట్లు నాగర్ కర్నూల్ డిప్యూటీ చీఫ్ ఇంజినీరు ఎ రవికుమార్ తాజాగా సమాచార హక్కు చట్టం 2005 కింద అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చారు.

రూ.32,863కోట్లు ఖర్చు చేసినా ఒక్క ఎకరానికి అందని నీరు
పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం నిర్మాణానికి మొత్తం రూ.32,863కోట్లు ఖర్చు చేసినా ఒక్క ఎకరానికి కూడా సాగు నీరు అందటం లేదు. సాగునీటి మాట దేవుడెరుగు కానీ తాగురు కూడా అందని పరిస్థితి నెలకొంది.ప్రాజెక్టు నిర్మాణం పూర్తి కాకపోవడం అంచనాల కంటే అధికంగా నిధులు ఖర్చు చేసినా ప్రయోజనం కలగలేదు.

కేంద్ర అనుమతులు లేకుండానే ప్రాజెక్టు పనులు
కృష్ణాన‌ది అంత‌ర్ రాష్ట్ర న‌ది. ఈ న‌దిపై ఎలాంటి ప్రాజెక్టులు లేదా ఎత్తిపోత‌ల పథకాల ద్వారా నీటిని వినియోగించాల‌న్నా కేంద్ర ప్ర‌భుత్వ శాఖ‌ల‌ నుంచి అనుమతులు తీసుకున్న త‌రువాతే ప‌ని మొద‌లుపెట్టాలి. కానీ అప్పటి కేసీఆర్ సర్కారు పాల‌మూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు ఎలాంటి అనుమతులు లేకుండానే తొంద‌ర‌పాటుగా ప‌నులు చేప‌ట్టారు.

తెలంగాణకు రూ.920 కోట్ల గ్రీన్ ట్రిబ్యునల్ జరిమానా
పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును అనుమతులు లేకుండా అక్రమంగా కృష్ణానదిపై నిర్మించారని పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం జాతీయ గ్రీన్ ట్రిబ్యున‌ల్ లో కేసు వేసింది.దీనిపై విచారణ జరిపిన గ్రీన్ ట్రిబ్యున‌ల్ ప‌ర్యావ‌ర‌ణ అనుమ‌తులు తీసుకోకుండా తెలంగాణ రాష్ట్రం ప్రాజెక్టు ప‌నులు మొద‌లుపెట్టార‌ని రూ.920 కోట్ల జరిమానా విధించింది. గ్రీన్ ట్రిబ్యున‌ల్ తెలంగాణ రాష్ట్రానికి జరిమానా విధించడమే కాకుండా ప్రాజెక్టులకు అనుమ‌తులు లేకుండా ప‌నులు చేయ‌డం ఒక అల‌వాటుగా మారింద‌ని, ఈ ప‌నులు ప్ర‌జా ప్ర‌యోజ‌నాల కోసం చేప‌ట్టామ‌ని స‌మ‌ర్థించుకోవ‌డం జ‌రుగుతుంద‌ని వ్యాఖ్యానించింది.

నిలిచిన ప్రాజెక్టుకు మళ్లీ నిధుల కేటాయింపు
పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పనులకు అనుమతులు లేవని నిలిచిపోయాయి. మరోవైపు ఈ ప్రాజెక్టు పూర్తి చేయడానికి ఇంకా రూ. 20 వేల కోట్లు కావాల‌ని ప్రాజెక్టు ఛీఫ్ ఇంజ‌నీరు రాష్ట్ర ప్ర‌భుత్వానికి ప్ర‌తిపాదనలు పంపించారు.దీంతో 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఈ అసంపూర్తి ప్రాజెక్టుకు రూ.1714 కోట్లను కేటాయించినట్లు నాగర్ కర్నూల్ డిప్యూటీ చీఫ్ ఇంజినీరు ఎ రవికుమార్ తాజాగా సమాచార హక్కు చట్టం 2005 కింద అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చారు.

కోర్టు కేసులతో పెండింగులోనే...
కృష్ణాన‌దిలో నుంచి తెలంగాణ రాష్ట్రానికి కేటాయించిన నీటికంటే ఎక్కువ‌గా పాల‌మూరు రంగారెడ్డి ప్రాజెక్టు ద్వారా తీసుకుంటున్నార‌ని ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రం సుప్రీంకోర్టులో కేసు వేసింది. దీంతో ఈ ప్రాజెక్టు వ్యవహారం గ్రీన్ ట్రిబ్యునల్ తో పాటు సుప్రీంకోర్టులో విచారణలో ఉంది. ప్రాజెక్టు నిర్మాణం కోసం భూమి సేక‌రించి స‌రైన ప‌రిహారం ఇవ్వ‌నందున చాలామంది రైతులు రాష్ట్ర హైకోర్టును ఆశ్ర‌యించారు.

ప్రశ్నార్థకంగా మారిన పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు
పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ర‌క‌ర‌కాల కోర్టు కేసులు, కేంద్ర అనుమతులు లేక పోవడం, భూసేకరణలో స‌మ‌స్య‌ల‌తో అసంపూర్తిగా ఉంది. అసలు ఈ ప్రాజెక్టు నిర్మాణం చివ‌రి ద‌శ‌కు చేరుతుందా ? కేంద్రం నుంచి అనుమతులు వస్తాయా? కోర్టుల్లో పెండింగులో ఉన్న కేసులు ఎప్పుడు పరిష్కారమవుతాయో తెలియని పరిస్థితి నెలకొంది. దీంతో ఈ ప్రాజెక్టు భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది.అప్పటిదాకా ప్రభుత్వం ఖర్చు పెట్టిన రూ.32,863.68 కోట్లు వ్యర్థంగా మారాయి.

అసంపూర్తి ప్రాజెక్టుకు ప్రారంభోత్సవం
పాల‌మూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు ఒకవైపు అనుమతులు లేక,మరో వైపు గ్రీన్ ట్రిబ్యునల్, సుప్రీంకోర్టు, హైకోర్టు కేసులతో స‌త‌మ‌త‌మ‌వుతుంటే గత బీఆర్ఎస్ ముఖ్య‌మంత్రి కేసీఆర్ గత అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు కొన్ని వారాల ముందు 2023 సెప్టెంబరు 16వతేదీన నార్ల‌పూరులో అసంపూర్తి ప్రాజెక్టుకు ప్రారంభోత్స‌వం చేశారు.మళ్లీ రెండో రోజు అదే ప్రాజెక్టుకు కొల్లాపూర్ లోనూ ప్రారంభోత్స‌వం చేశారు.అసంపూర్తి ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి నాడు రూ.22 కోట్లతో పత్రికల్లో ప్రకటనలు కూడా జారీ చేశారు.

మంచినీటి అవసరాలకు మళ్లిస్తాం : చీఫ్ ఇంజినీర్ జి విజయభాస్కర్ రెడ్డి
పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం నిర్మాణానికి అనుమతి లేనందున దీన్ని మంచినీటి అవసరాలు తీర్చేందుకు మళ్లిస్తామని ప్రాజెక్టు చీఫ్ ఇంజినీర్ జి విజయభాస్కర్ రెడ్డి ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. పర్యావరణ అనుమతులు లేనందున కాల్వల నిర్మాణం చేపట్టలేదని, సాగు అవసరాలకు ఒక్క ఎకరానికి కూడా నీరివ్వలేమని ఆయన తెలిపారు. ప్రాజెక్టు పూర్తి చేసి మంచినీ టి అవసరాలకు నీరందిస్తామని ఆయన వివరించారు.

రాష్ట్ర గవర్నరుకు ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ లేఖ
పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం నిర్మాణంలో ప్ర‌జాధ‌నాన్ని దుర్వినియోగం చేశారని ఫోరం ఫర్ గుడ్ గవర్నన్స్ తాజాగా రాష్ట్ర గవర్నరు జిష్ణుదేవ్ వర్మకు ఫిర్యాదు చేసింది. పాలమూరు ప్రాజెక్టు నిర్మాణానికి ఆస్కీ ఇంజినీరింగ్ నిపుణుల బృందం రూపొందించిన ప్లాన్ ను కాదని, అనుమతి లేని ప్రాజెక్టు పనులను చేపట్టారని, ఈ ప్రాజెక్టు పనుల్లో అక్రమాలు జరిగాయని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ అధ్యక్షులు యం పద్మనాభరెడ్డి ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. ఈ పాలమూరు ప్రాజెక్టు అక్రమాలపై దర్యాప్తు చేయాలని తాము గవర్నరుకు లేఖ రాశామని ఆయన వివరించారు.


Read More
Next Story