హైదరాబాద్ ‘డాగ్ ఫ్రీ సిటీ’కోసం జీహెచ్ఎంసీ యత్నాలు షురూ
x
హైదరాబాద్ నగరంలో వీధి కుక్కల బెడద

హైదరాబాద్ ‘డాగ్ ఫ్రీ సిటీ’కోసం జీహెచ్ఎంసీ యత్నాలు షురూ

సుప్రీంకోర్టు ఆదేశంతో శునకాల సమస్యకు పరిష్కారం లభిస్తుందా?


సుప్రీంకోర్టు తాజా ఆదేశాలతో హైదరాబాద్ నగరాన్ని డాగ్ ఫ్రీ సిటీగా చేసేందుకు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాచరణ ఆరంభించింది. జీహెచ్ఎంసీ అధికారులు నగరంలోని ఆసుపత్రుల వద్ద వీధి కుక్కలను పట్టుకొని వాటికి స్టెరిలైజేషన్ శస్త్రచికిత్సలు చేసి షెల్టర్లకు తరలించడం ప్రారంభించారు.అయితే నగరాన్ని పూర్తిగా డాగ్ రహితం చేయడం సవాళ్లతో కూడుకుంది.ఒకవైపు వీధి కుక్కలను జన సమ్మర్థ ప్రాంతాల నుంచి తరలిస్తోంది. మరో వైపు జీహెచ్ఎంసీలో పెంపుడు కుక్కల యజమానులకు మై జీహెచ్ఎంసీ మొబైల్ యాప్ ద్వారా వారి కుక్కలను నమోదు చేయమని సూచించింది.వీధి కుక్కలకు స్టెరిలైజేషన్ (sterilisation), టీకాలు (vaccinations) వేయడానికి ప్రణాళికలు చేపడుతోంది.


పెరుగుతున్న వీధికుక్కల సంఖ్య
హైదరాబాద్‌లో ఎనిమల్ బర్త్ కంట్రోలు కేంద్రాలు (ABC) ఆశించిన మేర లేకపోవడం కారణంగా వీధికుక్కల సంఖ్య నానాటికి పెరుగుతోంది. పెరుగుతున్న వీధి కుక్కల సంఖ్యతో హైదరాబాద్ డాగ్ ఫ్రీ సిటీ సాధ్యమయ్యే పరిస్థితులు కనిపించడం లేదు. కొందరు వీధుల్లో కుక్కలకు ఫీడింగ్ చేయడం వల్ల కుక్కల బెడద సమస్య తీరడం లేదు. నగరంలో స్ట్రీట్ డాగ్‌ల సంఖ్య గణనీయంగా పెరిగింది. నగర పరిధిలో 3.79 లక్షల వీధి కుక్కలు ఉన్నట్లు జీహెచ్ఎంసీ అధికారులు అంచనా వేశారు.ప్రజలు, ముఖ్యంగా పిల్లలు, మహిళలు ఉదయం, సాయంత్రం వేళల్లో బయటకు వెళ్లేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు, అధికారులు సూచించారు. జీహెచ్ఎంసీ అధికారులు వెంటనే స్పందించి కుక్కలను పట్టుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.బహిరంగ ప్రదేశాలలో వీధి కుక్కలకు ఆహారం ఇవ్వడం నిషేధించారు.

రోజుకు 70 మందికి కుక్కకాటు
నగరంలో పెరుగుతున్న కుక్కలతోపాటు కుక్క కాటు కేసుల సంఖ్య కూడా పెరుగుతుంది. దాదాపు రోజుకు 70 కు పైగా కుక్కకాటు కేసులు నమోదవుతున్నాయి.వీధి కుక్కల దాడుల్లో నెలకొకరు లేదా ఇద్దరు మరణిస్తూనే ఉన్నారు. కుక్కలకు స్టెరిలైజేషన్, వ్యాక్సినేషన్ కారణంగా ఆశించిన ప్రయోజనం కనిపించడం లేదు. వీధుల్లో పిల్లలు, వృద్ధులు, వాహనచోదకులు ఎక్కువగా కుక్కకాటుకు గురవుతున్నారు. కార్మికులు ఎక్కువగా నివాసం ఉన్న ప్రాంతాలు, మురికివాడల్లో వీధి కుక్కల బెడద ఎక్కువగా ఉందని జీహెచ్ఎంసీ అధికారి కె ప్రవీణ్ కుమార్ చెప్పారు. రాత్రివేళల్లో కుక్కలు గుంపులుగా చేరి వాహనాలను వెంటాడుతున్నాయి. దారిన పోయే వారిపై వీధి కుక్కలు మొరుగుతూ దాడి చేసి కరుస్తున్నాయి.

పెరిగిన కుక్కకాటు ఘటనలు
పాఠశాలలున్న ప్రాంతాలు, నదీ తీర ప్రాంతాల్లో కుక్కల బెడద ఎక్కువగా ఉంది.వీధుల్లో చెత్త వేయడం,హోటళ్లు,చికెన్ షాప్లుల వద్ద ఆహార వ్యర్థాలను బయట పడేస్తుండటంతో కుక్కల సంఖ్య పెరుగుతుంది.హైదరాబాద్ నగరంలో 2022 నుంచి 2024వ సంవత్సరం వరకు 3,33,935 మంది కుక్కకాటుకు గురయ్యారని జీహెచ్ఎంసీ గణాంకాలే చెబుతున్నాయి. మూడేళ్లలో కుక్క కాటుకు 36 మంది ప్రాణాలు కోల్పోయారు. గతంలో కంటే కుక్కకాటు ఘటనలు పెరిగాయి. 2024వ సంవత్సరంలో రోజులకు 200 కుక్కకాటు కేసులు నమోదవుతున్నాయని ఆసుపత్రుల రికార్డులే తేటతెల్లం చేశాయి. గతంలో రోజుకు 70 మందికి కుక్కలు కరుస్తుండగా నెలకు ఇద్దరు చొప్పున ప్రాణాలు కోల్పోతున్నారు. కాగా కుక్కకాటు ఘటనలు ఈ ఏడాది పెరిగాయి.

8 వారాల్లోగా వీధికుక్కలను తరలించాలి
సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగాఏబీసీ పద్ధతిని పకడ్బందీగా అమలు చేస్తూ హైదరాబాద్‌ను కుక్కల బెడద లేని నగరంగా మార్చేందుకు నిరంతరం కృషి చేస్తామని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ చెప్పారు. సుప్రీం కోర్టు ఆదేశాల ప్రకారం రాబోయే రెండు నెలల్లో జీహెచ్ఎంసీ ప్రధాన ప్రజా ప్రాంతాల నుంచి వీధి కుక్కలను షెల్టర్లకు తరలించాల్సి ఉంది. అయితే, ఆశ్రయాల కొరత, సిబ్బంది సమస్యలు, నిధుల పరిమితి వంటి అంశాలు ఈ ప్రక్రియను కష్టతరం చేస్తున్నాయి.హైదరాబాద్ నగరంలో వీధి శునకాల సంఖ్య పెరిగిపోవడంతో ప్రజా భద్రతకు ముప్పు వాటిల్లిన నేపథ్యంలో సుప్రీంకోర్టు న‌వంబ‌ర్ 7న కీల‌క ఆదేశాలు జారీ చేసింది. విద్యాసంస్థలు, బస్టాండ్లు, రైల్వే స్టేష‌న్లు, ఆసుపత్రులు, క్రీడా స్థలాల సమీపంలో వీధి శునకాలను ఎనిమిది వారాల్లోగా షెల్టర్లకు తరలించాలని సూచించింది. దీంతో జీహెచ్ఎంసీ ఇప్పటికే స్పెష‌ల్ డ్రైవ్‌ను ప్రారంభించి, ఒకే రోజు వందలాది వీధి శునకాలను బంధించి, స్టెరిలైజేషన్‌ చేపట్టింది. దీంతో నగరంలో ఉండే వృద్ధులు, పిల్లలు, సామాన్య ప్రజల భద్రతపై కొత్త ఆశలు ఏర్పడ్డాయి.



సుప్రీంకోర్టు ఆదేశాలతో శునకాల పట్టివేత

సుప్రీంకోర్టు వీధి కుక్కలపై ఇచ్చిన తాజా ఆదేశాలతో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కదలింది. జీహెచ్ఎంసీ పరిధిలోని ప్రభుత్వ ఆసుపత్రుల పరిసర ప్రాంతాల్లో వీధి కుక్కలను పట్టుకునేందుకు వెటర్నరీ విబాగం అధికారులు స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. శనివారం ఒక్క రోజే జీహెచ్ఎంసీ డాగ్ స్క్వాడ్ 277 వీధి కుక్కలను పట్టుకుంది. పట్టుకున్న వీధి కుక్కలకు స్టెరిలైజేషన్ చేసిన తర్వాత జంతు సంరక్షణ కేంద్రాలకు తరలిస్తామని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ చెప్పారు. ఆసుపత్రుల నుంచి ప్రారంభించిన వీధి కుక్కల పట్టివేత కార్యక్రమాన్ని విద్యాసంస్థలు, రవాణ కేంద్రాలున్న ప్రజా ప్రాంతాలకు విస్తరిస్తామని కమిషనర్ పేర్కొన్నారు.

వీధి కుక్కలపై సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే...
నగరాల్లోని విద్యా సంస్థలు, బస్టాండు, రైల్వేస్టేషన్లు, క్రీడా సముదాయాలు, బహిరంగ ప్రదేశాల సమీపం నుంచి వీధి కుక్కలను షెల్టర్లకు 8 వారాల్లోగా తరలించాలని సుప్రీంకోర్టు ఈ నెల 7వతేదీన కీలక ఆదేశాలు జారీ చేసింది. జన సమ్మర్థ ప్రదేశాల్లో వీధికుక్కలు లోపలకు వెళ్లకుండా కంచెలు ఏర్పాటు చేయాలని కూడా సుప్రీం సూచించింది. జాతీయ రహదారులపై తిరుగుతున్న పశువులను కూడా షెల్టర్లకు తరలించాలని సుప్రీం ఆదేశించింది. వీధి కుక్కల కాటు వల్ల రేబిస్ మరణాల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో సుప్రీం ధర్మాసనం ఈ సంచలన ఉత్తర్వులు జారీ చేసింది. వీధి కుక్కలకు వ్యాక్సినేషన్, స్టెరిలైజేషన్ చేశాక షెల్లర్లలోనే ఉంచాలని కోరింది.

కుక్కలకు ఆశ్రయాలు ఏవి?
హైదరాబాద్ నగరంలో కేవలం ఐదు జంతు సంరక్షణ ఆశ్రయాలు మాత్రమే ఉన్నందున కుక్కల ఆశ్రయాల నిర్మాణం కోసం స్థలం సమస్య ప్రధాన సవాలుగా మిగిలింది. సుప్రీం ఆదేశాల నేపథ్యంలో జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ పశువైద్య అధికారులతో తాజాగా సమావేశం నిర్వహించారు. కుక్కలకు స్టెరిలైజేషన్ తర్వాత వీటిని తిరిగి ఈ ప్రాంగణాల్లోకి వదల కూడదని సుప్రీం ఆదేశించింది. కోర్టు ఆదేశాలకు అనుగుణంగా ఈ డ్రైవ్ లో భాగంగా పాఠశాలలు, కళాశాలలు ,రవాణా కేంద్రాల్లో కుక్కలను పట్టుకోనున్నారు. ప్రభుత్వ సంస్థలలో కుక్క కాటు కేసులు పెరిగిన నేపథ్యంలో సుప్రీంకోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది. నగర ప్రజల భద్రత కోసం వీధి కుక్కలను ఆశ్రయాలకు తరలించాలని సుప్రీం ఆదేశించింది.



అరకొర కేంద్రాలతో వీధి కుక్కల తరలింపు ఎలా?

జీహెచ్ఎంసీలో ఎల్ బీనగర్, కూకట్ పల్లి, జీడిమెట్ల, బేగంబజార్, అంబర్ పేటలలో ఎనిమల్ కేర్ సెంటర్లున్నాయి. దీంతోపాటు గాజులరామారం, మాసబ్ ట్యాంక్, కూకట్ పల్లి, లంగర్ హౌజ్, నారాయణగూడ, అల్వాల్, బోయిగూడ, రాణిగంజ్, మల్కాజిగిరి, అత్తాపూర్, బుద్వేలు, సరూర్ నగర్ లలో పశువైద్య కేంద్రాలున్నాయి. జీహెచ్ఎంసీ జంతు సంరక్షణ కేంద్రాల్లో కుక్కలకు స్టెరిలైజేషన్, టీకాలు వేయాలని నిర్ణయించారు.

మళ్లీ కుక్క కాటు ఘటనలు...
జీడిమెట్ల, బాలానగర్ పరిధిలోని పలు కాలనీలు, బస్తీల్లో వీధి కుక్కలు ప్రజలను తీవ్రంగా భయపెడుతున్నాయి. ఆదివారం జీహెచ్ఎంసీ మహిళా కార్మికులు రోడ్లు ఊడుస్తుండగా కుక్కల గుంపు దాడి చేసి పలువురిని గాయపరిచింది. నగరంలో వీధి కుక్కల నియంత్రణకు ఏటా జీహెచ్ఎంసీ రూ.13 కోట్లు ఖర్చు చేస్తున్నా ఫలితం లేకుండా పోతోంది. ఏటా సగటున 6వేల కంటే కుక్కకాటు కేసులు నమోదువుతున్నాయి. కుక్కకాటుకు గురైన వారిలో 90 శాతం పిల్లలే కావడం విశేషం. నిత్యం నగరంలో ఎక్కడో ఒక చోట కుక్క కాట్లు సాగుతూనే ఉన్నాయి.కుక్క కాటు బాధితులు గాంధీ, నిలోఫర్, నారాయణ గూడ ఐపీఎంలకు తరలివస్తున్నారు. జీహెచ్ఎంసీ నిధులు వెచ్చిస్తున్నా వీధి కుక్కల సమస్య తీరడం లేదని బస్తీల్లో ప్రతీరోజూ ఏదో ఒక చోట కుక్క కరిచిందని ఫిర్యాదులు వస్తూనే ఉన్నాయని మల్కాపూర్ సీనియర్ కార్పొరేటర్ పన్నాల దేవేందర్ రెడ్డి ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు.



మరో వైపు వీధి కుక్కల సంరక్షణ యత్నాలు

సుప్రీంకోర్టు ఆదేశంతో ఒకవైపు వీధి కుక్కలను నియంత్రించేందుకు జీహెచ్ఎంసీ ప్రయత్నిస్తుండగా డాగ్ లవర్స్ స్వచ్ఛంద సంస్థలు బ్లూక్రాస్, పీపుల్స్ ఫర్ ఎనిమల్స్ లాంటి సంస్థలు వీధి కుక్కల పరిరక్షిస్తూ వాటి సంఖ్యను పెంచుతున్నాయి. సోమవారం ఉదయం నాగోలు ప్రాంతంలోని మమతానగర్ లో ఓ వీధి కుక్క ఫిట్స్ వచ్చి పడిపోయిందని సాయినాథ్ అనే డాగ్ లవర్ పీపుల్స్ ఫర్ ఎనిమల్స్ సంస్థ హెల్ప్ లైనుకు ఫిర్యాదు చేశారు. దీంతో తాము అంబులెన్సును తీసుకువెళ్లి అనారోగ్యానికి గురైన వీధి కుక్కను నాగోలులోని షెల్టరుకు తీసుకువచ్చి చికిత్స చేసి వదిలిపెట్టామని పీపుల్స్ ఫర్ ఎనిమల్స్ వాలంటీర్ కె గోవర్థన్ ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు.

అన్నీ వీధి కుక్కలకు స్టెరిలైజేషన్ చేయాలంటే...
హైదరాబాద్ నగరంలో ప్రస్థుతం అయిదు జంతు సంరక్షణ కేంద్రాలున్నాయి. నల్లగండ్లలో మరో కేంద్రం నిర్మాణం కానుంది. ఈ కేంద్రాల్లో 2,164 వీధి కుక్కలను ఉంచే సామర్థ్యం ఉంది. ఫతుల్లా గూడ కేంద్రంలో రోజుకు 400 శునకాలకు శస్త్రచికిత్సలు చేస్తున్నారు. నగరంలోని అన్నీ కుక్కలకు శస్త్రచికిత్సలు చేయాలంటే 100 కేంద్రాలు అవసరం కాగా అయిదే ఉన్నాయి.అన్ని కుక్కలకు ఆపరేషన్లు చేయాలంటే మూడేళ్ల సమయం పట్టనుంది.

జీహెచ్ఎంసీ కీలక అడుగు
నగరంలోని జన సమ్మర్థ ప్రాంతాల్లో ప్రజల భద్రత కోసం వీధి శునకాలను తరలించడంతో జీహెచ్ఎంసీ కీలక అడుగు వేసింది. నగరంలో చాలా వీధి కుక్కలకు స్టెరిలైజేషన్ చేయలేదు. కుక్కల ఆశ్రయాలు నిర్మించటానికి స్థలాలు సరిగా లేవు. ఈ డ్రైవ్‌ విజయం చేయాలంటే ప్రభుత్వ, ప్రజా ప్రాంతాల్లో శునకాల నియంత్రణకు కంచెలు ఏర్పాటు చేయాలి.ప్రజలు కూడా బాధ్యతగా వ్యవహరించి, ఇళ్ల ముందు ఆహారాన్ని బయట వదలకుండా ఉండాలి.కొత్త షెల్టర్లు, ఎనిమల్ కేర్ సెంటర్లు నిర్మించాల్సిన అవసరముంది.

వీధి కుక్కల బెడద ఉందా?
గ్రేటర్ హైదరాబాద్ నగరంలో మీరు నివాసం ఉంటున్న ప్రాంతాల్లో వీధి కుక్కల బెడద ఉందా? అయితే మా టోల్ ఫ్రీ నంబరు 040 2111 1111 ఫిర్యాదు చేయవచ్చు అని జీహెచ్ఎంసీ తెలిపింది.



Read More
Next Story