
ఇతడే మక్కా మృత్యుంజయుడు
మొహమ్మద్ అబ్దుల్ షోయబ్ ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు..
"నా అన్న మొహమ్మద్ అబ్దుల్ షోయబ్ ప్రాణాలతో బయటపడ్డాడు. అంతా అల్హా ఇష్టం. మేమంతా ఆయన్ని చాలా సంతోషంగా వీడ్కోలు చేసి ఉమ్రా యాత్రకు పంపాం.... అన్న గుర్తుకు వస్తున్నాడు. అన్నను చూడాలి. నా పాస్ పోర్ట్ హజ్ కమిటీ ఆఫీస్‌లో ఇచ్చాను. వాళ్ళు ప్రయాణానికి ఏర్పాట్లు చేస్తామని చెప్పారంటూ" షోయబ్ తమ్ముడు భయం భయంతో ఫెడరల్ తెలంగాణాతో మాట్లాడాడు. "అంత పెద్ద ప్రమాదం నుంచి నా అన్న బయటపడినట్లేనా? ఇప్పుడు అన్నా ఎలా వున్నాడంటూ" హజ్ కమిటీ కార్యాలయంలోనే తిరుగుతున్నాడు షోయబ్ తమ్ముడు. ఉస్మానియా యూనివర్శిటీ సమీపంలోని రాంనగర్ గుండుకు చెందిన మొహమ్మద్ అబ్దుల్ షోయబ్ స్థానికంగా చిరు వ్యాపారం చేస్తాడు. ప్రస్తుతం అతని ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా వుంది. సౌదీ ప్రభుత్వ ఆసుపత్రిలోని ఇంటెన్సివ్ కేర్‌లో వైద్యులు అతనికి అత్యవసర చికిత్స అందిస్తున్నారు.
సౌదీ అరేబియాలో బస్సు ప్రమాదంలో 45 మంది హైదరాబాదీ ఉమ్రా యాత్రికులు మృతి చెందారు. మొత్తం 46 మందిలో ఒకరు షోయబ్ ప్రాణాలతో బయటపడ్డాడు.
హైదరాబాద్ విద్యానగర్‌కు చెందిన కుటుంబంలో తీరని శోకం...
రాంనగర్ గుండు పక్కనే విద్యానగర్ వుంటుంది. ఇక్కడి నుంచి 18 మంది సభ్యులున్న పెద్ద కుటుంబం ఉమ్రా యాత్రకు వెళ్లింది. చాలా సంతోషంగా వెళ్ళారు. "నా అన్నతో మాట్లాడాను. ఆయన స్టేటస్ పెట్టారు. మదీనా వెళుతున్న ఫొటోలు పెట్టారు. మా కుటుంబంలో ఎవరూ మిగలలేదు. 18 మంది మా కుటుంబ సభ్యులు చనిపోయారని" వారి సమీపబంధువు ది ఫెడరల్ తెలంగాణాతో తెలిపారు. "ఒకే కుటుంబానికి చెందిన 18 మంది ప్రాణాలు కోల్పోయారు. అన్నా, బాబాయి, తాతయ్య, మనవళ్ళు మృతుల్లో వున్నారు. ఆ కుటుంబానికి సంబంధించిన వారు జిద్దా వెళ్ళడానికి సిద్దం అవుతున్నారు". ముస్లింలు మక్కా వెళ్ళడం అల్లాహా వద్దకు వెళుతున్నట్లు ఫీల్ అవుతారు.
అంతా బాగానే వుంది. "సంతోషంగా మదీనా బయలుదేరారు. ఎవరూ ఊహించని విధంగా ఈ దుర్ఘటన జరిగింది. బస్సు ఎక్కే ముందు కూడా మా వాళ్ళు మాతో మాట్లాడారు". అంతా అల్లా ఇష్టం. జరగరానిది జరిగింది. మేం వెళ్ళతున్నాం. "అక్కడే అంత్యక్రియలు చేసి వస్తామంటున్నారు మృతుల బంధువులు".
కాబా సందర్శనను ఉమ్రా యాత్ర అంటారు. హైదరాబాద్‌కు చెందిన నాలుగు ట్రావెల్ ఏజెన్సీల తరఫున నవంబర్ 9వ తేదీన 45 మంది యాత్రికులు మక్కా వెళ్ళారు.
1. అల్ మక్కా ట్రావెల్స్ తరఫున 15,
2. బాబుల్ హర్‌మైన్ ట్రావెల్స్ తరఫున 21,
3. హఫ్సా ట్రావెల్స్ తరఫున 5,
4. మెహమూద్ భైజాన్ ట్రావెల్స్ తరఫున 4 గురు
మొత్తం ప్రయాణీకులు 45 ఉన్నారు. వీరిలో మహిళలు 28, పురుషులు 17.
ప్రమాద వార్త తెలియగానే సౌదీ అరేబియాలోని భారత రాయబార కార్యాలయ అధికారులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు పర్యవేక్షిస్తున్నారు. సౌదీ అధికారులు ఈ ప్రమాదంపై దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాదానికి గల కచ్చితమైన కారణాలు దర్యాప్తులో తేలాల్సి ఉంది.
మృతుల్లో కర్నాటకకు చెందిన ఓ వ్యక్తి కూడా ఉన్నారు. మక్కా వెళ్ళేవారు జనరల్‌గా మొత్తం కుటుంబ సభ్యులతో కలిసి మక్కా యత్ర చేస్తారు. అలా మొత్తం కుటుంబానికి కుటుంబాలు బస్సు మంటల్లో ప్రాణాలు కోల్పోయారు. "మృతదేహాలను సౌదీలోనే అంత్యక్రియల చేయడానికి బాధితుల బంధువులు ఒప్పుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం బాధిత కుటుంబాల నుంచి ఒక్కో మృతుడికి ఇద్దరు చొప్పున కుటుంబ సభ్యులను సౌదీకి తీసుకెళ్లేందుకు ఏర్పాట్లు చేస్తోందని" తెలంగాణా హజ్ కమిటీ ఛైర్మన్ Syed Ghulam Afzal Biyabani Khusro Pasha ది ఫెడరల్ తెలంగాణాతో చెప్పారు. వారికి పాస్‌పోర్టులు, వీసాలు త్వరగా అందించేందుకు స్పెషల్ డ్రైవ్ చేపట్టారు.
సౌదీ బస్సు ప్రమాద మృతుల కుటుంబాలకు 5 లక్షల రూపాయల పరిహారం తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. ప్రభుత్వ పరిహారంతో పాటు, ఉమ్రా యాత్రికులకు ఉన్న బీమా పాలసీల ద్వారా కూడా బాధిత కుటుంబాలకు ఆర్థిక సహాయం అందనుంది. ఉమ్రా ఇన్సూరెన్స్ పాలసీ ప్రకారం రూ.3 లక్షలు, సౌదీ పాలసీ ప్రకారం రూ.23 లక్షల వరకు పరిహారం అందే అవకాశం ఉంది.
ప్రభుత్వ ప్రతినిధి బృందాన్ని సౌదీ అరేబియాకు పంపాలని ఈ రోజు జరిగిన క్యాబినెట్ లో నిర్ణయం తీసుకున్నారు. ఈ బృందంలో మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ముహమ్మద్ అజారుద్దీన్, ఒక ఎమ్మెల్యే, మైనారిటీ విభాగం అధికారి ఉంటారు.
ఈ దుర్ఘటనకు సంబంధించిన సహాయం, సమాచారం కోసం హైదరాబాద్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. హెల్ప్‌లైన్ నంబర్లు 040-23231234, 9390100100 లను ప్రభుత్వం విడుదల చేసింది.

