
కోకాపేట ‘కోట్ల’ వెనక దాగిన పల్లెటూరి కథ తెలుసా?
నాలుగు అక్షరాల ఖరీదైన పేరు కోకాపేట.... ఈ స్థాయికి ఎలా వచ్చింది?
హైదఇపురాబాద్ నగర శివారులో ఎక్కడో విసిరేసినట్టుగా కనిపించే ప్రాంతం కోకాపేట. ఇప్పుడు ఐటీ నిపుణులతో శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. హైటెక్ సిటీకి సమీపంలో ఉండడం, గ్రేటర్ పరిధిలో ఉండడంతో ఇక్కడి భూముల ధరలు రాయదుర్గంతో పోటీ పడుతున్నాయి. ఇటీవల జరిగిన వేలంలో ఎకరా రూ.151.25 కోట్లకు అమ్ముడుపోయింది. ఫైనాన్షియల్ డిస్ట్రిక్‌లో ఉన్న ఈ ప్రాంతంలోని భూములు కాసులు కురిపిస్తాయి. 15 ఏళ్ల క్రితం ఆ ప్రాంతం ఎలా ఉండేదో తెలుసా..?
15 యేళ్ల కిందట కోకాపేట ‘ఎడారి’
ఈ ఫొటోలో చూడండి 2010లో కోకాపేట ప్రాంతం మెుత్తం నిర్మానుష్యంగా ఉంది. అక్కడ ఓ చిన్న గ్రామం, పక్కనే నిర్మాణంలో ఉన్న రోడ్డు, అక్కడక్కడ పంట పొలాలను చూడవచ్చు.
ఈ ఫొటో చూడండి. 2025..
ఇపుడు కాంక్రీట్ జంగిల్. హైదరాబాద్ నగరానికి మిలమిల మెరిసే వజ్రాహారం
అంటే ప్రస్తుతం గూగుల్ మ్యాప్ ఫోటో చూస్తే మాత్రం ఆశ్చర్యపోవాల్సిందే. అక్కడ పెద్ద పెద్ద బిల్డింగులు, ఆఫీసులు, రోడ్లు ఏర్పాటయ్యాయి. లండన్, న్యూయార్క్ ప్రాంతాల్లో ఉన్నట్లుగా భవంతులు, అపార్ట్‌మెంట్లు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం కోకాపేట తెలంగాణా రియల్ ఎస్టేట్ కి వజ్రాల హారంగా మారింది. ప్రపంచంలోని సంపందనంతా ఇక్కడే కుప్పపోశారా అన్నట్లు ఇక్కడి భవనాలు కనిపిస్తాయి. నాలుగు అక్షరాల ఖరీదైన పేరు కో కా పే ట.... ఈ స్థాయికి ఎలా వచ్చింది?
2001లో సాదా సీదా కుగ్రామం. అప్పట్లో కనీసం రోడ్డు లేదు. వ్యవసాయం లేదు. ఏమైనా కొనాలంటే నార్సింగ్‌కి వెళ్ళాల్సిందే. అలాంటి ఈ గ్రామం పేరు ప్రపంచ వ్యాప్తంగా నేడు వినిపిస్తోంది. ఇప్పుడు అక్కడ సామాన్యుడు స్థలం కొనే పరిస్థితి లేదు. ప్రకృతిని సర్వనాశనం చేశారని స్థానికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
"మా ఊరి పేరు టీవీల్లో చూస్తుంటే గర్వంగా వుంది. ఔటర్ రింగ్ రోడ్ వచ్చినప్పుడు 15 లక్షల రూపాయలకే 20 ఎకరాల పొలం ఓ సారి, 10 ఎకరాల పొలం 50 లక్షలకు మరో సారి అమ్మాం. ఇప్పుడు చాలా బాధపడుతున్నాం. అందుకే రోగాలు వస్తున్నాయి. మా ఊరిలో అదే కోకాపేటలో ఇప్పుడు 200 గజాలు ఆరున్నర కోట్లు వుంది. స్థానికులు కొందరే బాగుపడ్డారు. కొంత మందికి మంచి అయింది. సంతోషం అనిపిస్తోంది. బాధ అనిపిస్తోంది. ఇంత రేట్లు మా ఊరి భూములు పలుకుతున్నాయి.... ఏం చేస్తాం," స్థానిక మహిళ చంద్రమ్మ ఫెడరల్ తెలంగాణాతో చెప్పారు.
"నా చిన్నప్పుడు ఏది కావాలన్నా నర్సింగ్‌కు వెళ్ళేవారం. అప్పట్లో తక్కువ రేటుకు పోలాల్ని మా వాళ్ళు అమ్ముకున్నారు. మా భూమిలో ఇప్పుడు ఐటి కంపెనీలు వెలిశాయి. స్థానికంగా ఉన్న ఊరి వాళ్ళు బాగా నష్టపోయారు. 2005 కోటి 60 లక్షల చొప్పున 28 ఎకరాలు అమ్మాం," అని దీపిక చెప్పారు.
"40 ఏళ్ళుగా నేను కోకాపేటలో వుంటున్నా. బోధన్ నుంచి వచ్చా. అప్పుడు చిన్న గ్రామం. ఎకరం 5 వేలు, 10 వేలు వుంది. ఇప్పుడు బంగారం అయిపోయింది. స్థానికులు లక్షల్లో అమ్మారు. ఇప్పుడు కోట్ల రూపాయలు అయింది. గ్రామంలో పెంకుటిల్లు బదులు బిల్డింగ్‌లు వచ్చాయి. లక్షల్లో అద్దెలు వస్తున్నాయి. తెలివిగా వున్న వాళ్ళు, పైసల్ని జాగ్రత్తగా మేనేజ్ చేసుకున్నవాళ్ళు బాగుపడ్డారు. దెబ్బతిన్న వాళ్ళు దెబ్బతిన్నారు," రామారావు చెప్పారు.
"ఔటర్ రింగ్ రోడ్ రాక ముందే చాలా మంది లక్షల రూపాయలకే అమ్ముకున్నారు. రైతుల నుంచి కొన్న రియల్ ఎస్టేట్ వ్యాపారులు బాగుపడ్డారు. రైతులు ఆగమైయ్యారు. అమాయకంగా అమ్ముకున్నారు. రేట్లు పెరిగాయి. కానీ ఊరి వాళ్ళకు లాభం చేకూరలేదు," అని గోవర్ధన్ చెప్పారు.
"నా చిన్నప్పుడు ఇటువైపు గేదెలు, ఆవులు చనిపోతే పడేసేవారు. వాటిని తినడానికి పెద్ద పెద్ద గద్దలు వచ్చి వాలేయి. రౌండ్‌గా తిరుగుతూ వచ్చేవి. అలాగే ఇప్పుడు పెద్ద పెద్ద వ్యాపారస్థులు వచ్చి అలా... వాలిపోయారు. చని పోతే బొందపెట్టడానికి కూడా జాగా లేదు. గరీబు వాళ్ళకు బ్రతకడానికి స్థలం లేదు. ఒక గజం కొనే స్థితి లేదు. ఎవరైనా బిక్షగాడు చనిపోతే ఎక్కడ బొందపెట్టాలి. కాకులకు గద్దలకు వెయాలా ఆ స్థితి వచ్చింది."
"ఊరి వాళ్ళు నాశనం అయ్యారు. రైతులు మోసపోయారు. 2005 నుంచి రైతుల వద్ద నుంచి 5 లక్షలు, 10 లక్షలకు కొనేశారు. ఇప్పుడు కోట్ల రూపాయలకు అమ్ముకుంటున్నారు. డబ్బులు చేసుకుని దొరికినంత పుచ్చుకుని వెళ్ళిపోతున్నారు. రాజకీయనాయకుల స్వార్థంకు కోకాపేట ప్రజలు, రైతులు బలి అయిపోయారు." "ఓ ఆర్ ఆర్ వస్తుంది. మీ భూమి పోతుంది. అంటూ భయపెట్టారు. బ్రోకర్లు వాళ్ళ కమీషన్ కోసం, అన్ని రాజకీయ పార్టీల నేతలు, వాళ్ల చెంచాలకు కోకాపేట బలి అయిపోయింది. నా వయస్సు అయిపోయింది. ఏం చేసి బ్రతకాలి. వాళ్ళ దగ్గర చీపురితో ఊడ్చి బ్రతకాలి. గతంలో సైకిల్‌పై ఆకుకూరలు అమ్మి హాయిగా బ్రతికాం. ఇప్పుడు ఆ హాయి లేదు. మొత్తం పోయింది. రోగాలు మిగిలాయి. విసుగు వేస్తోంది. రాజకీయా పార్టీలన్నీ కుమ్మక్కై రైతులకు మోసం చేశారు. రాజకీయ దొంగలు కోకాపేటను దోచుకున్నారు," అని గోపాల్ రావు చెప్పారు.

