బషీర్‌బాగ్‌ కాల్పులకు 25 ఏళ్లు
x

బషీర్‌బాగ్‌ కాల్పులకు 25 ఏళ్లు

బషీర్ బాగ్ దహనకాండ


బషీర్ బాగ్ రణనాదంలా ఎప్పటికీ కనిపిస్తూనే ఉంటుంది... వినిపిస్తూనే ఉంటుంది. శాంతిభద్రతలను సంరక్షించడం అనే సాకుతో ఎంతటి రాక్షసత్వాన్ని అయినా ప్రదర్శించడం ఈ దేశంలో పోలీసులకే చెల్లుతుంది. అది ఏ రాష్ట్రమైనా, ఏ ప్రభుత్వమైనా అది పోలీసుల పేటెంటు రైటుగా ఉంటుంది. ఒక ఇంద్రవెల్లి, ఒక టంగటూరు, ఒక చీరాల, ఒక బషీర్‌బాగ్.. ఇలా ప్లేసు ఏదైనా తుపాకీ రాజ్యానికి అద్దూఅదుపూ ఉండదు.! పోలీసుల కాల్పుల ఘటనలు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నో జరిగాయి.. అందులో కొన్ని మాయని మచ్చలూ ఉన్నాయి. అవి ప్రభుత్వాలను గద్దె కూడా దింపాయి.. ఉద్యమాలకు ఊపిరులూదాయి..!

పెరిగిన విద్యుత్ ఛార్జిలను తగ్గించాలని డిమాండ్‌ చేస్తూ ‘ఛలో అసెంబ్లీ’కి పిలుపునిచ్చిన కమ్యూనిస్టు పార్టీల కార్యకార్తలపై, వారికి మద్దతుగా నిలిచిన కాంగ్రెస్‌ కార్యకర్తలపై నాటి పోలీసులు ఎలాంటి హెచ్చరికా లేకుండా బుల్లెట్ల వర్షం కురిపించారు. ఇదంతా హైదరాబాద్‌ నడిబొడ్డున, అసెంబ్లీకి అతి దగ్గరలోని బషీర్‌బాగ్‌ చౌరస్తాలో జరిగింది. గుర్రాలతో, తుపాకులతో ఉద్యమాన్ని అణచివేయాలని నాటి ప్రభుత్వం భావించడం చంద్రబాబు రాజకీయ జీవితంలో ఎప్పటికీ మాయని మచ్చ. అందుకే ఘటన జరిగి 25 ఏళ్లు గడిచినా ఇప్పటికీ బషీర్‌బాగ్‌ దమనకాండ ఆయన్ను నీడలా వెంటాడూనే ఉంది.

విద్యుత్‌ చార్జీలను భారీగా పెంచి ప్రజలపై భారం మోపడాన్ని నిరసిస్తూ చంద్రబాబుకు నేటి బీ.ఆర్‌.ఎస్. అధినేత, తెలంగాణా మాజీ సి.ఎం, నాటి డిప్యూటీ స్పీకర్‌ కె.చంద్రశేఖరరావు లేఖ ద్వారా తమ అసంతృప్తిని తెలిపారు. ఆ తర్వాత డిప్యూటీ స్పీకర్‌ పదవికి, టీడీపీకి కేసీఆర్‌ రాజీనామా చేసి, మలిదశ ప్రత్యేక తెలంగాణ ఉద్యమాన్ని చేపట్టేందుకు, తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పాటునకు విద్యుత్‌చార్జీల ఉద్యమం, కాల్పుల ఘటన పరోక్షంగా కారణమైంది.

అప్పుడు ఏం జరిగింది?

తూటాలకు వెరవని క‌మ్యూనిస్టు పార్టీ కార్య‌క‌ర్త‌ల‌ ఆవేశం ఒక‌వైపు, పేలిన తూటాలు, విరిగిన లాఠీలు, నెత్తురోడిన రోడ్లు మ‌రోవైపు. స‌రిగ్గా 25 ఏళ్ల కింద‌ట హైద‌రాబాద్‌ లోని బ‌షీర్ బాగ్‌లో ఇది ప‌రిస్థితి. హైద‌రాబాద్ లోని బషీర్‌బాగ్ చౌర‌స్తా 2000 సంవ‌త్స‌రం ఆగ‌స్టు 28న పోలీసుల కాల్పులతో ద‌ద్ద‌రిల్లింది. ప్ర‌భుత్వం విద్యుత్ ఛార్జీలు పెంచ‌డాన్ని నిర‌సిస్తూ చ‌లో అసెంబ్లీ కార్య‌క్ర‌మం చేప‌ట్టిన‌వారిపై పోలీసులు లాఠీచార్జి చేశారు, కాల్పులు జ‌రిపారు. ఈ ర్యాలీ బ‌షీర్‌ బాగ్ వ‌ద్ద‌కు చేరుకోగా ఉద్రిక్తంగా మారింది. పోలీసుల కాల్పులతో బషీర్‌ బాగ్ నెత్తురోడింది. బాలస్వామి, విష్ణువర్ధన్‌, రామకృష్ణ పోలీసు తూటాలకు తీవ్రంగా గాయపడి...ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు.

హైదరాబాద్‌ నడిబొడ్డున, అసెంబ్లీకి కూతవేటు దూరంలో పోలీసుల తుపాకీ గుళ్లకు ముగ్గురు నేలకొరిగారు. ప్రపంచబ్యాంక్‌ షరతులకు తలొగ్గి ప్రైవేటీకరణ విధానాల అమలు, విద్యుత్‌రంగ సంస్కరణల్లో భాగంగా చంద్రబాబు సర్కార్‌ విద్యుత్‌చార్జీలు పెంచుతూ తీసుకున్న నిర్ణయంపై అప్పట్లో రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు భగ్గుమన్నాయి. గణనీయంగా పెరిగిన గృహావసరాల కరెంట్‌ చార్జీలను తగ్గించాలంటూ పెద్ద ఎత్తున విజ్ఞప్తులు వెల్లువెత్తినా సీఎం చంద్రబాబు పట్టించుకోలేదు. తొలుత సీపీఐ, సీపీఎం, న్యూడెమోక్రసీ, ఇతర వామపక్షాలు కలిసి రాష్ట్రవ్యాప్త ఆందోళన చేపట్టాయి.

దాదాపు నాలుగు నెలలపాటు సాగిన నిరసనల సందర్భంగా 25 వేలకు పైబడి కార్యకర్తలపై కేసులు నమోదయ్యాయి. మరోవైపు అప్పటి సీఎల్పీ నేత రాజశేఖరరెడ్డి ఆధ్వర్యంలోనూ విద్యుత్‌ చార్జీల ఉద్యమం ఉధృతమైంది. ఓల్డ్‌ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో 90 మంది ఎమ్మెల్యేలతో విపక్షనేత డాక్టర్‌ వైఎస్సార్‌ నిరవధిక నిరాహారదీక్షను మొదలుపెట్టి రాష్ట్ర ప్రభుత్వానికి ఒక్కసారిగా షాక్‌ తగిలేలా చేశారు.

ఆ రోజు ఏమైందంటే...

విద్యుత్‌ చార్జీల వ్యతిరేక ఉద్యమం తీవ్రమవుతున్న దశలోనే శాసనసభ సమావేశాల నిర్వహణకు ప్రభుత్వం నిర్ణయం తీసుకోగా, ఆగస్టు 28న వామపక్షాలు, కాంగ్రెస్‌ పార్టీ విడివిడిగా ‘చలో అసెంబ్లీ’కి పిలుపునిచ్చాయి. అడుగడుగునా పోలీసులు అడ్డంకులు కల్పించినా వేలాదిమంది కార్యకర్తలు ఇందిరాపార్కు ధర్నాచౌక్‌కు చేరుకున్నారు. అక్కడి నుంచి శాంతియుతంగా గుంపులు గుంపులుగా అసెంబ్లీ వైపు కదిలారు. ఇనుప కంచెలు, బ్యారికేడ్లతో నిలువరించే ప్రయత్నం చేసినా వాటిని తోసుకుంటూ ప్రదర్శనగా బషీర్‌బాగ్‌ వైపు సాగారు. బషీర్‌బాగ్‌ చౌరస్తాలోని ఫ్లైఓవర్‌ కింద పెద్దసంఖ్యలో పోలీసులను మోహరించారు. అశ్వికదళాలు సైతం కదంతొక్కాయి. అక్కడకు కార్యకర్తలు చేరుకోకుండా పోలీసులు ఎక్కడికక్కడ లాఠీచార్జీలు, భాష్పవాయుగోళాలు ప్రయోగించి, గుర్రాలతో అడ్డుకునే చర్యలు తీవ్రం చేశారు. అయినప్పటికీ అసెంబ్లీ వైపునకు పరుగులు తీస్తున్న కార్యకర్తలపై చివరకు పోలీసు కాల్పులు జరపడంతో సత్తెనపల్లి రామకృష్ణ, బాలస్వామి, విష్ణువర్ధన్‌రెడ్డిలకు తుపాకీ గుళ్లు తగిలి అసువులు బాశారు. ఆ విధంగా బషీర్‌బాగ్‌ ప్రాంతం రక్తసిక్తమైంది.

అసలు విద్యుత్ పోరాటానికి కారణమేంటి?

ఒకటి కాదు, రెండు కాదు.. విద్యుత్ ఛార్జీల పెంపు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ప్రజలతో కమ్యూనిస్టు పార్టీలు ఆరు నెలలకుపైగా నిరసనలు, ధర్నాలు, బంద్‌లు చేపట్టిన రోజులవి. ప్రజావ్యతిరేకతను ఏ మాత్రం పట్టించుకోని నాటి చంద్రబాబు ప్రభుత్వం 2000 జూన్‌లో విద్యుత్‌ ఛార్జీల పెంపు నిర్ణయాన్ని అమల్లోకి తెచ్చింది. దీంతో ప్రజల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఊరూరా ఆందోళనలు మొదలయ్యాయి. నాడు ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్‌ పార్టీ ఈ ఉద్యమాన్ని తమకు అనుకూలంగా మలుచుకుంది. వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి 90మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో కలిసి హైదరాబాద్‌లో నిరవధిక నిరాహార దీక్షకు దిగారు.

అటు టీడీపీకి మిత్రపక్షంగా ఉన్న బీజేపీ సైతం విద్యుత్‌ ఛార్జీల పెంపు నిర్ణయాన్ని బహిరంగంగానే వ్యతిరేకించింది. ప్రపంచ బ్యాంకు చేతిలో టీడీపీ కీలుబొమ్మగా మారిందని బీజేపీ ఫ్లోర్ లీడర్ ఇంద్రసేనారెడ్డి అసెంబ్లీ వేదికగా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బ్యాంకు నుంచి విచక్షణారహితంగా రుణాలు తీసుకుని రాష్ట్రాన్ని ఆర్థిక బానిసత్వం వైపు తీసుకెళ్తున్నారని విమర్శించారు. ఇంతటి వ్యతిరేకత తర్వాత కూడా చంద్రబాబు తన నిర్ణయాన్ని మార్చుకోకపోవడం నిరసనలను తీవ్రతరం చేసింది.

ఇనుప కంచెలు, భాష్పవాయువుగోళాలు..

నిరసనలు అమాంతం పెరిగి ‘ఛలో అసెంబ్లీ’ పిలుపుకు కారణమైంది. కమ్యూనిస్టు పార్టీల పిలుపుకు రాష్ట్రంలోని దాదాపు అన్ని జిల్లాల నుంచి ప్రజలు తరలివచ్చారు. ముందుగా ఇందిరాపార్కు దర్యాచౌక్‌కు చేరుకున్న నిరసనకారులు అక్కడ నుంచి అసెంబ్లీ వైపు కదిలారు. అయితే పోలీసులు అడుగడుగునా అడ్డం పడ్డారు. ఎక్కడిక్కడ బారికెడ్లను ఏర్పాటు చేశారు. అయినా ఎవరు వెనక్కి తగ్గలేదు. అలా ర్యాలీ బషీర్‌బాగ్‌కు చేరుకుంది. అప్పటికే అక్కడ పెద్ద సంఖ్యలో పోలీసులు ఉన్నారు. గుర్రలతో వ్యానులతో కాపు కాచుకోని ఉన్నారు. నిరసనకారులను అసెంబ్లీ వైపు కదలనివ్వకుండా ఆపేశారు. దీంతో ముందు వాగ్వాదం జరిగి తర్వాత అది కాల్పులకు దారి తీసింది.

బషీర్‌బాగ్ చౌరస్తాలో దాదాపు లక్షమందిపైగా నిరసనకారులు పాల్గొన్నారు. దాదాపు 4 వేలమందికి గాయలయ్యారు. 150 మంది ఆస్పత్రిపాలయ్యారు. రెండు గంటల పాటు ఈ హింసాకాండ సాగింది. పోలీసుల దాడిలో 26 మందికి బుల్లెట్ గాయాలయ్యాయి. ఆందోళనకారులపై పోలీసులు విచక్షణారహితంగా లాఠీచార్జి చేసిన దృశ్యాలను తేజ టీవీ ఛానల్ ప్రసారం చేసింది. నిరసనకారుల తలలను లక్ష్యంగా చేసుకుని కర్రలతో పోలీసులు ఎలా దాడి చేశారో ప్రజలంతా చూశారు. నిరసనకారులపై వాటర్‌ కెనన్లతో పోలీసులు ఎలా విరుచుకుపడ్డారో టీవీలో ప్రసారం అయ్యింది.

చంద్ర‌బాబు ప్రభుత్వం ఎందుకిలా చేసింది?

హితేన్ భయ్యా కమిటీ విద్యుత్ శక్తి రంగానికి సంబంధించిన మార్పులను తన శ్వేత పత్రంలలో సూచించింది. ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డును ప్రైవేట్ పరం చేయడానికి విద్యుత్ ఉత్పత్తి, ట్రాన్స్మిషన్ పంపిణీ రంగాలను వేరు చేయాలని, ఎలక్ట్రిసిటీ బోర్డు పర్యవేక్షణ మాత్రమే చేయాలని, విద్యుత్ విక్రయానికి సంబంధించిన నిర్ణయాలను రెగ్యులేటరీ కమీషన్ మాత్రమే చేపడుతుందని సూచించారు.

ఆంధ్రప్రదేశ్ ఆర్థిక సంస్కరణల ఎజెండా పేరిట 1996లో ప్రపంచ బ్యాంకు ఏపీ ప్రభుత్వానికి ఓ నివేదిక ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం ఎదుర్కొంటున్న ఆర్థిక సంక్షోభం గురించి, దాన్ని అధిగమించే పరిష్కార మార్గాల గురించి ప్రపంచబ్యాంకు అందులో ప్రస్తావించింది. లిబరలైజేషన్ అనుకూల వ్యూహాల అమలు వైపు ప్రభుత్వ విధానాలను మళ్ళింపజేసేందుకు ఈ డాక్యుమెంట్స్‌ ప్రాతిపదిక అయ్యాయి. వివిధ రకాల సబ్సిడీలపై ప్రభుత్వం పెడుతున్న ఖర్చు, అవసరానికి మించి ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు, వారి జీతభత్యాల ఖర్చు లాంటివి ఆర్థిక సంక్షోభానికి కారణమని ప్రభుత్వం చెప్పడం మొదలు పెట్టింది.

విద్యుత్ రంగంలో ప్రైవేటు సంస్థల ప్రయోజనాల కోసమే టారిఫ్‌ల పెంపు జరిగిందని లెఫ్ట్ పార్టీ నేతలు ఆరోపించారు.మౌలిక సదుపాయాలు, సేవా రంగాల్లో ప్రైవేటు పెట్టుబడులు ఆహ్వానించడం, సబ్సిడీల ఉపసంహరణ, ప్రభుత్వరంగ సంస్థల నుంచి పెట్టుబడుల ఉపసంహరణ లాంటి చర్యల ద్వారా ప్రభుత్వ వ్యయాన్ని కుదించడమన్నది ఈ సమస్యకు పరిష్కారమని ప్రపంచబ్యాంకు చెప్పింది.

దీంతో ప్రైవేటీకరణ అన్నది రాష్ట్ర ప్రభుత్వానికి తారకమంత్రమైంది. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పునర్వ్యస్థీకరణ పేరుతో గ్రాంట్‌ను ప్రపంచ బ్యాంకు మంజూరు చేసింది. విద్యుత్ రంగ సంస్కరణలకు ప్రపంచ బ్యాంకు 4460 మిలియన్ డాలర్లను అప్పుగా ఇచ్చింది. సంస్కరణలో భాగంగా కరెంట్ మీద ప్రజలకు ఇస్తున్న సబ్సిడీని తగ్గించి 15% నుంచి 20% విద్యుత్ రేట్లను (1999-2009 మధ్య) సంవత్సరానికి ఒకసారి పెంచాలని ప్రపంచ బ్యాంకు షరతులను విధించింది.

సాగునీటి సదుపాయాల అభివృద్ధి, గ్రామీణ రోడ్ల మరమ్మత్తులు, విద్యుత్‌రంగ సంస్కరణలు, ఉన్నత విద్య ప్రైవేటీకరణ లాంటి పలు అంశాలు ఇందులో ఉన్నాయి.హితేన్ భయ్యా కమిటీ సూచనలను, ప్రపంచ బ్యాంకు షరతులను చంద్రబాబు ప్రభుత్వం వెంటనే అమలు చేసింది. దీనిలో భాగంగా విద్యుత్ రంగాన్ని ప్రైవేటీకరించడానికి సంబంధించిన బిల్లు (విద్యుత్ సంస్కరణల చట్టం)ను 1998 ఏప్రిల్ 28న అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. 1999 మార్చిలో ఆంధ్రప్రదేశ్ విద్యుత్ రెగ్యులేటరీ కమీషన్ ఏర్పాటు చేసారు. (A.P.S.E.B) ‘ఏ.పి.ఎస్.ఇ.బి.’ని ఎ.పి.జెన్కో, ఎ.పి. ట్రాన్స్కోలుగా విడదీశారు. 2000 ఏప్రిల్లో విద్యుత్ పంపిణీని 4 కంపెనీలకు అప్పగించారు.

ప్రజల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురైనప్పటికీ వీటిని అమలు చేసింది నాటి చంద్రబాబు ప్రభుత్వం. ఇక కరెంటు చార్జీల పెంపుతో పాటు సింగరేణి, ఆల్విన్ తదితర ప్రభుత్వరంగ సంస్థల ప్రైవేటీకరణ ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ రాష్ట్రంలో భారీ ఉద్యమాలు జరిగాయి. వాటిని అణచివేసేందుకు పోలీసుల బలప్రయోగాలూ జరిగాయి. అందులో బషీర్‌బాగ్‌ కాల్పుల ఘటన ఒకటి.

Read More
Next Story