కుప్పకూలి మరణించిన టెన్త్ విద్యార్థి..
x

కుప్పకూలి మరణించిన టెన్త్ విద్యార్థి..

కొట్టి చంపేసుంటారని అనుమానాలు వ్యక్తం చేస్తున్న తల్లిదండ్రులు.


హనుమకొండ నయీం నగర్‌లోని తేజస్వి స్కూల్‌లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆడుకుంటూ ఆడుకుంటూ టెన్త్ విద్యార్థి ఒక్కసారిగా కుప్పకూలాడు. మిగిలిన పిల్లలంతా దగ్గరకు వెళ్లి చూసేసరికే ప్రాణాలు విడిచాడు. తేజస్వీ స్కూల్‌లో జయంత్ వర్ధన్ అనే విద్యార్థి పదో తరగతి చదువుతున్నారు. ఎప్పటిలానే ఉల్లాసంగా స్కూలుకు వెళ్లాడు. మధ్యాహ్నం స్పోర్ట్స్ ఆడుతున్న సమయంలో ఏమైందో ఏమో కానీ ఒక్కసారిగా కుప్పకూలాడు. తొలుత ఆడుతూ పడి ఉంటాడనుకున్నారు తొటి విద్యార్థులు. అయితే ఎటువంటి కదలిక లేకపోవడంతో టీచర్లు సహా విద్యార్థులు జయంత్ వర్ధన్ దగ్గరకు పరుగులు తీశారు. హుటాహుటిన అతడిని ఆసుపత్రికి తరలించారు. కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. కాగా జయంత్ అప్పటికే మరణించాడని వైద్యులు నిర్ధారించారు. దీంతో అసలేమైంది అన్నది ఎవరీక అర్థం కాలేదు. కానీ తల్లిదండ్రులు మాత్రం తమ కుమారుడిని కొట్టి చంపేశారన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

ముక్కు నుంచి రక్తం..

పాఠవాల నుంచి సమాచారం అందిన వెంటనే తల్లిదండ్రులు ఆసుపత్రికి చేరుకున్నారు. అక్కడ వైద్యులు చెప్పిన మాటలు విని తల్లడిల్లిపోయారు. కాగా తన కుమారుడి ముక్కు నుంచి రక్తం వచ్చిన మరక ఉందని, తమ కుమారిడిని కచ్చితంగా కొట్టి చంపసుంటారన్న అనుమానాలను తల్లిదండ్రులు వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు వాళ్లు పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. తల్లిదండ్రులు ఫిర్యాదు మేరకు పోలీసులు రంగంలోకి దిగి దర్యాప్తు ప్రారంభించారు. సీసీటీవీ ఫుటేజీలు, అసలు పాఠశాలలో ఏం జరిగింది? జయంత్ వర్ధన్ నడవడికలో ఏమైనా మార్పులు ఉన్నాయా? వంటి అంశాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

అయితే జయంత్ వర్ధన్ ముక్కు నుంచి రక్తం వచ్చిన మార్క్ ఉందన్న తల్లిదండ్రుల వాదనపై పోలీసులు అనేక కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ముక్కు నుంచి అసలు రక్తం ఎందుకు వచ్చింది? కుప్పకూలి పడిన సమయంలో నేత తగిలి వచ్చిందా? లేదంటే తల్లిదండ్రులు ఆరోపిస్తున్నట్లు ఎవరైనా బలంగా కొట్టడం జరిగిందా? అన్న కోణాల్లో కూడా దర్యాప్తు చేస్తున్నారు.

పెరుగుతున్న హఠాన్మరణాలు..

ఇదిలా ఉంటే ఇటీవల కాలంలో చిన్నారులు ఒక్కసారిగా కుప్పకూలి మరణిస్తున్న ఘటనలు చాలా వెలుగు చూస్తున్నాయి. అప్పటి వరకు చాలా ఆరోగ్యంగా.. ఆడుతూ పాడుతూ ఉన్న పిల్లలు సైతం ఒక్కసారిగా కుప్పకూలుతున్నారు. మరుక్షణమే ప్రాణాలు వదిలేస్తున్నారు. ఈ కేసులు పెరుగుతున్న క్రమంలో అధికారులు సైతం ఈ అంశంపై దృష్టి పెట్టాలని, అసలు ఈ హఠాన్మరణాలకు కారణాలు ఏంటో తెలుసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. అధికారులు సైతం చిన్నారులు, యువకుల్లో పెరుగుతున్న ఈ మరణాలకు అసలు కారణం తెలుసుకోవడానికి ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నారు.

Read More
Next Story