ఏరోస్పేస్ విస్తరణతో 1200 కొత్త ఉద్యోగాలు
x
రఘువంశీ ఏరోస్పేస్ సంస్థ కొత్త కర్మాగారానికి శంకుస్థాపన చేస్తున్న మంత్రి శ్రీధర్ బాబు

ఏరోస్పేస్ విస్తరణతో 1200 కొత్త ఉద్యోగాలు

తెలంగాణలో నిరుద్యోగులకు శుభవార్త. విమాన ఇంజన్ల విడిభాగాలు,రక్షణరంగ ఉత్పత్తుల తయారీలో గణనీయవృద్ధిని సాధించిన రఘువంశీ ఏరోస్పేస్ విస్తరణ పనులకు శ్రీకారం చుట్టింది.


విమాన ఇంజన్ల కీలక విడిభాగాలు, రక్షణరంగ ఉత్పత్తుల తయారీలో గణనీయ వృద్ధిని సాధించిన రఘువంశీ ఏరోస్పేస్ భారీ విస్తరణపనులకు శ్రీకారం చుట్టింది. గురువారం శంషాబాద్ ఏరోస్పేస్ పార్క్ లో రఘువంశీ ఏరోస్పేస్ సంస్థ కొత్త కర్మాగారం నిర్మాణానికి ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు శంకుస్థాపన చేశారు.

- రూ.300 కోట్ల వ్యయంతో 2 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మితమయ్యే ఈ పరిశ్రమ రానున్న మూడేళ్లలో 1200 మందికి ఉద్యోగావకాశాలు కల్పిస్తుందని ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు.

రూ.2 వేల కోట్ల ఆర్డర్లు
రఘువంశీ ఏరోస్పేస్ చేతిలో ఉన్న రూ.2 వేల కోట్ల ఆర్డర్లకు సంబంధించిన పరికరాలు ఈ నూతన సదుపాయంలో ఉత్పత్తి అవుతాయని మంత్రి తెలిపారు. ఎయిర్ బస్ ఏ320, బోయింగ్ 737 మ్యాక్స్ విమానాల ఇంజన్లకు, జిఇ ఏరోస్పేస్, రోల్స్ రాయిస్, ప్రాట్ అండ్ విట్నీ, సఫ్రన్, హానీవెల్ విమాన ఇంజన్లను తయారు చేసే సంస్థలకు రఘువంశీ కీలకమైన విడిభాగాలను సరఫరా చేస్తుందని శ్రీధర్ బాబు వెల్లడించారు.

రాష్ట్ర ప్రతిష్ఠ పెరిగింది...
2002లో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమగా ప్రారంభమైన రఘువంశీ ప్రస్థానం ప్రపంచ ప్రఖ్యాత విమాన తయారీ సంస్థలకు ఫ్యూయల్ పంపులు, ల్యాండింగ్ గేర్ల లాంటి ముఖ్య పరికరాలను ఉత్పత్తి చేసే స్థాయికి చేరి ఏరోస్పేస్ రంగంలో రాష్ట్ర ప్రతిష్ఠను ఇనుమడింప చేసిందని శ్రీధర్ బాబు ప్రశంసించారు. డిఆర్ డిఓ, భారత అంతరిక్ష పరిశోధన సంస్థ, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ , భారత్ డైనమిక్స్ లిమిటెడ్ లాంటి ప్రభుత్వరంగ సంస్థలకు పరికరాలు, విడిభాగాలను అందజేస్తోందని ఆయన వివరించారు.

పరిశ్రమలతో ఉపాధి
ముడి చమురు, సహజవాయువును వెలికితీసే పరిశ్రమలకు, ఆరోగ్య రంగంలో వినియోగించే పరికరాలను తయారు చేస్తోందని మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు. హైదరాబాద్ ఏరోస్పేస్ ఎస్ ఇ జెడ్ లో టాటా, భారత్ ఫోర్జ్, ఆదానీ లాంటి ప్రఖ్యాత కంపెనీలు కూడీ వైమానిక, రక్షణ, అంతరిక్ష వాహనాల ఉత్పత్తులను తయారు చేస్తున్నాయని శ్రీధర్ బాబు పేర్కొన్నారు. ఈ ఏరోస్పేస్ సంస్థలకు రకరకాల విడిభాగాలను అందించే 1500 సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు వేలాది మందికి ఉపాధి కల్పిస్తున్నాయని ఆయన చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన ఎంఎస్ ఎమ్ఇ పాలసీ ప్రకారం ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల్లో ఏర్పాటు చేసే పరిశ్రమలకు ప్రోత్సాహకాలు అందిస్తామని శ్రీధర్ బాబు వెల్లడించారు.


Read More
Next Story