
జూబ్లీహిల్స్‌లో సెక్షన్ 144 అమలు..
ఉపఎన్నిక నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించిన సీపీ సజ్జనార్.
ఉపఎన్నిక పోరుకు జూబ్లీహిల్స్ నియోజకవర్గం సన్నద్ధం అవుతోంది. అన్ని పార్టీలు ప్రచార రథాలను వేగంగా ముందుకు నడిపిస్తున్నాయి. ఈ క్రమంలో పోలీసులు సైతం ఎక్కడిక్క ఆంక్షు విధిస్తూ పోలింగ్ ప్రక్రియ సజావుగా సాగేలా చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో సెక్షన్ 144 అమలు చేయనున్నట్లు హైదరాబాద్ సీపీ సజ్జనార్ వెల్లడించారు. ఈ ఆంక్షలు నవంబర్ 9 సాయంత్రం 6 గంటల నుంచి నవంబర్ 11 సాయంత్రం 6 గంటల వరకు అమల్లో ఉంటాయని, అదే విధంగా తిరిగి ఓట్ల లెక్కింపు ప్రక్రియ జరిగే నవంబర్ 14 ఉదయం 6 గంటల నుంచి నవంబర్ 15 సాయంత్రం 6 గంటల వరకు అమల్లో ఉంటుందని సజ్జనార్ తెలిపారు. ఈ ఆంక్షలు అమల్లో ఉండే సమయాన్ని నియోజకవర్గం అంతటా క్లబ్‌లు, పబ్‌లు, మద్యం దుకాణాలు అన్నీ మూసీ వేయాలని ఆయన తెలిపారు. హోటళ్లు, రెస్లారెంట్‌లు కూడా మూసి వేయాలన్నారు. శాంతిభద్రతల నేపథ్యంలోనే తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన చెప్పారు. పోలింగ్ కేంద్రాలకు 200 మీటర్ల పరిధిలో ఐదుగురు, అంతకన్నా ఎక్కువ మంది గుమిగూడటం, జనావాసాల్లో టపాసులు పేల్చడం నిషేధమని చెప్పారు. ఆదేశాలను ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
అన్ని ఏర్పాట్లు సిద్ధం..
ఉపఎన్నిక పోలింగ్‌కు భద్రత కూడా భారీగా ఉండనుంది. పోలింగ్‌ను పరిశీలించడం కోసం 509 కంట్రోల్ యూనిట్లు, 509 వీవీ ప్యాడ్లు సిద్ధం చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఈవీఎంల ర్యాండమైజేషన్‌ను కూడా పూర్తి చేసినట్లు తెలిపారు. అదే విధంగా ఓటర్లను ఏ అభ్యర్థి కూడా మభ్య పెట్టకుండా ఉండటం కోసం వాహనాల తనిఖీలను కూడా అధికారులు ముమ్మరంగా చేపడుతున్నారని చెప్పారు.
ఉపఎన్నిక నేపథ్యంలో మొత్తం 127 పోలింగ్ స్టేషన్లలో 407 పోలింగ్ బూత్‌లను ఏర్పాటు చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఒక్కో పోలింగ్ బూత్‌కు నాలుగు యూనిట్ల చొప్పున మొత్తం 1,628 బ్యాలెట్ యూనిట్లను సిద్దం చేసిట్లు చెప్పారు. అంతేకాకుండా పోలింగ్ సమయంలో ఎక్కడయినా బ్యాలెట్ యూనిట్లు మొరాయిస్తే వాటిని రీప్లేస్ చేయడం కోసం అదనంగా 20శాతం బ్యాలెట్ యూనిట్లను సిద్ధంగా ఉంచుకున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఉపఎన్నిక పోలింగ్ ఎట్టిపరిస్థితుల్లో సాఫీగా సాగేలా చర్చలు తీసుకుంటున్నట్లు చెప్పారు.
ఎవరి వ్యూహాలు వారివి..
జూబ్లీహిల్స్ కోటపై జెండా ఎగరవేయడం కోసం అన్ని పార్టీలు తమతమ వ్యూహాలను ఆచరిస్తున్నాయి. వినూత్నంగా ప్రజల్లోకి వెళ్లడానికి ప్రయత్నిస్తున్నాయి. కాంగ్రెస్ వాళ్లు తమ ప్రభుత్వం చేసిన పనులను, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరిస్తున్నాయి. మరోవైపు బీఆర్ఎస్.. కాంగ్రెస్ అమలు చేయని హామీలను విస్తృతంగా ప్రచారం చేస్తున్నాయి. ఒక బీజేపీ.. బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండూ కూడా తెలంగాణను దోచుకున్నాయంటూ గత ప్రభుత్వాల వైఫల్యాలను ఎత్తి చూపుతున్నాయి.

