మియాపూర్, చందానగర్ లో 144 సెక్షన్.. ఉల్లంఘిస్తే సీరియస్ యాక్షన్
x

మియాపూర్, చందానగర్ లో 144 సెక్షన్.. ఉల్లంఘిస్తే సీరియస్ యాక్షన్

హైదరాబాద్ లోని మియాపూర్, చందానగర్ లో సైబరాబాద్ పోలీసు అధికారులు 144 సెక్షన్ విధించారు.


హైదరాబాద్ లోని మియాపూర్, చందానగర్ లో సైబరాబాద్ పోలీసు అధికారులు 144 సెక్షన్ విధించారు. మియాపూర్ లోని సర్వే నెంబర్ 100, 101 వద్ద ల్యాండ్ వివాదం నడుస్తున్న నేపథ్యంలో భారీ భద్రత ఏర్పాటు చేశారు. వెయ్యి మంది పోలీసులను మోహరించి ఘర్షణలు అదుపుచేసేందుకు ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తెచ్చుకున్నారు. ఇక్కడ ఉన్న వందల ఎకరాల స్థలాన్ని కొంత మంది ఆక్రమించేందుకు ప్రయత్నిస్తుండటంతో పోలీసులు భూమి చుట్టూ ఉన్న రోడ్ల వద్ద బారికేడ్లు ఏర్పాటు చేసి ఎవరినీ లోనికి అనుమతించడం లేదు.

ఇది ప్రభుత్వ భూమి అని, దీని విస్తీర్ణం 450 ఎకరాలు ఉంటుందని, ప్రస్తుతం ఈ భూమి హెచ్ఎండిఏ ఆధీనంలో ఉందని ఎస్టేట్ ఆఫీసర్ తెలిపారు. అయితే కావాలని కొంతమంది ఈ భూమిలో గుడిసెలు వేసుకోవచ్చనే వదంతులను సృష్టించి, వాట్సాప్ లో ప్రచారం చేయడంతో రాష్ట్రవ్యాప్తంగా ఓ కమ్యూనిటీకి చెందిన ప్రజలు పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకున్నారు. ఈ భూమిని ఆక్రమించడానికి ప్రయత్నిస్తున్నారు. కొంతమంది ఆ ల్యాండ్ లో ఉన్న చెట్ల కింద, బండరాళ్ళ కింద తలదాచుకున్నారు. అలాంటి వారిని గుర్తించి పోలీసులు బయటకు పంపించారు.

డ్రోన్ కెమెరాల సహాయంతో రెండు సర్వే నెంబర్లలో ఉన్న భూమిని పోలీసులు జల్లెడ పడుతున్నారు. ఇప్పటికే భూ ఆక్రమణ కేసులో 20మంది పైనే కేసులు నమోదయ్యాయి. కాగా, సంఘటనా స్థలానికి సీపీ అవినాష్ మొహంతి చేరుకుని పర్యవేక్షించారు. ఈనెల 29 వరకూ ఈ ప్రదేశంలో 144 సెక్షన్ ఉంటుందని పేర్కొన్నారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు ఉంటాయని సీపీ హెచ్చరికలు జారీ చేశారు.

“ఘర్షణలను నివారించడానికి, ప్రభుత్వ అధికారుల చట్టపరమైన విధులను నిర్వర్తించే ఏ వ్యక్తిని అడ్డుకోవడానికి, నాకు ఉన్న అధికారాలను ఉపయోగించి, నేను, అవినాష్ మోహంతి, ఐపీఎస్, సైబరాబాద్ పోలీస్ కమిషనర్, క్రిమినల్ ప్రొసిజర్ కోడ్ సెక్షన్ 144 కింద ఈ కింది ఉత్తర్వులు జారీ చేస్తున్నాను. చెప్పబడిన ప్రాంతాలలో ఐదుగురు (05) లేదా అంతకంటే ఎక్కువ మంది గుమిగూడడాన్ని నిషేధించండి. ఆ ప్రాంతంలో సాధారణంగా నివసించని లేదా ఆ ప్రాంతంలో సాధారణంగా పని లేని వ్యక్తులను ఆ ప్రాంతాల సరిహద్దులలో ప్రవేశించకుండా నిషేధించండి. ఈ ఉత్తర్వులు 23.06.2024 ఉదయం 06:00 గంటల నుండి 29.06.2024 రాత్రి 11:00 గంటల వరకు సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మియాపూర్ మరియు చందానగర్ పోలీస్ స్టేషన్లలో అమల్లో ఉంటాయి” అని సైబరాబాద్ సీపీ జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

Read More
Next Story