
బోనాల పండుగకు 700 ఏళ్ళ చరిత్ర!
శ్రీకృష్ణదేవరాయల కాలం నాటి శాసనంలో ఏం ఉందంటే...
బోనాలు...
తెలంగాణ రాష్ట్ర పండుగ.
బోనాల పండగను దాదాపు 700 ఏళ్ళుగా జరుపుకుంటున్నట్లు కృష్ణదేవరాయల కాలం నాటి శాసనం వెల్లడించింది. క్రీ.శ 1516లోనూ, బోనాల పండుగ జరుపుకునట్టు వున్న ఈ శాసనాన్ని తెలంగాణ-కర్ణాటక సరిహద్దు సమీపంలోని గొబ్బూరు వద్ద 1961లోనే గుర్తించి భద్రపరిచారు. అయితే దక్షిణ భారతదేశ సంపుటాల కోసం ఎస్టాంపేజ్ కాపీలను (శాసన ప్రతులు) తిరిగి పరిశీలిస్తున్నప్పుడు దీనిని తిరిగి కనుగొన్నారు. భారత పురావస్తు సర్వే సంస్థ డైరెక్టర్ (శాసన విభాగం) కె. మునిరత్నం రెడ్డి, రిటైర్డ్ హిస్టరీ ప్రొఫెసర్ డాక్టర్ సూర్యకుమార్, తెలుగు యూనివర్శిటీలో చరిత్ర విభాగం హెడ్ ప్రొఫెసర్ ఎం.ఎ.శ్రీనివాసన్ కలిసి ఈ శాసనాన్ని చదివారు.
“బోనాల పండుగకు సంబంధించి ఇప్పటి వరకు లభించిన అత్యంత పురాతన శాసన ఆధారం ఇదే. శ్రీకృష్ణదేవరాయల పాలనా కాలంలో బోనాలు జరిగాయి. 1516 కంటే ముందు నుంచే అంటే 700 ఏళ్ళుగా బోనాల పండుగను ప్రజలు జరుపుకుంటున్నారు.
ఈ శాసనం తెలుగు లిపిలో ఉంది. (శక సంవత్సరం 1438, ధాతు నామ సంవత్సరం, జ్యేష్ఠ శుక్ల 3;.. రంగం (భవిష్యవాణి), కునముగ్గు, గడ్డపట్టణం, బోనాలు వంటి ఆచారాలపై పన్ను మినహాయింపుల గురించి ప్రస్తావించింది. గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారం ఆ శాసనం... 1516 మే 4 (ఆదివారం)న ప్రతిష్టంచబడింది. దీన్ని హైదరాబాద్ రాష్ట్ర పురావస్తు మ్యూజియంలో భద్రపరిచాం," అని ఏఎస్‌ఐ ఎపిగ్రఫీ విభాగం డైరెక్టర్ కె. మునిరత్నం రెడ్డి ఫెడరల్ తెలంగాణాతో తెలిపారు.
"ఈ శాసనం వేయకముందు నుంచే బోనాలు, రంగం, కునముగ్గు, గడ్డపట్టణం వంటి ఆచారాలు ప్రజల్లో అమల్లో ఉన్నాయని ఈ శాసనం తెలియజేస్తుంది. అంటే బోనాలకు 700 ఏళ్ళ చరిత్ర వుంది," అని తెలుగు యూనివర్శిటీలో చరిత్ర విభాగం హెడ్ ప్రొఫెసర్ ఎం.ఎ.శ్రీనివాసన్ చెప్పారు.
1) ఆ కాలంలోనూ ప్రభుత్వం పండుగలపై పన్నులు వసూలు చేసేదని ఈ శాసనం ఒక కీలకమైన విషయాన్ని బయటపెట్టింది. రంగం, కునముగ్గు, బోనాల వంటి ఆచారాలపై అప్పట్లో ప్రభుత్వానికి పన్నులు చెల్లించాల్సి ఉండేది. అయితే, ప్రజల భక్తిని గౌరవిస్తూ శ్రీకృష్ణదేవరాయలు ఈ పన్నుల నుంచి మినహాయింపునిస్తూ ప్రత్యేకంగా శాసనం వేయించారు.
2) పన్ను వ్యవస్థ మతాతీతంగా, రాజ్య పాలనలో భాగంగా ఉండేదని ఈ శాసనం ద్వారా తెలుస్తోంది.
3) కొండపల్లి దేవత సన్నిధిలో బోనాల ఉత్సవం నిర్వహించడానికి చెరువుల కింద భూములను సర్వమాన్యంగా ఇచ్చిన దాఖలాలు కూడా ఈ శాసనంలో ఉన్నాయి.
4) విజయనగరం నుండి కృష్ణదేవరాయలు పరిపాలిస్తున్నప్పుడు పర్వతయ్య ఈ స్తంభాన్ని ప్రతిష్టించాడని ఈ శాసనం ప్రస్తావిస్తుందని డాక్టర్ ఎం.ఎ.శ్రీనివాసన్ చెప్పారు.
ఈ శాసనంలో తెలుగులో రాసి వున్న లిపి ఇలా వుంది.....
1. శుభమస్తు స్వస్తి శ్రీ-2. శుభ జయాభ్యుదయ-3. శకవష౯౦బులు ౧౪౩౮4. అగునేంటి దాతృ సంభ-5. త్సరజ్యేష్ట శు ౩ ఆ ॥ క్రిష్ణ దే-6. వరాయ మహారాయ-7. లుంగారు పృధివీరాజ్యం-8. చెయ్యంగాను ॥ రాయసం-9. కొండ మరుసయ్యం గా-10. రు కొండపల్లి నుంచి-11. పట్టణ పల్లెతాను పాలి-12. స్తుంను పెద్ద కొండపల్లికి-13. దేవాదులకుం జేయించి-14. న ధర్మ శాసనము క్రితం-15. పూర్వానను కొండ్డ పల్లిప-16. ట్టనాను పల్లె లాను రంగాన-17. కు కూనముగ్గుకు ౹ గడ్డపట్ట-18. నకు బొనాలకు సైతం రాజ్య[౦]- 19. వారికిం బెట్టి పైం-20. డి యల్లకాలాల-21. కున్ను సర్వమాన్యం చే-22. స్తిమి క్రితం పూర్వాన-23. పెదచెఱ్వు వెనక వరిచె-24. నుగాక మాదత్తి-25. గాను బొల్లసము-26. ద్రం వెనక నిర్నల వె-27. హతికేను వెలి వో-28. లంకుచ్చెలాను-29. ఇస్తిమి గాన-30. ఆ చంద్రాక౯౦గా-31. ను దేవర అవదరిం- 32. చ్చెడి అని కొండ్డమ-33. రుసయ్యం గారి ఆ-34. నతిని పర్వత య్యం-35. గారు శాసనం నిలిపిరి-36. యిధమ్మ౯నకు ఇం ఏ-37. ద్దులుతప్పి రావారు-38. కాశీలోను గొబ్రా-39. హ్మణ హత్య చెశిన పా-40. పానం బోవువారు-41. తురుకలు దప్పిరాప-42. ౦ది దింన్నదోషాన-43. బోవువారు.
బోనం అంటే భోజనం అని అర్థం. బోనాలు సమర్పించడం వల్ల గ్రామ దేవతలు శాంతించి అంటు వ్యాధులు రాకుండా కాపాడుతారని ప్రజల విశ్వాసం. ఈ నైవేద్యం సమర్పించడానికి కొత్త కుండలో వంట చేస్తారు. కుండ అడుగున మూతికి సున్నం పూసి, మధ్యలో నూనె రాసి పసుపు, కుంకుమతో గుండ్రంగా బొట్టుపెట్టి పై మూత (కంచుడు)పై జ్యోతిని వెలిగించి నెత్తిన పెట్టుకొని వెళ్లి మొక్కులు తీర్చుకుంటారు. శివసత్తుల పూనకాలు, పోతరాజుల వేషధారణ ప్రత్యేక ఆకర్షణగా ఉంటుంది. బోనాల పండుగ రెండో రోజు రంగం కార్యక్రమం నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంలో యువతి భవిష్యవాణి వినిపిస్తుంది. రాజ్యాలు, పాలకులు మారినా ప్రజల సంస్కృతి మాత్రం ఇప్పట్టికీ చెక్కుచెదరలేదు అనడానికి బోనాలే నిదర్శనం.

