16 కి చేరిన తెలంగాణ వరద మృతుల సంఖ్య
x

16 కి చేరిన తెలంగాణ వరద మృతుల సంఖ్య

బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా తెలంగాణను వరదలు ముంచెత్తాయి.


బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా తెలంగాణను వరదలు ముంచెత్తాయి. నదులు వాగులు, ఉగ్రరూపం దాల్చాయి. వరద ఉధృతికి రోడ్లు, వంతెనలు, రైల్వే ట్రాకులు ధ్వంసం అయ్యాయి. పంటపొలాలు నీట మునిగాయి. ప్రజలకు, ప్రభుత్వానికి తీవ్ర ఆర్థిక నష్టాన్ని మిగిల్చాయి. రాష్ట్రంలో 16 మంది జల సమాధి అయినట్టు మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు. వారి కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని హామీ ఇచ్చారు. సోమవారం సాయంత్రం ఆయన మీడియాతో మాట్లాడారు.

రాష్ట్రంలో వర్షాలకు దెబ్బతిన్న ప్రాంతాలపై అధికారులతో సమీక్షించినట్లు శ్రీధర్ బాబు వెల్లడించారు. 8 జిల్లాలపై తీవ్ర వర్ష ప్రభావం పడిందని తెలిపారు. ఇప్పటి వరకు 16 మంది మృతి చెందారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలను ఆదుకుంటామని భరోసా కల్పించారు. అవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావద్దని కోరారు. అధికారులంతా క్షేత్రస్థాయిలో ఉండి పరిస్థితులను సమీక్షించాలని ఆదేశించినట్లు తెలిపారు. విద్యుత్తు, రహదారులను వెంటనే పునరుద్ధరించాలని కోరామన్నారు. రాష్ట్రస్థాయిలో డిజాస్టర్ రెస్పాన్స్ బృందాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. 10 బృందాలను అత్యవసర పరిస్థితుల్లో వాడుకోవాలని నిర్ణయించినట్లు చెప్పారు. ప్రతిపక్ష నేతలు కూడా సహాయక కార్యక్రమాల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు.

ప్రభుత్వ ఆర్థికసాయం...

తెలంగాణ ప్రభుత్వం వర్షాల కారణంగా చనిపోయిన వారి కుటుంబాలకు రూ. 5 లక్షల చొప్పున పరిహారం ప్రకటించింది. వరదల్లో ఇళ్లు కోల్పోయిన వారికి ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని తెలిపింది. పశువులు చనిపోతే రూ. 50 వేలు, పంట నష్టం జరిగితే ప్రతి ఎకరానికి రూ. 10 వేలు ఆర్థిక సాయం చేయనున్నట్లు తెలిపింది. భారీ వర్షాలు, వరదల కారణంగా రాష్ట్రంలో రూ. 5వేల కోట్లు నష్టం జరిగిందని ప్రభుత్వం ప్రాథమిక అంచనా వేసింది. రాష్ట్రంలో ప్రకృతి బీభత్సాన్ని జాతీయ విపత్తుగా గుర్తించి, రాష్ట్రానికి రూ. 2 వేల కోట్లు కేటాయించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తోంది. ఖమ్మం, నల్గొండ జిల్లాల పరిస్థితిని ప్రధాని మోదీ, హోమ్ మంత్రి అమిత్ షాకి సీఎం రేవంత్ రెడ్డి ఫోన్ లో వివరించారు. జరిగిన నష్టాన్ని పరిశీలించడానికి ప్రధాన మోదీని రాష్ట్రానికి ఆహ్వానించారు.

Read More
Next Story