
హైదరాబాద్ లోని అమెరికన్ కాన్సులేట్ కార్యాలయం గ్రాఫిక్స్
ఇండియాలో 2వేల అమెరికన్ వీసా అపాయింట్మెంట్లు రద్దు
బ్రోకర్ల ద్వారా క్షణాల్లో వీసా అపాయింట్మెంట్లను పొందుతున్న వారిపై వేటు పడింది. హైదరాబాద్ సహా పలు చోట్ల వీసా అపాయింట్మెంట్లు రద్దయ్యాయి.
ఇండియాలో అమెరికన్ వీసా అపాయింట్‌మెంటులపై వేటు పడింది. సుమారు 2 వేల వీసా అపాయింట్మెంట్లు రద్దు అయ్యాయి. అమెరికన్ దౌత్యకార్యాలయం వీటిని రద్దు చేసింది. మోసపూరితంగా ఓ ఏజెన్సీ అపాయింట్మెంట్లను బుక్ చేసి అమ్ముకుంటున్నట్టు నిర్దారణ కావడంతో వీటిని రద్దు చేస్తున్నట్టు భారత్‌లోని అమెరికా దౌత్య కార్యాలయం ప్రకటించింది.
అమెరికా వీసాల కోసం భారతదేశంలో అపాయింట్మెంట్ తీసుకోవాలంటే దరఖాస్తుదారులకు నెలలు, ఏళ్ల పాటు ఎదురు చూడాల్సి వస్తోంది. అయితే, కొంతమంది ఏజెంట్లు, మధ్యవర్తులు ఈ ప్రక్రియను తమ లాభాల కోసం దుర్వినియోగం చేస్తున్నారు. వాటిని గుర్తించి అమెరికా రాయబార కార్యాలయం కఠినంగా స్పందించింది.
ఏమి జరుగుతోంది?
అసలు దరఖాస్తుదారులకు అపాయింట్మెంట్లు దొరకకపోవడంపై పెద్ద ఎత్తున ఫిర్యాదులు వచ్చాయి. దీనికి కారణం, 'బాట్స్ (bots)' అనే ఆటోమేటెడ్ సాఫ్ట్‌వేర్ టూల్స్‌ను ఉపయోగించి ఏజెంట్లు, ఫిక్సర్లు పెద్ద సంఖ్యలో అపాయింట్మెంట్లు ముందుగానే బుక్ చేసేస్తున్నారు. దాంతో సాధారణ ప్రజలకు ఆ స్లాట్లు అందుబాటులో ఉండవు. 15వేల లోపు ఖర్చు కావాల్సిన దానికి అదనంగా రూ.30,000 నుంచి రూ.35,000 వరకు చెల్లించి ఏజెంట్ల సాయంతోనే అపాయింట్మెంట్ పొందాల్సిన పరిస్థితి ఏర్పడింది.
స్పందించిన అమెరికా దౌత్ కార్యాలయం..
ఈ అన్యాయాన్ని అరికట్టేందుకు అమెరికా భారతదేశంలోని తమ రాయబార కార్యాలయం పటిష్ట చర్యలు తీసుకుంది. బాట్స్ ద్వారా బుక్ చేసిన సుమారు 2,000 అపాయింట్మెంట్లను రద్దు చేసింది. ఈ విషయాన్ని బుధవారం ‘X’ (గతంలో ట్విట్టర్) వేదికగా ‘Consular Team India’ ప్రకటించింది.
“బాట్ల సహాయంతో బుక్ చేసిన సుమారు 2,000 వీసా అపాయింట్మెంట్లను రద్దు చేస్తున్నాం. షెడ్యూలింగ్ విధానాలను ఉల్లంఘించే ఏజెంట్లు, ఫిక్సర్లను మేము సహించం. జీరో టాలరెన్స్ విధానం మాది. మా నిర్ణయం వెంటనే అమలులోకి వస్తోంది. సంబంధిత ఖాతాల షెడ్యూలింగ్ హక్కులు కూడా రద్దు చేస్తున్నాం” అని అధికారిక ప్రకటనలో పేర్కొన్నారు.
రద్దయిన సుమారు 2,000 వీసా అపాయింట్‌మెంట్లలో దేశంలోని వివిధ నగరాలైన హైదరాబాద్, చెన్నై, ఢిల్లీ, కోల్‌కతా కాన్సులేట్‌లలో ఎంత మేరకు ఉన్నాయనే వివరాలను అధికారికంగా వెల్లడించలేదు. ఈవివరాల కోసం అమెరికా రాయబార కార్యాలయం లేదా సంబంధిత కాన్సులేట్‌ల అధికారిక వెబ్ సైట్స్ ను సందర్శించండి.
అసలేమిటీ బాట్స్...
సాధారణంగా వీసా దరఖాస్తుదారుడు సొంతంగా అప్లికేషన్ పంపిస్తే.. సమీప భవిష్యత్తులో అపాయింట్‌మెంట్ డేట్లు లభించవు. కానీ, ఏజెంట్లు కొన్నిరకాల ప్రత్యేకమైన బాట్స్‌ను వినియోగించి స్లాట్లను బ్లాక్ చేస్తారు. 2023లో బీ1, బీ2 అపాయింట్‌మెంట్ల 999 రోజుల మార్కును చూపించింది. దీంతో భారతీయ దరఖాస్తుదారుల కోసం ఫ్రాంక్‌ఫర్ట్, బ్యాంకాక్, ఇతర ప్రదేశాల్లో అమెరికా అపాయింట్‌మెంట్లను తెరవాల్సి వచ్చింది.
దాదాపు మూడేళ్ల క్రితం వీసా వెయిట్ సమయం చాలా ఎక్కువగా ఉన్న విషయాన్ని భారత్ ప్రభుత్వం అమెరికా దృష్టికి తీసుకెళ్లింది. దీనిని సీరియస్‌గా తీసుకొన్న అమెరికా ప్రభుత్వం వెయిటింగ్ సమయాన్ని గణనీయంగా తగ్గించింది. తాజాగా ఇప్పుడు బాట్స్ వినియోగాన్ని అడ్డుకోవడంపై దృష్టిపెట్టింది.
దీని వెనక ఉన్న ఉద్దేశం ఏమిటి?
ఈ చర్యల ప్రధాన ఉద్దేశం – వీసా అపాయింట్మెంట్ వ్యవస్థను పారదర్శకంగా, న్యాయంగా ఉంచడం. ఏజెంట్లపై ఆధారపడకుండా, ప్రతీ వ్యక్తి స్వయంగా అధికారిక వెబ్‌సైట్ ద్వారా అపాయింట్మెంట్ బుక్ చేసుకునే పరిస్థితిని తీసుకురావడం లక్ష్యం.
దరఖాస్తుదారులకు సూచనలు
అధికారిక యుఎస్ ట్రావెల్ వెబ్‌సైట్ (https://www.ustraveldocs.com/in/) ద్వారా మాత్రమే అపాయింట్మెంట్లు బుక్ చేసుకోవాలి.
ఏజెంట్ల ద్వారా అపాయింట్మెంట్ తీసుకుంటే మీ అపాయింట్మెంట్ రద్దు కావడంతో పాటు, మీ అకౌంట్‌ను కూడా సస్పెండ్ చేసే అవకాశం ఉంటుంది.
ఖచ్చితమైన సమాచారం కోసం ఎప్పటికప్పుడు రాయబార కార్యాలయం అధికారిక సోషియల్ మీడియా ఖాతాలను ఫాలో అవ్వాలి.
వీసా అపాయింట్మెంట్లలో ఈ బాట్ల గందరగోళం వలన ఎంతోమంది భారతీయులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇప్పుడు అమెరికా ప్రభుత్వం తీసుకుంటున్న ఈ నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేశారు. నిబంధనలకు అనుగుణంగా దరఖాస్తు చేసుకునే వారికి ఇది ఉపశమనంగా భావిస్తున్నారు. అక్రమ మార్గాల్లో వెళ్తే గుణపాఠం తప్పదని ఈ చర్యలు స్పష్టంగా చెబుతున్నాయి.
అమెరికా బిజినెస్, విజిటర్స్, బీ1, బీ2, స్టూడెంట్ వీసాలకు అపాయింట్‌మెంట్ల కోసం సుదీర్ఘ సమయం వెయింటింగ్ ఉంటోంది. కానీ, ఏజెంట్లకు డబ్బులు చెల్లిస్తే మాత్రం కేవలం నెల రోజుల్లోనే అపాయింట్‌మెంట్లు దొరకడం పర్యటక రంగంలో సర్వసాధారణం. తమ కుమారుడు అమెరికాలోని విశ్వవిద్యాలయంలో చేరడానికి సొంతంగా వీసా అపాయింట్‌మెంట్ కోసం ప్రయత్నించగా అది సాధ్యం కాలేదని, అదే ఏజెంటుకు రూ.30వేలు చెల్లిస్తే వెంటనే వచ్చిందని ఓ వ్యక్తి ఆంగ్ల వార్తా పత్రికకు వెల్లడించాడు. దీని ఆధారంగా అమెరికన్ దౌత్యకార్యాలయం అధికారులు దర్యాప్తు మొదలుపెట్టారు. అసలు విషయాన్ని నిగ్గు తేల్చారు.
Next Story