23 ఏళ్ల తర్వాత ఇంటికి ..
x

23 ఏళ్ల తర్వాత ఇంటికి ..

మతిస్థిమితం కోల్పోయి ఎక్కడెక్కడో తిరిగి



నిర్మల్ జిల్లాలో తప్పిపోయిన బాలుడు సరిగ్గా ఇరవై మూడేళ్ల తర్వాత ఇంటికిి చేరుకున్నాడు. మానసికంగా దెబ్బతిన్న ఆ బాలుడు కేరళలోని పునరావాస కేంద్రంలో నాలుగేళ్లు చికిత్స తీసుకున్న తర్వాత కన్న వాళ్లను , స్వంత గ్రామం పేరు గుర్తు పెట్టుకోవడంతో క్షేమంగా ఇంటికి చేరుకున్నాడు. చనిపోయాడని అనుకున్న ఆ కుటుంబం ఇపుడు సంబరాలు చేసుకుంటుంది. ఆ కుటుంబానికి మగదిక్కే లేదనుకున్నతరుణంలో మల్లయ్య రాకతో కొత్త ఆశలు చిగురించాయి.

మానసిక స్థితి సరిగా లేని మల్లయ్య బాల్యంలోనే ఇల్లును వదిలి వెళ్లాడు. మానసికంగా కుదుటపడటంతో మల్లయ్య 23 ఏళ్ల తర్వాత ఇంటికి చేరుకున్నాడు. తెలంగాణ నిర్మల్ జిల్లా చిన్న పల్లెటూరుకు చెందిన మల్లయ్య చిన్నప్పుడే ఇల్లు వదిలి వెళ్లడానికి ప్రధాన కారణం మానసిక సమస్యలే అని గ్రామస్థులు చెబుతున్నారు. సామాన్య మధ్యతరగతి కుటుంబానికి చెందిన మల్లయ్య ఆచూకీ కోసం కుటుంబసభ్యులు కళ్లలో వత్తులు వేసుకుని వెతికినా ఫలితం లేకపోయింది. ఎటువంటి క్లూ దొరికే అవకాశం లేకపోవడంతో వెతకడం మానేశారు. ప్రస్తుతం అతడి వయసు 40 ఏళ్లు. ఓ స్వచ్చంద సంస్థ చొరవతో ఇంటికి చేరుకున్నాడు. రెండు దశాబ్దాలు గడిచిపోవడంతో వృద్దాప్యంలో ఉన్న తల్లి మరణించింది. తమ్ముడు కూడా మృతి చెందాడు. ఇక ఇద్దరు అక్కల పెళ్లిళ్లయ్యాయి. అక్కల కుటుంబమే ఆ యువకుడికి దిక్కు. బావలే అతడికి తోడు.

నిర్మల్‌ జిల్లా సారంగాపూర్‌ మండలం చించోలి (బి) గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఊరికి చెందిన కొత్తపాటి నడిపి లింగన్న, మల్లవ్వ దంపతులకు వ్యవసాయం ప్రధాన వృత్తి. ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు కుమారులు ఉన్నారు. కుమార్తెల పెళ్లిళ్లు చేశాక.. లింగన్న ఉపాధి కోసం సౌదీ దేశానికి వెళ్లారు. కొన్నాళ్లు ఉత్తర ప్రత్యుత్తరాల ద్వారా కమ్యూనికేషన్ సాగించాడు. 1993 తర్వాత ఆయన అడ్రస్ తెలియకుండాపోయింది. బ్రతికున్నాడా చనిపోయాడా తెలియదు. బ్రతికి ఉంటే ఇంటికి వచ్చేవాడని గ్రామస్థులు అంటున్నారు. చిన్నప్పుడే ఆ కుటుంబానికి చెందిన మల్లయ్య తప్పిపోవడం, తండ్రి ఆచూకీ తెలియకపోవడంతో కుటుంబ సభ్యులకు తీవ్ర విషాదాన్ని నింపింది.

‘‘మల్లయ్య ఎనిమిదో తరగతి మధ్యలో చదువు ఆపేశాడు. మల్లయ్య చదువు ఆపడానికి ప్రధాన కారణం మతి స్థిమితం కోల్పోవడమే’’ అని అక్కలు చెప్పారు. ఎనిమిదో తరగతి వరకు మల్లయ్య మంచి మార్కులతో పాసయ్యేవాడని 17 ఏళ్ల వయసులో మతిస్థిమితం లేక.. 2002లో ఇంటి నుంచి వెళ్లిపోయాడు అని వారు చెప్పారు. 2021లో శ్రద్ధ రిహాబిలిటేషన్‌ ఫౌండేషన్‌ సభ్యులకు మల్లయ్య కేరళలో ప్రత్యక్షమయ్యాడు. మల్లయ్యకు ఆశ్రయమిచ్చింది ఆ స్వచ్చంద సంస్థ. ముంబయిలోని ఆ సంస్థ ఆసుపత్రిలో నాలుగేళ్లపాటు మానసిక వైద్యం చేయించారు. అతడి మానసికస్థితి కొంత కోలుకున్న తర్వాత తన ఊరు, సమీప పట్టణాల పేర్లు చెప్పగలిగాడు. దీంతో సంస్థ ప్రతినిధి సిద్ధు.. ఆదివారం మల్లయ్య స్వగ్రామానికి చేరుకున్నారు. మల్లయ్యను తీసుకొచ్చి కుటుంబసభ్యులకు అప్పగించారు. తన అక్కలు, బావలను మల్లయ్య గుర్తుపట్టి పలకరించాడు. దీంతో కుటుంబ సభ్యుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ఆరేళ్ల కిందట తల్లి మల్లవ్వ అనారోగ్యంతో చనిపోయిందని ,ఏడాది క్రితం తమ్ముడు రాజు మృతి చెందాడని తెలుసుకున్న మల్లయ్య తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు.

Read More
Next Story