అమెరికాలో తెలుగమ్మాయి సహా ముగ్గురు భారత విద్యార్థులు మృతి
అమెరికాలో భారతీయ విద్యార్థుల వరుస మరణ వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి. గతవారం ఓ రోడ్డు ప్రమాదంలో ఒక తెలుగమ్మాయి సహా ముగ్గురు భారతీయ విద్యార్థులు మరణించారు.
అమెరికాలో భారతీయ విద్యార్థుల వరుస మరణ వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి. గతవారం అగ్రరాజ్యంలో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో ఒక తెలుగమ్మాయి సహా ముగ్గురు భారతీయ విద్యార్థులు మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
వివరాల్లోకి వెళితే... జార్జియాలోని ఆల్ఫారెట్టాలో ఘోర కారు ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో కారులో ఐదుగురు ఉన్నట్టు అమెరికా పోలీసు అధికారులు తెలిపారు. వీరిలో ముగ్గురు భారతీయ అమెరికన్ విద్యార్థులు ప్రాణాలు కోల్పోగా.. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. చనిపోయిన, గాయపడిన వారంతా 18 ఏళ్ల వయసున్న విద్యార్థులే. మరణించిన విద్యార్థులు ఆర్యన్ జోషి, శ్రీయా అవసరాల, అన్వీ శర్మగా అధికారులు గుర్తించారు. కారు డ్రైవ్ చేస్తోన్న రిత్విక్ సోమేపల్లి తోపాటు మహమ్మద్ లియాఖత్ లు గాయపడ్డారు. ప్రస్తుతం వీరి పరిస్థితి నిలకడగా ఉన్నట్లు పోలీసులు నిర్ధారించారు.
ఆల్ఫారెట్టా పోలీసులు ప్రమాదానికి వేగమే ప్రధాన కారణంగా ప్రాధమిక నిర్ధారణకు వచ్చారు. కేసు నమోదు చేసి ప్రమాదానికి గల కారణాలను గుర్తించేందుకు సమగ్ర విచారణ జరుపుతున్నారు. అతివేగం కారణంగా డ్రైవింగ్ లో ఉన్న రిత్విక్ కారుపై నియంత్రణ కోల్పోవడంతో అదుపు తప్పిన కారు చెట్టుని ఢీకొని పల్టీలు కొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది.
ఘటనలో ఆర్యన్ జోషి, శ్రియ అవసరాల అక్కడికక్కడే మృతి చెందారు. వాహనం వెనుక కూర్చున్న అన్వీ శర్మను నార్త్ ఫుల్టన్ ఆసుపత్రికి తరలించగా, ఆమె చికిత్స పొందుతూ మరణించింది. ప్రస్తుతం క్షతగాత్రులకు అదే ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.
కాగా, ఈ ఐదుగురు జార్జియా యూనివర్సిటీలోని సీనియర్ ఆల్ఫారెట్టా హై స్కూల్ విద్యార్థులుగా పోలీసులు గుర్తించారు. జార్జియా యూనివర్శిటీకి చెందిన షికారీ పెటైట్ డ్యాన్స్ టీమ్‌లో శ్రియ అవసరాల ఉండగా, అదే యూనివర్శిటీకి చెందిన కాపెల్లా గ్రూప్‌లోని కలకార్‌లో అన్వీ శర్మ ఉంది. ఆర్యన్ జోషి హై స్కూల్ క్రికెట్ టీమ్ లో యాక్టివ్ ప్లేయర్ గా ఉన్నాడు.
ఆందోళనకరంగా తెలుగు విద్యార్థుల వరుస మరణాలు...
అమెరికాలో వరుసగా తెలుగు వారు మృత్యువాత పడటం ఆందోళన కలిగిస్తోంది. ఈ ఏడాది మార్చిలో తప్పిపోయిన హైదరాబాద్ కి చెందిన విద్యార్థి అబ్దుల్ అర్ఫాత్ అమెరికాలోని ఒహియో రాష్ట్రంలో శవమై కనిపించిన విషయం తెలిసిందే. అతని మరణంపై సమగ్ర దర్యాప్తు జరిగేలా స్థానిక అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నామని న్యూయార్క్‌లోని కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా తెలిపారు.
అలాగే ఇదే ఏడాది, ఏప్రిల్ లో క్లీవ్‌ల్యాండ్ లో భారత విద్యార్థి గద్దె ఉమా సత్య సాయి మృతి కూడా మిస్టరీగానే ఉంది. దీనిపై పోలీసుల ఇన్వెస్టిగేషన్ నడుస్తోంది. ఈ ఫిబ్రవరిలో షికాగోలో ఒక భారతీయ విద్యార్థిపై దాడి జరిగింది. దాడి తరువాత, షికాగో లోని భారత కాన్సులేట్... బాధితుడు సయ్యద్ మజాహిర్ అలీతో పాటు భారతదేశంలోని ఆయన భార్యతో టచ్‌లో ఉన్నట్లు పేర్కొంది.