
లొంగిపోయిన 37 మంది మావోయిస్ట్‌లు
డీజీపీ శివధర్ రెడ్డి ముందు ఆయుధాలు విడిచినపెట్టిన నక్సల్స్.
మావోయిస్ట్ పార్టీకి మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. కేంద్ర కమిటీ సభ్యుడు హిడ్మా మరణం నుంచి కోలుకునేలోపే భారీ సంఖ్యలో మావోయిస్ట్‌లు లొంగిపోయారు. తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి ఎదుట శనివారం 37 మంది మావోయిస్ట్‌లు లొంగిపోయారు. వారి దగ్గర నుంచి 303 రైఫిల్, జీ3 రైఫిల్, కే 47, ఎస్‌ఎల్ఆర్, బుల్లెట్లు, క్యాట్రేజ్‌లను పోలీసులు తీసుకున్నారు. వీరిటో మావోయిస్ట్ కీక నేతలు అజాద్, నారాయణ, ఎర్రాలు ఉన్నారు. శనివారం లొంగిపోయిన 37 మందిలో 25 మంది మహిళలు ఉన్నారు.
ప్రోత్సాహకం కల్పిస్తాం: డీజీపీ
‘‘లొంగిపోయిన మావోయిస్ట్‌లకు రివార్డ్‌లు, నగదుతో పాటు ప్రోత్సాహకాలు అందిస్తాం. పోలీస్ అమరవీరుల దినోత్సవం సందర్భంగా సీఎం చేసిన ప్రకటన కారణంగానే మావోయిస్టులు బయటికి వచ్చారు. ఏ రకంగా బయటికి వచ్చిన మావోయిస్టులకు అన్ని విధాలుగా ప్రభుత్వం చూసుకుంటుంది. మీడియా ద్వారా వచ్చినా, ప్రభుత్వ ఉద్యోగులు ద్వారా వచ్చినా, రాజకీయ నాయకుల ద్వారా వచ్చినా మేము స్వాగతీస్తాం. పార్టీ పరంగా విబేధాలు, ఆరోగ్య కారణాలు,ఇలా అనేక కారణాలు తో బయటికి వస్తున్నారు’’ అని డీజీపీ శివధర్ రెడ్డి తెలిపారు.
‘‘తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుడు గా ఉన్న ఆజాద్.. 30 ఏళ్ల గా అజ్ఞాతంలో ఉన్నాడు. ములుగు జిల్లాకు చెందిన ఆజాద్ మీద రూ.20 లక్షల రివార్డ్ ఉంది. అప్పాసి నారాయణ మీద రూ.20 లక్షలు రివార్డ్ ఉంది. మిగతా వారికి 25 వేల రూపాయల నగదు ఇస్తున్నాం. 1.41 కోటి రూపాయల. రివార్డ్ ను 37 మంది కి రివార్డ్ గా ఇస్తునాం. 11 నెలలో 465 మంది మావోయిస్ట్ లు లొంగిపోయారు. 59 మంది తెలంగాణ కు చెందిన మావోయిస్ట్ లు ఇంకా అజ్ఞాతంలో ఉన్నారు. ప్రస్తుతం 9 మంది కేంద్ర కమిటీ లో ఉన్నారు. కేంద్ర కమిటీ లో ఐదుగురు తెలంగాణ వారు ఉన్నారు. 10 మంది స్టేట్ కమిటీ సభ్యులుగా ఉన్నారు’’ అని వివరించారు. ఈ సందర్భంగానే ప్రస్తుతం కేంద్ర కమిటీలో ఐదుగురు తెలంగాణ వారు ఉన్నారని చెప్పారు. వారు.. ముప్పల లక్ష్మణ్ అలియాస్ గణపతి, మలా రాజిరెడ్డి అలియాస్ సంగ్రాం, తిప్పిరి తిరూపతి అలియాస్ దేవ్ జీ, గణేష్, దామోదర్ ఉన్నట్లు ఆయన తెలిపారు.
లొంగుబాట్లకు కారణం ఇదేనా..
అయితే ఇప్పటికే మావోయిస్ట్ కేంద్ర కమిటీ సభ్యులు ఒకరి తర్వాత ఒకరుగా ఆయుధాలు వీడారు. మల్లోజుల వేణుగోపాల్, ఆశన్న, బండి ప్రకాష్ ఇలా చాలా మంది పోలీసులు ముందు లొంగిపోయారు. కానీ చాలా మంది కీలక నేతలు ఉద్యమే ఊపిరిగా భావించి అడవుల్లోనే ఉన్నారు. వారిలో అనేక మంది ఒకరి తర్వాత ఒకరుగా భద్రతా బలగాల కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయారు. వారిలో కేంద్ర కమిటీ సభ్యుడు హిడ్మా కూడా ఒకరు. అతని భార్య కూడా పోలీసుల కాల్పుల్లో మరణించారు. హిడ్మా కూలడంతో.. మావోయిస్ట్ నేతల్లో భయం మొదలైందనిపిస్తోంది. అందుకనే చాలా మంది లొంగిపోవడంపై అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే లొంగిపోయిన ఆశన్న, మల్లోజుల కూడా ఎవరైనా లొంగిపోవాలని అనుకుంటే తమను సంప్రదించాలని సూచించారు.
ఒకవైపు కేంద్ర నాయకులు పార్టీని వీడుతుండటం, మరోవైపు ‘ఆపరేషన్ కగార్’ పేరుతో భద్రతా బలగాలు అడవులను జల్లెడ పడుతున్న క్రమంలో చాలామంది మావోయిస్ట్ పార్టీ నాయకులు.. ముందు లొంగిపోయి ప్రాణాలు కాపాడుకుందాం అన్న ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. బతికి ఉంటే జనంలో ఉంటూనే ఉద్యమం చేయొచ్చని, అడవిలో మరణించినా లాభం లేదని భావించే చాలా మంది లొంగిపోవడానికి ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం. అందుకు శనివారం తెలంగాణ డీజీపీ ఎదుట 37 మంది లొంగిపోవడం, వారిలో కీలక నాయకులు కూడా ఉండటం ఉదాహరణగా మారుతుంది.

