మేడారంలో స్మృతి వనానికి 38 కోట్లు మంజూరు
x

మేడారంలో స్మృతి వనానికి 38 కోట్లు మంజూరు

ఒక కట్టడానికి ఇంద పెద్ద మొత్తంలో నిధులు మంజూరు చేయడం ఇదే ప్రథమం


ములుగు జిల్లాలో జరుగనున్న మేడారంలో స్మృతి వనానికి రాష్ట్ర ప్రభుత్వం 38 కోట్లు మంజూరు చేసింది. ఈ మహాజాతరను సక్సెస్ చేయడానికి గిరిజన తెగకు చెందిన మంత్రి సీతక్క చొరవ తీసుకోవడంతో స్మృతి వనానికి నిధులు మంజూరైనట్టు తెలుస్తోంది. దాదాపు 3 వేల మంది భక్తులు నిత్యం మేడారం చేరుకుంటున్నారు. పబ్లిక్ హాలిడేస్ రోజుల్లో ఈ సంఖ్య 10 వేలు దాటుతోంది. ముఖ్యంగా రామప్ప, లక్నవరం, బొగత జలపాతం సందర్శనకొచ్చే పర్యాటకులు ఇక్కడి వనదేవతలైన సమ్మక్క, సారలమ్మలనూ దర్శించుకొని మొక్కులు చెల్లించుకుంటారు ఈ క్షేత్రాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం పర్యాటక ప్రాంతంగా మరింత అభివృద్ధి చేయాలని చూస్తోంది. అమ్మవార్లకు ప్రభుత్వం కేటాయించిన నారిగెబంధం గుట్టపై ఉన్న 28.95 ఎకరాల్లో స్మృతివనం ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. మేడారంలో ఒక నిర్మాణానికి ఇంత పెద్దమొత్తంలో నిధులివ్వడం ఇదే తొలిసారి. 28.95 ఎకరాల చుట్టూ భవనాలు నిర్మించి మధ్యలో ఈత కొలను, ఆట స్థలాలు, గడ్డి మైదానాలు, దేవతల చరిత్ర, ఆదివాసీల సంస్కృతి ఉట్టిపడేలా నిర్మాణాలు చేపట్టనున్నారు. జంపన్నవాగు పరిసరాల సుందరీకరణకు ప్రభుత్వం ఇటీవల రూ.5 కోట్లు మంజూరు చేసిన సంగతి తెలిసిందే. గద్దెల ప్రాంగణానికి కొద్దిదూరంలోని ఈ విశాల ప్రదేశంలో ఇప్పటికే దేవాదాయశాఖ విడిది గృహాల నిర్మాణానికి పూనుకుంది. ఇక స్మృతివనమూ ఏర్పాటైతే మేడారం జాతర కనులవిందు చేయనుంది.

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే మేడారం సమ్మక్క సారలమ్మ వనదేవతల మహా జాతర తేదీలను ఇప్పటికే కోయపూజారులు ప్రకటించిన సంగతి తెలిసిందే. 2026 జనవరి 28 నుంచి 31 వరకు జాతర జరుగనుంది. నాలుగు రోజుల పాటు ఈ జాతర జరుగనుంది. తొలిరోజు జనవరి 28న సాయంత్రం 6 గంటలకు కన్నెపల్లి నుంచి సారలమ్మను, గోవింద రాజు, పగిడిద్ద రాజులను గద్దెపైకి తీసుకురావడంతో జాతర లాంఛనంగా ప్రారంభమౌతుంది. 29న అంటే రెండోరోజు సాయంత్రం 6 గంటలకు చిలకల గుట్ట నుంచి సమ్మక్క దేవతను గద్దె మీదకు తీసుకొస్తారు.

30న వన దేవతలకు భక్తులు తమ తమ మొక్కులను చెల్లించుకుంటారు. 31న సాయంత్రం 6 గంటల సమయంలో సమ్మక్క, సారలమ్మ దేవతలు, గోవింద రాజు, పగిడిద్ద రాజు దేవుళ్ల వన ప్రవేశంతో జాతర ముగుస్తుంది. ఈ జాతరకు ఏర్పాట్లు చేయాల్సిందిగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పూజారులు కోరిన నేపథ్యంలో ప్రభుత్వంజాతరకు నిధులు విడుదల చేస్తూ నిర్ణయం తీసుకుంది. తెలంగాణ కుంభమేళాగా పేరుగాంచిన మేడారం జాతరకు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తుంటారు. ములుగు జిల్లాలోని తాడ్వాయి మండలంలో ప్రతీ రెండేళ్లకు మేడారం జాతర జరుగుతుంది.ఇది ప్రపంచంలోనే అతి పెద్ద గిరిజన పండుగ. ఈ వేడుకలు నిర్వహించడానికి తెలంగాణ ప్రభుత్వం రంగం సిద్దం చేసుకుంది.

Read More
Next Story