
4వ నిజాం కాలం నాటి ‘చార్ కొని నాన్’
ఖాదీం మున్షీ నాన్ ది 175 ఏళ్ల చరిత్ర!
నాన్‌రోటీ అనగానే గుర్తొచ్చేది హైదరాబాద్ పాతబస్తీ. అయితేఉదయం బ్రేక్ ఫాస్ట్‌లో నాన్ రోటీ, పాయా షేరువా తింటే అ ఫీల్ ఏ వేరు. అందులోనూ పురానీహవేలీ దగ్గర చేసే మున్షీ నాన్ అంటే ఆహారప్రియులు మనసు పారేసుకుంటారు. ఈ రొట్టె రుచికి 175 సంవత్సరాలకు పైబడిన చరిత్ర ఉంది. "మైదా, ఉప్పు కలిపి పులియ బెట్టిన పిండితో రొట్టెలు చేసి నిప్పుల సెగపై బట్టీల్లో ఉంచి కాల్చి తయారుచేస్తారు. వీటిని కాల్చే తీరు కూడా చూడముచ్చటగా ఉంటుంది. మైదాతో చేసిన రొట్టెలని ఒక చిన్నమెత్తపై ఉంచి బట్టీల్లో ఒత్తి, పొడవాటి ఊసలతో బయటకు తీయడం" చూసితీరాల్సిన దృశ్యం.
ఒక్కో కర్రీతో ఒక్కో రకమైన టేస్ట్ ఇచ్చే నాన్ రోటీలు అంటే ఇష్టపడని వారుండరు. హైదరాబాద్‌లోని చార్మినార్ ప్రాంతం దాటి లోపలికి పురానీ హవేలీ మీదుగా క్రాస్ రోడ్‌కు చేరుకుంటే.. అక్కడ మెట్రో ట్రైన్ నిర్మాణం కోసం రోడ్డుపై వున్న కట్టడాల్ని కూల్చివేసే దృశ్యాలు కనిపిస్తాయి. అయితే ఆ చౌరస్తాలో అక్కడే కమ్మని నాన్ వాసన మన నోట్లో నీళ్లూరేలా చేస్తుంది. రోడ్డుకు ఆనుకుని వున్న వరండాల్లో పెద్ద ఎత్తున తందూర్ నాన్స్ తయారు చేస్తూ కనిపిస్తారు. అదే హైదరాబాద్‌కు చెందిన ఫేవరెట్ తందూర్ నాన్‌లను అందించే ఖాదీం మున్షీ నాన్ షాపు.
1851లో 4వ నిజాం హయాంలో అకౌంటెంట్ కమ్ క్లర్క్‌గా పనిచేసే మహమ్మద్ హుస్సేన్ సాహెబ్ అనే వ్యక్తి పురానీ హవేలీ వద్ద చిన్న నాన్స్ తయారీ షాపును ఏర్పాటు చేశాడు. అందులో తందూరీ నాన్స్‌ను తయారు చేసేవాడు. అప్పట్లో ఆ నాన్స్ స్థానికులకు ఎంతో రుచికరంగా అనిపించడమే కాదు, రాను రాను వాటికి జనాలు ఆకర్షితులయ్యారు. దీంతో ఆ నాన్స్‌కు ఒక ప్రత్యేకత ఏర్పడి అది అలా ఇప్పటికీ స్థిరంగా కొనసాగుతోంది. ఈ క్రమంలో అప్పట్లోనే ఆ షాపుకు మున్షీ నాన్ అనే పేరు వచ్చింది.
"మొగల్ చక్రవర్తుల హయాంలో ఢిల్లీ నుంచి చార్ కోని నాన్ రెసిపి హైదరాబాద్‌కు వచ్చిందని చెబుతారు. ఆ రెసిపి ఇప్పటికీ అలాగే ఉందని, ఏమాత్రం మారలేదని, అదే రుచిని సంవత్సరాలుగా అందిస్తుండడం వల్లే కస్టమర్లు తమ షాపుకు మళ్లీ మళ్లీ వస్తుంటారని" నిర్వాహకులు తెలిపారు. వారు నాన్స్‌ను 2 రకాల ఆకృతుల్లో తయారు చేస్తారు. కానీ చార్ కోని నాన్ చాలా ప్రత్యేకం. ఎందుకంటే.. దీన్ని 4 పీసులుగా సులభంగా కట్ చేసి తినవచ్చు.
ప్రస్తుతం హుస్సేన్ సాహెబ్‌కు చెందిన 4వ తరం వారసులు ఆ నాన్ తయారీ షాపును నిర్వహిస్తున్నారు. చుట్టు పక్కల అలాంటి నాన్స్‌ను తయారు చేసే షాప్స్ ఎన్నో వచ్చాయి. కానీ అవేవీ మున్షీ నాన్స్ అంత రుచి అందించలేకపోయాయి. అందుకనే వారు ఇప్పటికీ మార్కెట్‌లో నిలదొక్కుకుని ఉన్నారు. ఇప్పటికీ ఆ షాపు ఎదుట భోజన ప్రియులు తాజా నాన్స్ కోసం క్యూలు కడుతుంటారు.
మున్షీ షాపులో అమ్మే చార్ కోని నాన్స్ అంత రుచికరంగా ఉండేందుకు కారణం.. అవి చక్కని సువాసనను కలిగి ఉండడమే. అంతేకాదు.. అవి బయటికి క్రిస్పీగా ఉంటాయి. లోపల సాఫ్ట్‌గా ఉంటాయి. అందుకనే అవి అంత రుచికరంగా ఉంటాయి. ప్రస్తుతం ఆ షాపులో నిత్యం 1 వేయికి పైగా నాన్స్‌ను తయారు చేసి పలు బ్యాచ్‌లలో అమ్ముతుంటామని.. షాపును నిర్వహించే ఖాజా అబ్దుల్ హమీద్ చెబుతారు.
మేం నిత్యం 3 నుంచి 4 క్వింటాళ్ల మైదాను నాన్స్‌ను తయారు చేసేందుకు ఉపయోగిస్తాం. మాకు రెగ్యులర్ కస్టమర్లు ఉన్నారు. వారు నిత్యం వచ్చి నాన్స్‌ను కొంటారు. మేం పార్టీలు, యానివర్సరీలు, ఇతర ఫంక్షన్లకు ఆర్డర్లపై కూడా నాన్స్‌ను సప్లయి చేస్తాం. చార్ కోని నాన్స్‌ను పండగల సమయంలో ఎక్కువగా తింటారు. ప్రత్యేకించి పాత బస్తీలో ఈ నాన్స్‌ను ప్రజలు ఎక్కువగా తింటారని.. హమీద్ తెలిపారు.
మున్షీ నాన్ షాపులో వర్కర్లు మైదాను ప్రిపేర్ చేసి వాటిని నాన్స్‌లా తయారు చేస్తారు. అనంతరం వాటిపై రోల్ పిన్ సహాయంతో డిజైన్లు వచ్చేలా చేస్తారు. తరువాత వాటిని తందూర్ బట్టీలో బెల్లం సహాయంతో లోపలి వైపు అతికిస్తారు. ఆ బట్టీలో ఇనుప లోహాన్ని కరిగించేంత ఉష్ణోగ్రత ఉంటుంది. ఈ క్రమంలో ఒక బట్టీలో ఒక్కసారికి 7 నుంచి 8 నాన్‌లను అతికిస్తారు. తరువాత 5 నుంచి 7 నిమిషాలకు వాటిని బట్టీ నుంచి తీసి తెల్లని వస్త్రంపై పేరుస్తారు. అవి చల్లగా అయ్యాక వాటిని తీసి షాపు ముందు ఉన్న గ్లాస్ ర్యాక్‌లలో పెడతారు. అనంతరం వాటిని కస్టమర్లు కొనుగోలు చేస్తారు.
చార్ కోని నాన్స్‌ను వేడిగా ఉండగానే తినాలి. మటన్ సూప్, పెరుగు రైతా, చికెన్ కర్రీలలో దేంతోనైనా ఈ నాన్స్‌ను తినవచ్చు. మెట్రో ట్రైన్ కారణంగా తమ షాపును కూడా కూల్చేస్తున్నారు. కాబట్టి ఇక్కడికి సమీపంలోనే తమ షాపును విస్తరిస్తున్నట్లు హమీద్ తెలిపారు. ఈ షాపు మొదటిసారిగా ప్రారంభమైనప్పుడు కేవలం 2 అణాలకే ఒక నాన్‌ను విక్రయించామని, ప్రస్తుతం ఒక నాన్‌ను రూ.20కు అమ్ముతున్నామని హమీద్ ది ఫెడరల్ తెలంగాణాకు తెలిపారు.