మరో 41 మంది మావోయిస్ట్‌ల లొంగుబాటు..
x

మరో 41 మంది మావోయిస్ట్‌ల లొంగుబాటు..

మూడు రోజుల్లో దాదాపు 100 మంది లొంగుబాటు.


మావోయిస్ట్ పార్టీకి దెబ్బమీద దెబ్బ తగులుతోంది. ఒకవైపు పెద్ద లీడర్లను కోల్పోతుంటే మరోవైపు వరుస లొంగుబాట్లు మావోయిస్ట్ పార్టీని కలవరపెడుతోంది. ఆయుధాలు వీడటానికి తాము సిద్ధంగా ఉన్నామంటూ ఇటీవల మూడు రాష్ట్రాల సీఎంలకు మావోయిస్ట్ పార్టీ లేఖ రాసింది. కాగా ఈ విషయంపై ఒక నిర్ణయం తీసుకోవడానికి ఫిబ్రవరి వరకు గడువు ఇవ్వాలని కోరారు. ఇంతలోనే వరుసగా మావోయిస్ట్‌లు లొంగిపోతుండటం కీలక మారుతోంది. ఛత్తీస్‌గఢ్‌ బీజాపూర్ జిల్లాలో బుధవారం 41 మంది మావోయిస్టులు జిల్లా ఎస్పీ డా. జితేంద్ర కుమార్ యాదవ్ సమక్షంలో లొంగిపోయారు.

లొంగిపోయిన మావోయిస్టులపై మొత్తం రూ.1.19 కోట్లు రివార్డు ఉన్నట్లు ఎస్పీ వెల్లడించారు. వారిలో 12 మంది మహిళలు, 29 మంది పురుషులు ఉన్నారు. లొంగిన వారిలో పీఎల్‌జీఏ (Peoples Liberation Guerrilla Army) నంబర్ వన్ బెటాలియన్, వివిధ ఏరియా కమిటీ సభ్యులు, ప్లాటూన్ సభ్యులు, కంపెనీ స్థాయి సభ్యులు, మిలీషియా యూనిట్లలో సేవలందించిన వారు ఉన్నట్లు అధికారులు వివరించారు.

ఇవారిలో సౌత్ సబ్ జోనల్ బ్యూరోకు చెందిన 39 మంది, అలాగే తెలంగాణ రాష్ట్ర కమిటీ, దంతేవాడ–గరియా బంద్ మరియు నువపాడ డివిజన్‌కు చెందిన సభ్యులూ ఉన్నారు. ఇప్పటి వరకు బీజాపూర్ జిల్లాలో మొత్తం 790 మంది మావోయిస్టులు ప్రధాన జీవన స్రవంతిలో చేరగా, 1031 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. అదనంగా, వివిధ ఎన్‌కౌంటర్లలో ఇప్పటివరకు 202 మంది మావోయిస్టులు మృతిచెందినట్లు ఎస్పీ పేర్కొన్నారు.

మరో జిల్లాలో ఆయుధాలు వీడిన 28 మావోయిస్ట్‌లు

ఛత్తీస్‌గఢ్ నారాయణ్‌పూర్ జిల్లాలో మంగళవారం 28 మంది మావోయిస్టు పార్టీ సభ్యులు పోలీసులు ఎదుట లొంగిపోయారు. ఈ వివరాలను బస్తర్ రేంజ్ ఐజీ సుందర్ రాజ్ పాటిలింగం మీడియాకు వెల్లడించారు. లొంగినవారు అంతా దండకారణ్యం స్పెషల్ జోనల్ కమిటీకి చెందినవారని అధికారులు తెలిపారు. వీరిలో 22 మందిపై రూ.89 లక్షల రివార్డు ఉన్నట్లు వెల్లడించారు. లొంగిన వారిలో 19 మంది మహిళలు ఉన్నారని తెలిపారు. వారిలో ఒకరు డివిజన్ కమిటీ సభ్యుడు పాండి ధ్రువ్ అలియాస్ దినేష్ కాగా, మిగతా ముగ్గురు తూర్పు బస్తర్ డివిజన్‌కు చెందిన 6వ నెంబర్ మిలిటరీ కంపెనీ సభ్యులు అని చెప్పారు. వీరి పేర్లు దూలే మాండవి, ఛత్తీస్ పోయం, పడ్ని ఓయం అని వివరించారు.

సుక్మా జిల్లాలో 15మంది లొంగుబాటు

సోమవారం సుక్మా జిల్లాలో జిల్లా ఎస్పీ కిరణ్ చవాన్ సమక్షంలో 15 మంది కీలక మావోయిస్టులు లొంగిపోయారు. లొంగిన వారిలో ఐదుగురు మహిళలు, 10 మంది పురుషులు ఉన్నారు. ఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం.. వీరిలో పీఎల్‌జీఏ (Peoples Liberation Guerrilla Army) నంబర్ వన్ బెటాలియన్‌లో చురుకుగా పనిచేసిన నలుగురు కీలక సభ్యులు కూడా ఉన్నారు. లొంగిపోయిన మావోయిస్టులపై మొత్తం రూ.40 లక్షల రివార్డు ఉన్నట్లు ఎస్పీ తెలిపారు. అదే సందర్భంలో, అరణ్య ప్రాంతాల్లో దాగి ఉన్న మిగతా మావోయిస్టులు హింసా మార్గాన్ని విడిచి ప్రధాన జీవన ప్రవాహంలోకి చేరాలని ఎస్పీ కిరణ్ చవాన్ పిలుపునిచ్చారు.

Read More
Next Story