
BC RESERVATIONS | స్థానిక ఎన్నికల్లో బీసీ లకు 42శాతం రిజర్వేషన్లు సాధ్యమే
ప్రభుత్వానికి నిబద్ధత ఉంటే స్థానిక ఎన్నికల్లో బీసీ లకు 42శాతం రిజర్వేషన్లు సాధ్యమేనని బీసీ నేతలు ఆర్ కృష్ణయ్య, వి.శ్రీనివాస్ గౌడ్,వకుళాభరణం డిమాండ్ చేశారు.
ప్రభుత్వానికి నిబద్ధత ఉంటే స్థానిక ఎన్నికలలో బీసీ లకు 42శాతం రిజర్వేషన్లు కల్పించాలని బీసీ మేధావుల సదస్సులో ఆర్ కృష్ణయ్య, వి. శ్రీనివాస్ గౌడ్,డాక్టర్ వకుళాభరణం,చిరంజీవులు డిమాండ్ చేశారు.బీసీలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా స్థానిక సంస్థల ఎన్నికలకు వెళితే కాంగ్రెస్ అభ్యర్థులను ఓడిస్తామని వారు ప్రకటించారు. రాహుల్ గాంధీ రాజ్యాంగం పట్టుకొని తిరిగడం వల్ల లాభం లేదని, తెలంగాణ లో బీసీలకు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలని బీసీ సంఘాల మేధావులు డిమాండ్ చేశారు. తెలంగాణ లో బీసీల జనాభాను తగ్గించి చూపారని, ఆ లెక్కలే వాస్తవమని ప్రభుత్వం వితండవాదం చేస్తుందని వారు ఆరోపించారు.
హామీలను విస్మరించొద్దు : ఆర్ కృష్ణయ్య
ఎంత సేపూ ప్రభుత్వం బీసీలకు ఇచ్చిన హామీలను ఎగవేసే ప్రయత్నం మంచిది కాదని బీసీ సంఘాల నేతలు చెప్పారు. 42శాతం రిజర్వేషన్లకు బీసీలకు చట్టపరంగా,న్యాయపరంగా స్థానిక సంస్థల ఎన్నికలలో అమలుచేయడానికి పరిష్కార మార్గాలు కనుగొనాలనిరాజ్యసభ సభ్యులు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఆర్.కృష్ణయ్య రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఆదివారం నగరంలోని లకడీ కా ఫుల్ హోటల్ అశోకాలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన సామాజిక, ఆర్థిక కుల సర్వే నివేదికలోని వివరాలను తప్పు పడుతూ బీసీ మేధావుల చర్చా వేదిక జరిగింది. ఈ కార్యక్రమానికి ఆ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జా సత్యం అధ్యక్షత వహించారు.ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఆర్.కృష్ణయ్య, తెలంగాణ బీసీ కమిషన్ మాజీ ఛైర్మన్ డాక్టర్ వకుళాభరణం కృష్ణ మోహన రావు, మాజీ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్, బిసి మేధావుల ఫోరమ్ అధ్యక్షుడు రిటైర్డ్ ఐఎఎస్ అధికారి చిరంజీవులు తదితరులు పాల్గొని ప్రసంగించారు.
కుల సర్వేలో తప్పులను సరిదిద్దండి
ఈ సందర్భంగా ఆర్.కృష్ణయ్య ప్రసంగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థలలో బీసీ లకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలన్నారు.కుల సర్వేలో జరిగిన తప్పులను సరిదిద్దాలని ఆయన సూచించారు. రీ సర్వే ద్వారా ఇప్పటికే నమోదు కానీ ప్రజల వివరాలను తిరిగి సేకరించాలని ఆయన డిమాండ్ చేశారు.డాక్టర్ వకుళాభరణం కృష్ణ మోహన రావు మాట్లాడుతూ 50 శాతం రిజర్వేషన్లు దాటడానికి రాజ్యాంగ ప్రక్రియ ఇప్పట్లో సాధ్యం కాదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతులు దులుపుకోవడం సామాజిక న్యాయ స్ఫూర్తికి విరుద్ధం అన్నారు.కుల సర్వేలో పూర్తి స్థాయి ప్రజల వివరాలు సేకరించగలిగితే ,ఆ పరిమాణాత్మక డేటా తో ఎలాంటి రాజ్యాంగ ప్రక్రియలు,శాసనబద్ధమైన ప్రక్రియలు చేయడం అందులో ఫలవంతం అవ్వడం అసాధ్యమేమీ కాదన్నారు.
బీసీలను మోసం చేసే ప్రయత్నం
మాజీ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ ప్రసంగిస్తూ ..రాష్ట్ర ప్రభుత్వం తప్పుడు లెక్కలతో బీసీలను మోసం చేసే ప్రయత్నం చేస్తుందన్నారు.రిటైర్డ్ ఐఎఎస్ అధికారి చిరంజీవులు ప్రసంగిస్తూ... రాష్ట్ర ప్రభుత్వం కుల సర్వేలో బీసీల జనాభా ను తగ్గించిన తీరును గణాంకాలతో సోదాహరణంగా వివరించారు.ఈ చర్చా వేదికలో పాల్గొన్న ప్రముఖులలో ఎస్.సూర్యారావు,వి జానయ్య,నీల వెంకటేష్, వేముల రామకృష్ణ, సి.రాజేందర్, లాల్ కృష్ణ, నందగోపాల్,రమాదేవి,అంజి తదితరులతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా తరలివచ్చిన సామాజిక వేత్తలు ,60 బీసీ కుల సంఘాల ప్రతినిధులు,40 బీసీ సంఘాల నాయకులు, మహిళా ,విద్యార్థి,యువజన ,ఉద్యోగ,పారిశ్రామిక, న్యాయవాదులు, వివిధ సంఘాల నాయకులు పాల్గొని ప్రసంగించారు.ఈ చర్చా వేదికలో జానపద ,ఉద్యమ గీతాల గాయకుడు రామలింగం ఆధ్వర్యంలో పాడిన పాటలు కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
Next Story