తెలంగాణలో కనిపించిన 6 వేల యేళ్లనాటి వడిసెల రాళ్లు
కొలనుపాకలో చరిత్రపూర్వయుగం ఆనవాళ్ళు, 6 వేలయేండ్ల కిందనే కొలనుపాకలో పురామానవుల ఆవాసాలు
ఆరు వేలయేండ్ల కిందనే తెలంగాణ కొలనుపాకలో పురామానవులు ఆవాసాలు ఏర్పాటు చేసుకున్న విశేషాలు కనిపించాయి.
కొలనుపాకలో పీతాంబరం వాగు ఒడ్డున ‘గుడిగడ్డ’గా పిలువబడే మిట్టపల్లి భాస్కర్ వ్యవసాయభూమిలో కొత్త తెలంగాణచరిత్రబృందం సభ్యులు శ్రీరామోజు హరగోపాల్, కుండె గణేశ్, ముడావత్ రవీందర్, మిట్టపల్లి భాస్కర్, మేఘరాజు, మంజుల, హర్షిత్, రిషిత చరిత్రపూర్వయుగం ఆనవాళ్ళను, సాతవాహనకాలపు పురావస్తువులను గుర్తించారు.
పురావస్తువులలో కొత్తరాతియుగం(6వేల సం.లు)నాటి వడిసెలరాయి, పెదరాతియుగం(4వేలయేండ్లు) నాటి నలుపు, ఎరుపు(Black and Red Ware), తొలి చారిత్రకయుగాలనాటి(2వేలయేండ్లు) నలుపు(Black Ware), ఎరుపు(Red Ware) కుండలపెంకులు, సాతవాహనకాలపు విరిగిన టెర్రకోట బొమ్మ, పూసలు, డబ్బుగా వాడబడిన(విష్ణుకుండినుల కాలపు) గవ్వ(కౌరి), నూరుడురాళ్ళు, దంపుడు రాళ్ళు, సానరాళ్ళు, విసుర్రాయి పైభాగం, కుప్పలుగా కుండపెంకులు లభించాయి. పోచన్నపేట దారిలో పెదరాతియుగం సమాధులున్నాయని సమాచారం. పొరుగు గ్రామం లక్ష్మక్కపల్లెలో కూడా పెదరాతియుగం సమాధులను చరిత్రబృందం గుర్తించింది.