
వరంగల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు మృతి..
వరంగల్ జిల్లా మామునూరు దగ్గర రోడ్డు రక్తమోడింది. భారత్ పెట్రోల్ బంక్ దగ్గర లారీ అదుపుతప్పి.. పక్కనే ఉన్న కారు, రెండు ఆటోలపై పడింది.
వరంగల్ జిల్లా మామునూరు దగ్గర రోడ్డు రక్తమోడింది. భారత్ పెట్రోల్ బంక్ దగ్గర ఇనుపరాడ్ల స్తంభాలతో వెళ్తున్న లారీ అదుపుతప్పి.. పక్కనే ఉన్న కారు, రెండు ఆటోలపై పడింది. ఈ ప్రమాదంలో లారీలోని ఇనుప స్తంభాలు ఆటోపై పడ్డాయి. ఈ ఘటనలో ఏడుగురు అక్కడిక్కడే ప్రాణాలు వదిలారు. మరికొందరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు చెప్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన సమాచారం అందింన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రుల్లో పలువురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెప్పారు. అయితే లారీ డ్రైవర్ మద్యం మత్తులో ఉండటం వల్లే ఈ ప్రమాదం జరిగిందని పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. పూర్తి వివరాలు సేకరించే ప్రయత్నంలో ఉన్నారు. కాగా మృతుల కుంటుంబానికి సమాచారం అందించినట్లు పోలీసులు చెప్పారు.
ఈ ఘటనపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి.. తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశాలు జారీ చేశారు. క్షతగాత్రుల పరిస్థితిపై ఎప్పటికప్పుడు సమాచారం అందించాలని అన్నారు.