7వ తరగతి విద్యార్థి ఆత్మహత్య.. వేధింపులే కారణమా..?
x

7వ తరగతి విద్యార్థి ఆత్మహత్య.. వేధింపులే కారణమా..?

తెలంగాణ విద్యార్థుల బలవన్మరాల సంఖ్య రోజురోజుకు అధికమవుతోంది. తాజాగా రంగారెడ్డి హయత్‌నగర్‌లోని నారాయణ స్కూల్‌లో 7వ తరగతి విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు.


తెలంగాణ విద్యార్థుల బలవన్మరాల సంఖ్య రోజురోజుకు అధికమవుతోంది. ప్రతి రోజూ ఎక్కడో ఒకచోట ఏదో ఒక కారణంతో విద్యార్థులు ప్రాణాలు కోల్పోతున్నారు. వారి ఆత్మహత్యలను నియంత్రించడం కోసం అధికారులు ఎన్ని రకాల కార్యక్రమాలు చేపట్టినా వాటి వళ్ల పెద్దగా లాభం ఉండటం లేదు. ఇక హాస్టళ్లలో ఉండే విద్యార్థుల తల్లిదండ్రులయితే ప్రతి రోజూ భయంతో బతుకుతున్నారు. ఎప్పుడు ఎలాంటి వార్త వినాల్సి వస్తుందో అన్న ఆందోళనతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. తాజగా ఇటువంటి ఘటనే ఒకటి రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్‌లోని నారాయణ హాస్టల్‌లో చోటు చేసుకుంది. 7వ తరగతి చదువుతున్న లోహిత్ రెడ్డి అనే విద్యార్థి తన హాస్టల్ రూమ్‌లో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ప్రాణాలు విడిచాడు. ఈ మేరకు సమాచారం అందిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. విద్యార్థి మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, మృతుడి కుటుంబీకులకు సమాచారం అందించారు. తమ దర్యాప్తులో భాగంగా మృతుడు హయత్‌నగర్‌లోని నేతాజీ నగర్ బ్రాంచ్‌లో ఏడవ తరగతి చదువుతున్నట్లు పోలీసులు తుర్తించారు.

మనస్థాపంతోనే ఆత్మహత్య..

అయితే సోమవారం రోజున పాఠశాలలో తరగతులు జరుగుతన్న క్రమంలో ఫిజిక్స్ క్లాస్‌లో సదరు సబ్జెక్ట్ టీచర్.. క్లాస్ లీడర్‌తో లోహిత్‌ను కొట్టించారని, దాంతో తీవ్ర మనస్తాపానికి గురైన లోహిత్.. అర్థరాత్రి సమయంలో హాస్టల్‌ గదిలో ఆత్మహత్య చేసుకున్నాడని సమాచారం. దీంతో ఉపాధ్యాయులు పెడుతున్న టార్చర్ వల్లే తమ కుమారుడు మరణించాడని, తమకు న్యాయం చేయాలంటూ తల్లిదండ్రులు కోరుతున్నారు. టీచర్ల టార్చర్ తట్టుకోలేకే తమ బిడ్డ ఇంతటి అఘాయిత్యానికి పాల్పడ్డాడని, పసి వయసులో ఇలాంటి ఆలోచనలు వచ్చాయంటే.. టీచర్లు ఏ స్థాయిలో టార్చర్ పెడుతున్నారోనంటూ బంధువులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

కవర్ చేస్తున్న యాజమాన్యం..

కాగా సోమవారం రోజు క్లాస్‌ రూమ్‌లో అసలు ఏం జరిగింది అన్న విషయాన్ని బయటకు రాకుండా స్కూల్ యాజమాన్యం జాగ్రత్త పడింది. యాజమాన్యం సైతం ఈ ఘటనపై నోరు మెదపడం లేదు. కనీసం తమకు కూడా ఏం జరిగిందో చెప్పట్లేదని మృతుడి తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రూ.లక్షలు ఫీజులు తీసుకుంటూ తమ పిల్లల చావుకు కారణమవుతున్నారంటూ స్కూల్ యాజమాన్యంపై మండిపడ్డారు. నారాయణ స్కూల్ వేధింపుల వల్లే తమ బిడ్డ లోహిత్ చనిపోయాడంటూ తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు స్కూల్ ముందు ఆందోళన చేపట్టారు.

అధిక ఒత్తిడి వల్లే..

లోహిత్ ఆత్మహత్య ఘటనపై విద్యార్థి సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ర్యాంకుల కోసం విద్యార్థులపై పాఠశాలలు తీవ్ర ఒత్తిడి తెచ్చి వేధింపులకు పాల్పడుతున్నాయని, అందువల్లే విద్యార్థులు ఏం చేయాలో అంతుచిక్కని పరిస్థితుల్లో విచక్షణ కోల్పోయి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశారు. లోహిత్ రెడ్డిని కూడా స్కూల్ యాజమాన్యం తీవ్రంగా వేధింపులకు గురి చేసిందని, తాను స్కూల్ నుంచి వెళ్లిపోతాను టీసీ ఇవ్వమన్నా ఇవ్వలేదని మృతుడి బంధువులు చెప్తున్నారు. నారాయణ స్కూల్ యాజమాన్యంపై క్రిమినల్ కేసులు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని మృతుడి కుటుంబీకులు, బంధువలతో పాటు విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

Read More
Next Story