పల్లా, మల్లారెడ్డి కేసులో ప్రభుత్వానికి ఊహించని షాక్
x

పల్లా, మల్లారెడ్డి కేసులో ప్రభుత్వానికి ఊహించని షాక్

బీఆర్ఎస్ ఎంఎల్ఏలు, విద్యాసంస్ధల ఛైర్మన్ల పిటీషన్ నేపధ్యంలో హైకోర్టు ధర్మాసనం రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఊహించని షాక్ ఇచ్చింది.


బీఆర్ఎస్ ఎంఎల్ఏలు, విద్యాసంస్ధల ఛైర్మన్ల పిటీషన్ నేపధ్యంలో హైకోర్టు ధర్మాసనం రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఊహించని షాక్ ఇచ్చింది. ప్రధాన ప్రతిపక్షమైన కారుపార్టీ ఎంఎల్ఏల్లో అనేకమందికి అనేకరకాల వ్యాపారాలున్నాయి. ఇందులో జనగామ ఎంఎల్ఏ, మేడ్చల్ ఎంఎల్ఏలు పల్లా రాజేశ్వరరాడ్డి, చామకూర మల్లారెడ్డి కూడా ఉన్నారు. ఇప్పటికే వీళ్ళపై చెరువులు, కుంటులను ఆక్రమించి కాలేజీ భవనాలను నిర్మించారనే ఆరోపణలున్న విషయం తెలిసిందే. చెరువులు, కుంటలను ఆక్రమించి భవనాలు నిర్మించారని హైడ్రా ఇప్పటికే కూల్చివేతలకు నోటీసులు జారీచేసింది. కాకపోతే అందులో చదువుతున్న విద్యార్ధుల భవిష్యత్తు ఇబ్బందులో పడుతుందని వచ్చే విద్యాసంవత్సరం వరకు గడువిచ్చింది.

హైడ్రా నోటీసులోని వివరాల ప్రకారం వచ్చే విద్యాసంవత్సరంలో పై కాలేజీలు అడ్మిషన్లు చేసేందుకు లేదు. వీళ్ళు హైడ్రా నోటీసులకు వ్యతిరేకంగా కోర్టుకు వెళ్ళినా పెద్దగా ఊరటలభించలేదు. అందుకనే ఈలోగానే వీలైంతగా సొమ్ము చేసుకునేందుకు ప్లాన్ చేశాయి. ఇంతకీ ఆ ప్లాన్ ఏమిటంటే సీట్ల కన్వర్షన్. ఏ ఇంజనీరింగ్ కాలేజీలో అయినా విద్యార్ధుల టాప్ ప్రయారిటి కంప్యూటర్ సైన్సే. కంప్యూటర్స్ లో సీటు రాకపోతేనే ఇతర కోర్టులగురించి ఆలోచిస్తారు. అందులోను వీలుంటే కన్వీనర్ కోటా తర్వాత యాజమాన్య కోటా గురించి కూడా ఆలోచిస్తారు.

యాజమాన్య కోటాలో సీటు సంపాదించేందుకు ప్రతి విద్యార్ధి సుమారు 7-8 లక్షల రూపాయలు చెల్లించేందుకు సిద్ధపడతారు. విద్యార్ధుల్లో అత్యధికులు కంప్యూటర్సులోనే చేరేందుకు మక్కువ చూపితే మరి మిగిలిన కోర్సుల సంగతి ఏమిటి ? ఉదాహరణకు కంప్యూటర్సులో ఒక కాలాజీలో 50 సీట్లు ఉన్నాయని అనుకుంటే సుమారు 200 మంది వెయిటింగ్ లిస్టులో ఉంటారు. అదే మిగిలిన కోర్సుల్లో కూడా 50 సీట్లున్నా 20-30 మందికన్నా విద్యార్ధులు చేరటంలేదు. ఇక్కడే పై యాజమాన్యాలు సీట్ల కన్వర్షన్ పేరుతో పెద్ద ప్లాన్ వేశాయి.

ఎలాగంటే ఇతర కోర్సుల్లో మిగిలిపోయి సీట్లను కంప్యూటర్సు కోర్సుల్లోకి మార్చుకునేట్లు. ఈ కన్వర్షన్ వల్ల ఏమవుతుందంటే మిగిలిన కోర్సుల్లో చేరటానికి విద్యార్ధులు పెద్దగా ఆసక్తి చూపకపోయినా కంప్యూటర్సు కోర్సులో మాత్రం ఉన్న సీట్లకు మించి చేరుతారు. అడ్మిషన్ కోసం ఎన్ని లక్షల రూపాయలైనా యాజమాన్యాలకు చెల్లించటానికి వెనకాడటంలేదు. దీనివల్ల పై యాజమాన్యాలు ప్రతి విద్యాసంవత్సరంలో వేలసీట్లపైన కోట్లాది రూపాయలు సంపాదించుకుంటున్నాయి. విద్యార్థుల భవిష్యత్తు, కోర్సుల డిమాండ్ కారణంగా ఏఐసీటీఈ, జేన్టీయూ, రాష్ట్రప్రభుత్వం అనుమతి లాంఛనం మాత్రమే.

ఈ పద్దతిని పై యాజమాన్యాలు గడచిన పదేళ్ళుగా అమలుచేస్తున్నాయని సమాచారం. అప్పట్లో అధికారపార్టీలో ఉన్నారు కాబట్టి వీళ్ళు ఆడిందే ఆటగా సాగిపోయింది. ఇపుడు ఈ కన్వర్షన్ పద్దతికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం రెడ్ సిగ్నల్ చూపించింది. ఇక్కడే ప్రభుత్వం నిర్ణయాన్ని ధర్మాసనం తప్పుపట్టింది. సీట్ల కన్వర్షన్ కు ఏఐసీటీఈ, జేన్టీయూలు అనుమతిచ్చిన తర్వాత ప్రభుత్వం అడ్డుచెప్పటం ఏమిటంటు ఎంజీఆర్, విద్యాజ్యోతి, మల్లారెడ్డి, అనురాగ్ తదితర 11 కాలేజీల యాజమాన్యాలు కోర్టులో పిటీషన్ వేశాయి. దాంతో ప్రభుత్వం కూడా తన వాదన వినిపించింది. పై రెండు కాలేజీలు మేడ్చల్ జిల్లాలోనే ఉన్నాయి అదే జిల్లాలో ప్రభుత్వంతో పాటు ఇతర ప్రైవేటు కాలేజీలున్నట్లు చెప్పింది. కంప్యూటర్స్ కోర్సులో చేరటానికి ప్రభుత్వ కాలేజీలు, ఇతర ప్రైవేటు కాలేజీలున్నపుడు పై కాలేజీల్లో సీట్ల కన్వర్షన్ కు అనుమతి ఇవ్వాల్సిన అవసరం ఏమిటని ప్రభుత్వం వాదన వినిపించింది.

రెండువైపుల వాదనలు విన్న హైకోర్టు సింగిల్ బెంచ్ ప్రభుత్వ వాదనను సమర్ధించింది. అందుకనే సీట్ల కన్వర్షన్ కుదరదని ఆగష్టు నెల 24వ తేదీన తీర్పిచ్చింది. అయితే సింగిల్ బెంచ్ తీర్పును యాజమాన్యాలు సవాలుచేశాయి. ఈ కేసును హైకోర్టు చీఫ్ జస్టిస్ అలోక్ అరాథే, జస్టిస్ జే. శ్రీనివాసరావు ధర్మాసనం విచారించింది. ధర్మాసనం విచారణలో ప్రభుత్వవాదన తేలిపోయింది. కాలేజీ యాజమాన్యాలు ఏమన్నాయంటే కొన్ని కాలేజీలకు సీట్ల కన్వర్షన్ కు 120 సీట్లకు అనుమతించిన ప్రభుత్వం మరికొన్ని కాలేజీలకు మాత్రం నిరాకరించినట్లు పిటీషనర్ల తరపు లాయర్ డీ ప్రకాష్ రెడ్డి వాదించారు. సీట్ల కన్వర్షన్ కు ఏఐసీటీఈ, జేఎన్టీయూ అనుమతులను కూడా చూపించారు. దాంతో ధర్మాసనం జోక్యంచేసుకుని కొన్ని కాలేజీలకు అనుమతించిన ప్రభుత్వం మరికొన్ని కాలేజీలకు ఎందుకు నిరాకరించిందని సూటిగా ప్రభుత్వాన్ని నిలదీసింది. సీట్ల కన్వర్షన్ కు అనుమతిస్తే టీచింగ్ స్టాఫ్ తగినంతగా ఉండరని, మౌళికసదుపాయాలు కూడా ఉండవని అడ్వకేట్ జనరల్ చెప్పారు. కొన్ని కాలేజీలను అనుమతించిన ప్రభుత్వం మరికొన్ని కాలేజీలకు మాత్రం ఎందుకు నిరాకరించిందన్న ధర్మాసనం ప్రశ్నకు అడ్వకేట్ జనరల్ సరైన సమాధానం చెప్పలేకపోయారు. అందుకనే కేసు విచారణను సెప్టెంబర్ 4వ తేదీకి వాయిదా వేసింది.

Read More
Next Story