‘రాష్ట్రపతిపై సుప్రింకోర్టులో కేసు వేయాలి’
x
Kalvakuntla Kavitha

‘రాష్ట్రపతిపై సుప్రింకోర్టులో కేసు వేయాలి’

రెండుబిల్లులు రాష్ట్రపతి ఆమోదానికి నోచుకోకుండా పెండింగులోనే ఉన్న విషయాన్ని ఆమె గుర్తుచేశారు


తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎంఎల్సీ కల్వకుంట్ల కవిత శనివారం విచిత్రమైన డిమాండును తెరపైకి తెచ్చారు. అదేమిటంటే రాష్ట్రపతి, కేంద్రప్రభుత్వంపై తెలంగాణ ప్రభుత్వం సుప్రింకోర్టులో కేసులు వేయాలని. అసెంబ్లీ, శాసనమండలి ఆమోదించిన బిల్లులు రాష్ట్రపతి దగ్గర, చట్టసవరణ బిల్లు గవర్నర్ దగ్గర పెండింగులో ఉండగానే ప్రభుత్వం తెచ్చిన ఎంఎస్ జీవో 9 అమలుకు హైకోర్టు స్టే విధించిన విషయం తెలిసిందే. ఆరుమాసాల నుండి తెలంగాణ ప్రభుత్వం పంపిన బిల్లులను రాష్ట్రపతి కోల్డ్ స్టోరేజీలో ఉంచుకున్నట్లు కవిత ఆరోపించారు. పంపిన రెండుబిల్లులు రాష్ట్రపతి ఆమోదానికి నోచుకోకుండా పెండింగులోనే ఉన్న విషయాన్ని ఆమె గుర్తుచేశారు.

స్ధానికసంస్ధలఎన్నికల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్ తో పాటు విద్యా, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పిస్తు అసెంబ్లీ, కౌన్సిల్ ఆమోదం తెలిపి ఆరుమాసాలైనట్లు కవిత చెప్పారు. 2018 పంచాయితీ రాజ్ చట్టానికి సవరణచేసి బీసీలకు స్ధానిక సంస్ధల ఎన్నికల్లో రిజర్వేషన్లు కల్పించే సవరణ బిల్లు గవర్నర్ దగ్గర పెండింగులో ఉన్న విషయాన్ని తెలిపారు. ఉభయసభలు ఆమోదించిన బిల్లులను రాష్ట్రపతి, గవర్నర్ ఇంకా ఎంతకాలం కోల్డ్ స్టోరేజీలో ఉంచుతారని నిలదీశారు.

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే జీవో 9 అమలుపై స్టే ఇచ్చిన హైకోర్టు తీర్పును సుప్రింకోర్టులో సవాలు చేయాలని రాష్ట్రప్రభుత్వం ఆలోచిస్తోంది. నేపధ్యంలోనే కవితేమో ఏకంగా రాష్ట్రపతి, కేంద్రప్రభుత్వంపైనే సుప్రింకోర్టులో కేసులు దాఖలుచేసి పోరాడాలని సలహా ఇచ్చారు. బిల్లులు పెండింగులో పెట్టడంపై తమిళనాడులో గవర్నర్ పై అక్కడి డీఎంకే ప్రభుత్వం కోర్టులో పోరాడిన విషయం తెలిసిందే. గవర్నర్ మీద పోరాడటం వరకు ఓకేనే కాని ఏకంగా రాష్ట్రపతి మీదే కేసులు వేయాలని, పోరాటం జరపాలని చెప్పటం అంటేనే ఆశ్చర్యంగా ఉంది.

Read More
Next Story