అడవిలో ‘కంటెయినర్ పాఠశాల’, తెలంగాణలోనే ఫస్ట్
x

అడవిలో ‘కంటెయినర్ పాఠశాల’, తెలంగాణలోనే ఫస్ట్

చుట్టూ అటవీ ప్రాంతం..గలగల పారుతున్న గోదావరి మధ్యలో ఉన్న కుగ్రామం బంగారుపల్లి.ఈ అటవీ గ్రామ విద్యార్థుల కోసం కంటెయినర్ పాఠశాలను మంత్రి సీతక్క ప్రారంభించారు.


ములుగు జిల్లాలోని మారుమూల దట్టమైన అడవి మధ్యలో ఉన్న బంగారుపల్లి గ్రామంలో గిరిజన పిల్లల కోసం తెలంగాణలోనే మొట్టమొదటిసారి కంటెయినర్ పాఠశాలను ఏర్పాటు చేశారు. కంటెయినర్ పాఠశాల ఏర్పాటుతో గిరిజనులే కాకుండా వారి పిల్లలు ఆనందం వ్యక్తం చేశారు.

- ములుగు జిల్లా వన్యప్రాణులున్న అభయారణ్యంలోని గ్రామాల్లో శాశ్వత భవన నిర్మాణాలు చేపట్టడానికి అటవీశాఖ నిబంధనలు అనుమతించడం లేదు. దీంతో గత పదేళ్లుగా కన్నాయిగూడెం మండలం కాంతనపల్లి గ్రామ పరిధిలోని బంగారుపల్లి గిరిజన గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల చిన్న గుడిసెలో అసౌకర్యాల మధ్య నడుస్తుండేది.
- బంగారుపల్లి తండాలో నివాసముంటున్న గిరిజన సంఘాల పిల్లలు చదువుకునేందుకు వీలుగా మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర మంత్రి సీతక్క ములుగు జిల్లా కలెక్టర్ టీఎస్ దివాకరను ఆదేశించారు. దీంతో కలెక్టరు కంటైనర్ పాఠశాల నిర్మాణానికి రూ.13 లక్షలు మంజూరు చేశారు.

అన్ని సౌకర్యాలతో కంటెయినర్ పాఠశాల
తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలను కంటైనర్‌లో ఏర్పాటు చేయడం ఇదే తొలిసారి. ఈ పాఠశాల 25 అడుగుల వెడల్పు, 25 అడుగుల పొడవు ఉంది. దీనిలో 12 డ్యూయల్ డెస్క్‌లు, హెడ్మాస్టర్, ఉపాధ్యాయులు కూర్చునేందుకు మూడుకుర్చీలు ఉన్నాయి. తెలంగాణలో కంటైనర్ దుకాణాలు, ఇళ్లు నిర్మిస్తున్నా,ప్రభుత్వ పాఠశాలగా కంటెయినర్ ఏర్పాటుచేయడం ఇదే తొలిసారి. “కంటెయినర్ క్లాస్‌రూమ్ అనేది మంత్రి సీతక్క మార్గదర్శకత్వంలో చేపట్టిన కార్యక్రమం.ప్రత్యేకించి మారుమూల ప్రాంతాల్లో శాశ్వత పాఠశాల భవనాలు అందుబాటులో లేని కొరత తీర్చేందుకు దీన్ని ఏర్పాటు చేశాం’’ అని ములుగు జిల్లా కలెక్టరు దివాకర చెప్పారు.

నాడు కంటెయినర్ ఆసుపత్రి...నేడు కంటెయినర్ పాఠశాల
కంటైనర్ పాఠశాలను ములుగులో నిర్మించి మారుమూల గ్రామాలకు తీసుకు వచ్చారని ములుగు జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ అధికారి ముహ్మద్ రఫీఖ్ ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. గతంలో తాడ్వాయి మండలం బంధాల గ్రామపంచాయతీలోని పోచారంలోని మారుమూల ఏజెన్సీ ప్రాంత ప్రజలకు అత్యవసర వైద్యం అందించేందుకు కంటైనర్‌ ఆస్పత్రిని ఏర్పాటు చేశారని, అదే బాటలో ప్రస్థుతం పాఠశాల ఏర్పాటు చేశారని రఫీఖ్ పేర్కొన్నారు.నాలుగు ఫ్యాన్లు,తరగతి గదిలో చుట్టూ జాతీయ నేతల చిత్రపటాలు, బ్లాక్ బోర్డుతోపాటు అన్ని సౌకర్యాలను కంటెయినర్ పాఠశాలలో ఏర్పాటు చేశారని ములుగు జిల్లా విద్యాశాఖాధికారి పాణిని చెప్పారు. సోలార్ ప్యానల్స్ ఏర్పాటు చేసి ఈ కంటెయినర్ పాఠశాలకు విద్యుత్ సౌకర్యం కల్పించారు.

గిరిజన పిల్లలకు ఆంగ్ల అక్షరాలు బోధిస్తున్న మంత్రి సీతక్క

విద్యార్థులకు ఆంగ్ల అక్షరాలు బోధించిన మంత్రి
బంగారిపల్లి గ్రామ కంటెయినర్ పాఠశాలను ప్రారంభించిన రాష్ట్ర మంత్రి సీతక్క విద్యార్ధులకు ఆంగ్ల అక్షరాలు బోర్డుపై రాసి బోధించారు. పదేళ్లుగా చిన్న టైల్స్ పాకలో పాఠశాల నడిచేది. అటవీ గ్రామం వన్యప్రాణుల అభయారణ్యం పరిధిలోకి రావడంతో కొత్త భవనాల నిర్మాణానికి అనుమతించలేదు. దీంతో బంగారుపల్లిలో పాఠశాలకు కంటెయినర్ పాఠశాలను ఏర్పాటు చేయించానని మంత్రి సీతక్క చెప్పారు. అభయారణ్యం కావడం వల్ల కన్నాయిగూడెం అటవీ ప్రాంత గ్రామాల్లో రోడ్లు, కరెంటు లైన్లు,పాఠశాలకు పక్కా భవనాలు లేవని మంత్రి చెప్పారు.

విద్యార్థులతో మంత్రి మాట ముచ్చట
బంగారుపల్లి కంటెయినర్ పాఠశాలలో మంత్రి సీతక్క విద్యార్థులతో ముచ్చటించారు.‘‘నీ పేరేంది? రోజూ బడికి వచ్చి బాగా చదువు కుంటావా?’’ అని మంత్రి సీతక్క బంగారుపల్లిలోని ఓ విద్యార్ధిని ప్రశ్నించారు. ‘‘స్కూలు ఆవరణలో చెట్లు పెంచుకోండి. ఒక్కో విద్యార్థి ఒక్కో చెట్టుకు నీళ్లు పోయాలి’’ అని మంత్రి విద్యార్థులకు సూచించారు.



గిరిజన పిల్లలకు నాణ్యమైన విద్యను అందిస్తాం...

దట్టమైన అడవి ప్రాంతాల్లోని గిరిజన గ్రామాల్లోని పిల్లలకు నాణ్యమైన విద్యను అందించడానికి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని, గిరిజన పిల్లలను విద్యావంతులుగా చేయడానికి కృషి చేస్తున్నామని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా,స్త్రీ- శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క చెప్పారు.బంగారు పల్లిలో 13.50 లక్షల రూపాయలతో ఏర్పాటు చేసిన కంటెయినర్ ప్రభుత్వ పాఠశాలను మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యులు పోరిక బలరాం నాయక్, వరంగల్, నల్గొండ, ఖమ్మం నియోజకవర్గం టీచర్స్ శాసన మండలి సభ్యులు నర్సిరెడ్డి, జిల్లా కలెక్టర్ దివాకర్ టి.ఎస్.లతో కలిసి ప్రారంభించారు.

మరిన్ని కంటెయినర్ పాఠశాలలు ఏర్పాటు చేస్తాం...
ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ అటవీ ప్రాంతాల గ్రామాల్లో ప్రభుత్వ పాఠశాల ఏర్పాటు చేయడానికి కేంద్ర అటవీశాఖ నిబంధనలు ఉండటంతో ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేయలేకపోతున్నామని, దీంతో ఎలాగైనా గిరిజన బిడ్డలకు విద్యను అందించాలని ఉద్దేశంతో కంటెయినర్ పాఠశాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. రానున్న రోజులలో మరో రెండు మూడు చోట్ల ఇలాంటి కంటెయినర్ పాఠశాలలు ఏర్పాటు చేస్తామని మంత్రి ప్రకటించారు.



Read More
Next Story