
Revanth | స్ధానిక ఎన్నికల నిర్వహణపై ‘బొమ్మ’ కీలక వ్యాఖ్యలు
ప్రభుత్వంలో జరుగుతున్న పరిణామాలను గమనిస్తుంటే హైకోర్టు(Telangana High court) ఆదేశాల ప్రకారం ఎన్నికలు జరిగే సూచనలు కనబడటంలేదు
స్ధానిక సంస్ధల ఎన్నికల నిర్వహణ కీలకమలుపు తీసుకోబోతున్నది. హైకోర్టు ఆదేశాల ప్రకారం స్ధానిక ఎన్నికలను సెప్టెంబర్ 30వ తేదీకల్లా నిర్వహించాలి. అయితే ప్రభుత్వంలో జరుగుతున్న పరిణామాలను గమనిస్తుంటే హైకోర్టు(Telangana High court) ఆదేశాల ప్రకారం ఎన్నికలు జరిగే సూచనలు కనబడటంలేదు. ఎన్నికల నిర్వహణ(Local body elections)ను వాయిదావేయాలని ప్రభుత్వం హైకోర్టును కోరే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. పీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్(PCC President Bomma Mahesh) చేసిన తాజా వ్యాఖ్యలే దీనికి నిదర్శనం. ఒక ఛానల్ ఇంటర్వ్యూలో బొమ్మ మాట్లాడుతు గడువులోగా స్ధానిక ఎన్నికల నిర్వహణ సాధ్యంకాదన్నారు. బీసీలకు 42శాతం(BC Reservations)రిజర్వేషన్లకు సంబంధించిన రాష్ట్రప్రభుత్వం పంపిన బిల్లు, తర్వాత పంపిన ఆర్డినెన్స్ కేంద్రం పరిశీలనలో ఉన్న విషయాన్ని బొమ్మ గుర్తుచేశారు.
ఇదే విషయాన్ని వివరిస్తు హైకోర్టులో పిటీషన్ వేసి స్ధానికఎన్నికల నిర్వహణకు గడువు కోరాలని తాను ఎనుముల రేవంత్ రెడ్డికి చెప్పినట్లు చెప్పారు. రేవంత్-బొమ్మకు మధ్య జరిగిన సంభాషణను అధ్యక్షుడు మీడియాతో చెప్పారంటేనే సీఎం దగ్గర నుండి సానుకూలత కనబడినట్లు అర్ధమవుతోంది. లేకపోతే ఈవిషయాన్ని బొమ్మ ఇంటర్వ్యూలో చెప్పనే చెప్పరు. ఈనెల 23వ తేదీన కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల కమిటి(పీఏసీ) సమవేశంలో చర్చించి తర్వాత సుమారుగా 24వ తేదీన జరగబోయే క్యాబినెట్ భేటీలో ఎన్నికల నిర్వహణ విషయంలో ఫైనల్ డెసిషన్ తీసుకుంటారు. ఆ నిర్ణయం ప్రకారం వెంటనే స్ధానికఎన్నికల నిర్వహణకు మరింత గడువు కావాలని కోరుతు హైకోర్టులో పిటీషన్ వేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
బీసీలకు 42శాతం రిజర్వేషన్ అంశం ఇపుడు తెలంగాణలో హట్ టాపిక్ అయిపోయింది. అందుకనే బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పిస్తు అసెంబ్లీలో రేవంత్ ప్రభుత్వం తీర్మానం చేసింది. దాన్ని ఆమోదంకోసం గవర్నర్ ద్వారా రాష్ట్రపతికి పంపారు. అయితే రాష్ట్రపతి దగ్గర బిల్లు పెండింగులో ఉండిపోయింది. బిల్లుతో లాభంలేదని అర్ధమైన తర్వాత ఏకంగా క్యాబినెట్లో చర్చించి ఆర్డినెన్స్ తీసుకోవాలని నిర్ణయించారు. ఆర్డినెన్స్ అమలుకు గవర్నర్ దగ్గరకు ఫైలును పంపింది ప్రభుత్వం. అయితే ఆర్డినెన్సును పరిశీలన నిమ్మిత గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ కేంద్ర హోంశాఖకు పంపారు. దాంతో ముందుపంపిన బిల్లు, తర్వత పంపిన ఆర్డినెన్స్ రెండూ కేంద్రం దగ్గరే పెండింగులో ఉండిపోయాయి. బిల్లు, ఆర్డినెన్సు రెండూ కేంద్రం దగ్గర పెండింగులో ఉన్నాయి కాబట్టి స్ధానిక ఎన్నికల నిర్వహణకు మరింత గడువు కోరాలని ఇప్పటికే రేవంత్ నిర్ణయం తీసుకున్నట్లు పార్టీవర్గాల సమాచారం.
హైకోర్టు అంగీకరిస్తుందా ?
పార్టీ, ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే సరిపోతుందా ? ఎన్నికల నిర్వహణను వాయిదా వేయాలా ? వద్దా ? అని డిసైడ్ చేయల్సింది హైకోర్టు మాత్రమే. ప్రభుత్వవాదనతో హైకోర్టు విభేదించి ఎన్నికలు గడువుప్రకారం నిర్వహించాల్సిందే అని ఆదేశిస్తే అప్పుడు రేవంత్ ఏమిచేస్తారు ? చేయటానికి ఏమీలేదు. బీసీలకు 42శాతం రిజర్వేషన్లను చట్టప్రకారం కాకుండా పార్టీపరంగా అమలుచేయటం ఒకటే మార్గం. చట్టంలో అమల్లో ఉన్నట్లు 22శాతం రిజర్వేషన్లకు అదనంగా మరో 20శాతం కలిసి మొత్తం 42శాతం రిజర్వేషన్లు ఇచ్చామని ఎన్నికల ప్రచారంలో చెప్పుకోవటం ఒకటే రేవంత్ ముందున్న మార్గం. కాంగ్రెస్ నిర్ణయాన్ని బీజేపీకి కూడా ఫాలో అవుతుంది. ఎలాగంటే బీసీలకు రాబోయే స్ధానికఎన్నికల్లో 45శాతం రిజర్వేషన్లు అమలుచేస్తామని బీజేపీ అధ్యక్షుడు నారపరాజు రామచంద్రరావు ఇప్పటికే ప్రకటించారు. బీఆర్ఎస్ మాత్రమే తన స్టాండును ఇప్పటివరకు ప్రకటించలేదు.
సుప్రింకోర్టుకు అడ్డం తిరిగిన కేంద్రం
రాష్ట్రాల శాసనసభలు ఆమోదించిన బిల్లులపై చర్యలు తీసుకోవటానికి రాష్ట్రపతి, గవర్నర్లకు గడువు విధించాలన్న సుప్రింకోర్టు ఆదేశాలకు కేంద్రప్రభుత్వం అడ్డంతిరిగింది. ఈమేరకు సుప్రింకోర్టుకు కేంద్రం లేఖరాసింది. రాష్ట్రపతి, గవర్నర్లకు గడువు విధించటం అంటే రాజ్యాంగ గందరగోళం సృష్టించటమే అని సుప్రింకోర్టును కేంద్రం హెచ్చరించింది. రాష్ట్రపతి, గవర్నర్లకు గడువు విధించటం అంటే తనకు లేని అధికారాలను సుప్రింకోర్టు తీసుకోవటమే అని ఘాటుగా చెప్పింది. సుప్రింకోర్టును హెచ్చరిస్తు కేంద్రం రాసిన లేఖ ప్రకారం చూసినా బీసీలకు 42శాతం రిజర్వేషన్ల అమలు బిల్లుకు కేంద్రప్రభుత్వం ఇపుడిపుడే నిర్ణయం తీసుకునే అవకాశాలు లేవని అర్ధమైపోతోంది. ఈనేపధ్యంలో హైకోర్టు స్పందన ఏమిటన్నది రాష్ట్రప్రభుత్వం తీసుకునే నిర్ణయం మీద ఆధారపడుంది.