
ఛత్తీస్ ఘడ్ లో భారీ ఎన్ కౌంటర్, ముగ్గురు మృతి
ఛత్తీస్ ఘడ్, సుక్మా జిల్లాలోని గొల్లపల్లి అటవీపర్వత ప్రాంతంలో గురువారం ఉదయం నుండి భారీ ఎన్ కౌంటర్ జరుగుతోంది
ఆపరేషన్ కగార్ లక్ష్యాన్ని సాధించేట్లుగానే ఉంది చూస్తుంటే. 2026, మార్చి 31నాటికి దేశాన్ని మావోయిస్టురహిత దేశంగా మార్చాలని నరేంద్రమోదీ ప్రభుత్వం డిసైడ్ అయ్యింది. దానికి తగ్గట్లుగా(Maoist encounter) మావోయిస్టుల ఏరివేతకు ప్రత్యేకంగా కేంద్ర హోంశాఖ మంత్రి(Amit Shah) అమిత్ షా ఆపరేషన్ కగార్ ను మొదలుపెట్టారు. ఇపుడు విషయం ఏమిటంటే(Chhattisgarh) ఛత్తీస్ ఘడ్, సుక్మా జిల్లాలోని గొల్లపల్లి అటవీపర్వత ప్రాంతంలో గురువారం ఉదయం నుండి భారీ ఎన్ కౌంటర్ జరుగుతోంది. గొల్లపల్లి ప్రాంతంలో మావోయిస్టులు ఉన్నారన్న సమాచారంతో భద్రతాదళాలు అటవీ పర్వతప్రాంతాన్ని చుట్టుముట్టాయి. మావోయిస్టులకోసం అన్నీకోణాల్లో అడవుల్లో జల్లెడపడుతున్నాయి. అడవిలో కూంబింగ్ చేస్తున్న(Operation Kagar) భద్రతాదళాల పైకి హఠాత్తుగా కాల్పులు మొదలయ్యాయి.
దాంతో అప్రమత్తమైన భద్రతాదళాలు కూడా ఎదురుకాల్పులు ప్రారంభించారు. రెండువైపులా జరుగుతున్న కాల్పుల్లో చివరి సమాచారం అందేసరికి ముగ్గురు మావోయిస్టులు మరణించినట్లు సమాచారం అందింది. ఎన్ కౌంటర్లో ముగ్గురు మావోయిస్టులు మరణించిన విషయాన్ని సుక్మాజిల్లా ఎస్పీ కిరణ్ చవాన్ నిర్ధారించారు. మావోయిస్టులు-భద్రతాదళాలకు మధ్య భీకరస్ధాయిలో కాల్పులు జరుగుతున్నట్లు చెప్పారు. మృతుల్లో ఒక మహిళ కూడా ఉన్నట్లు తెలిపారు. అటవీ పర్వత ప్రాంతంమొత్తాన్ని డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్స్(డీఆర్జీ), భద్రతాదళాలు చుట్టుముట్టేశాయి కాబట్టి మావోయిస్టుల వైపునుండి మృతులసంఖ్య మరింత పెరిగే అవకాశముంది.
ఆపరేషన్ కగార్లో భాగంగా కేంద్రప్రభుత్వం మావోయిస్టులకు రెండు ఛాయిసులు మత్రమే ఇచ్చింది. అదేమిటంటే పోలీసుల ఎదుట లొంగిపోవటమో లేకపోతే ఎన్ కౌంటర్లో మరణించటమో అంతే. అడవుల్లో ఆయుధాలతో పోరాడి సాధించేది ఏమీలేదు అనుకున్న కీలకనేతలు, దళసభ్యులు పోలీసుల ఎదుట లొంగిపోతున్నారు. ఆయుధం ద్వారా మాత్రమే విప్లవాన్ని సాధించగలమని నమ్ముతున్న మరికొందరు కీలక నేతలతో పాటు వాళ్ళ మద్దతుదారులు పోరాటాలు చేస్తున్నారు. ఆయుధాలతో సహా లొంగిపోయిన వారికి ప్రభుత్వం ఉపాధిఅవకాశాలు, ప్రోత్సాహకాలు కల్పించి జనజీవనశ్రవంతిలోకి తీసుకుని వస్తోంది. కాదు కూడదని అన్నవారిని ఎన్ కౌంటర్లలో చంపేస్తోంది. మల్లోజుల వేణుగోపాల్, ఆశన్న, సుజాత లాంటి కేంద్రకమిటి సభ్యులతో పాటు వారిమద్దతుదారులు వందలమంది ఈమధ్యనే పోలీసులకు లొంగిపోయిన విషయం తెలిసిందే.
పోరుబాటలోనే ఉన్న మాడ్వీ హిడ్మా లాంటి వాళ్ళు పోలీసుల ఎన్ కౌంటర్లలో బలైపోతున్న విషయాన్ని అందరు చూస్తున్నదే. ఏదేమైనా పోరుబాటలో ఉన్న మావోయిస్టు కీలకనేతల్లో చాలామంది వృద్ధాప్య, అనారోగ్య కారణాలతో చాలా ఇబ్బందులు పడుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. మిగిలి ఉన్న మావోయిస్టు కీలకనేతలు కొద్దిమందే కాబట్టి మార్చి 31నాటికి ఆపరేషన్ కగార్ లక్ష్యాన్ని భద్రతాదళాలు చేరుకునేట్లుగానే కనబడుతున్నాయి.

