
జింక మాంసం కలకలం.. ఒకరు అరెస్ట్
రంగారెడ్డి జిల్లా అత్తాపూర్ పరిధిలో జింక మాంసం విక్రయాలు జరుగుతుండటం స్థానికంగా కలకలం రేపింది. ఈ ఘటనలో ఎస్‌వోటీ (స్పెషల్ ఆపరేషన్స్ టీమ్) అధికారులు అత్తాపూర్‌లోని సులేమాన్ నగర్‌లో మహ్మద్ ఇర్ఫానుద్దీన్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతని దగ్గర నుంచి భారీగా జింక మాంసం, ఇతర ఆధారాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడి దగ్గరి నుంచి సుమారు 15 కిలోల జింక మాంసం, జింక తోలు, జింక తలతో పాటు రూ.3,500 నగదు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.
ప్రాథమిక దర్యాప్తులో మహ్మద్ ఇర్ఫానుద్దీన్ పెబ్బేరు ప్రాంతం నుంచి జింక మాంసాన్ని నగరానికి తీసుకువచ్చి, అత్తాపూర్ పరిధిలో స్థానికంగా వధించి, కిలో రూ.800 చొప్పున విక్రయిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఎస్‌వోటీ అధికారులు నిందితుడిని అదుపులోకి తీసుకుని, స్వాధీనం తీసుకున్న మాంసం, ఇతర సాక్ష్యాలతో అత్తాపూర్ పోలీసులకు అప్పగించారు. నిందితుడిపై వన్యప్రాణి సంరక్షణ చట్టం (Wildlife Protection Act) 1972 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
పోలీసుల ప్రకటన ప్రకారం, జింక, ఇతర అటవీ జంతువులను వేటాడటం, వాటి మాంసం లేదా అవయవాలను విక్రయించడం తీవ్రమైన నేరం. ఇలాంటి నేరాలకు కఠిన శిక్షలు, భారీ జరిమానాలు విధిస్తారు. ఈ ఘటనను దృష్టిలో ఉంచుకొని, అత్తాపూర్, సులేమాన్ నగర్ పరిసర ప్రాంతాల్లో పోలీసులు నిఘా పెంచారు. వన్యప్రాణి మాంసం విక్రయాలు లేదా అక్రమ వేటకు సంబంధించిన ఏదైనా సమాచారం తెలిసిన వెంటనే పోలీసులకు తెలియజేయాలని అధికారులు కోరారు. అసలు సులేమాన్‌కు జింకను అమ్మింది ఎవరు? దానిని వేటాడింది ఎవరు? అన్న కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

