
అనుమానంతో భార్యను సజీవదహనం చేసిన భర్త
వీడియోలు వెలుగులోకి రావడంతో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది.
నగరంలోని నల్లకుంట పరిధిలో చోటుచేసుకున్న ఓ దారుణ ఘటన కలకలం రేపింది. భార్యపై అనుమానంతో భర్త ఆమెపై పెట్రోల్ పోసి నిప్పంటించిన ఘటన మంగళవారం అర్ధరాత్రి జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు వెలుగులోకి రావడంతో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది.
వివరాల ప్రకారం, నల్లగొండ జిల్లాకు చెందిన వెంకటేశ్, త్రివేణి ప్రేమించి వివాహం చేసుకున్నారు. ఉద్యోగాల నిమిత్తం హైదరాబాద్‌కు వచ్చి నల్లకుంటలోని తిలక్‌నగర్ బస్తీలో అద్దెకు నివాసం ఉంటున్నారు. వీరికి ఒక పాప, ఒక బాబు ఉన్నారు. వెంకటేశ్ సెంట్రింగ్ పనులు చేస్తుండగా, త్రివేణి ఓ హోటల్‌లో పనిచేస్తోంది.
త్రివేణి హోటల్ నుంచి కొద్దిగా ఆలస్యంగా ఇంటికి వచ్చినా వెంకటేశ్ ఆమెపై అనుమానంతో వేధించేవాడని కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ వేధింపులు తట్టుకోలేక కొద్దిరోజుల క్రితం త్రివేణి పుట్టింటికి వెళ్లింది. తాను మారుతానని నమ్మబలికి వెంకటేశ్ ఆమెను మళ్లీ హైదరాబాద్‌కు తీసుకొచ్చాడు. అయితే తిరిగి వచ్చిన తర్వాత కూడా అతని ప్రవర్తన మారకపోవడంతో దంపతుల మధ్య కలహాలు మరింత పెరిగాయి.
ఈ నేపథ్యంలో మంగళవారం అర్ధరాత్రి సుమారు 12.30 గంటల సమయంలో భార్య త్రివేణి, కొడుకు ఒకే మంచంపై నిద్రపోతుండగా, కూతురు కింద పడుకుని ఉంది. ఆ సమయంలో వెంకటేశ్ నిద్రలో ఉన్న భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఘటనను గమనించిన కూతురు అడ్డుకునే ప్రయత్నం చేయగా, ఆమెను కూడా మంటల్లోకి తోసే ప్రయత్నం చేసినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం వెంకటేశ్ అక్కడి నుంచి పరారయ్యాడు. అతి కష్టం మీద కూతురు తప్పించుకుంది.
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. పరారీలో ఉన్న నిందితుడు వెంకటేశ్‌ను గంటల వ్యవధిలోనే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి, పూర్తి వివరాలను సేకరిస్తున్నారు.

