కోల్లాపూర్ రాజావారి ప్యాలెస్ లోకి ఒక సారి తొంగి చూద్దామా?
x

కోల్లాపూర్ రాజావారి ప్యాలెస్ లోకి ఒక సారి తొంగి చూద్దామా?

రాజావారి జ్ఞాపకాలన్నింటిని ఒక పర్సనల్ మ్యూజియం లో భద్రపరిచారు.


రాజ్యాలు, రాచరికాలు, సంస్థానాలు వారి వైభవం మనం చూడలేదు. అయితే వారి వైభవం గురించి చరిత్ర రకరకాల కథలు వింటూంటాం. వాటి ఆనవాళ్లు నేటికీ అక్కడక్కడ భద్రపరిచి ఉన్నాయి. కొన్ని చిన్న చిన్న సంస్థానాకు చాలా ఉజ్వలమయిన చరిత్ర ఉంది. ఉదాహరణకు గద్వాల సంస్థానము, కొల్లాపూర్ సంస్థానం,విజయనగరం రాజులు , వెంకటగిరి సంస్థానం. ఇవి కళలను సాహిత్యాన్ని బాగా పోషించాయి. ఆ సంస్థానాల చరిత్రకు సాక్ష్యంగా నిలిచిన రాజ మందిరాలను చూసి ఆనాటి వారి వైభవం అర్థం చేసుకోవచ్చు. ఇటీవల కొల్లాపూర్ సంస్థానం ను కొంతమంది మిత్రులతో కలిసి వెళ్లి సందర్శించడం జరిగింది. అక్కడ సంస్థానం చరిత్రనంతా చక్కగా భద్రపరించారు.




మిత్రుడు చంద్రశేఖర్ ఆధ్వ ర్యంలో నాతోపాటు అమెరికా నుండి వచ్చిన నీలా, రఘు,కొరియా నుండి దిగిన సుబ్బారెడ్డి, హైదరాబాద్ భాస్కర్ రెడ్డి, శ్రీకాంత్ రమేష్ రెడ్డి, పాండిచ్చేరి నుంచి వచ్చిన రాజశేఖర్ కోల్లాపూర్ బయలు దేరాం. అక్కడ సంస్థానం గురించి తెలిసి చూడాలనుకున్నాం. కోల్లాపూర్ తెలంగాణ నాగర్ కర్నూలు జిల్లాలో ఉంటుంది. హైదరాబాద్ నుంచి 180 కి.మీ. కర్నూలను నుంచి 103 కిమీ. కోల్లోపూర్ చేరుకోవడం చాలా సులుభం. ఈ సంస్థానం మేనేజర్ లక్ష్మన్న అనేక విషయాలు తెలిపారు. విశాలమైన ప్రాంగణం చుట్టూ కోట. కోటకు పెద్ద ముఖద్వారం ఉంది. ముఖద్వారం కు పెద్ద చెక్క తలుపులు ఉన్నాయి. వాచ్ మెన్ తలుపులు తీసి ఉంచడంతో ముందే అనుమతి ఉన్నందున నేరుగా మా వాహనాల్లో కోట లోపలికి వెళ్లాం. వెళ్లగానే ఎదురుగా పరిపాలనా భవనంగా ఉపయోగించే అద్భుతమైన భవనం కనిపించింది . భవనం బయట చాలా బహిరంగ ప్రదేశం ఉంది. 19వ మరియు 20వ శతాబ్దాలలో నిర్మించిన మూడు భవనాలు ఉన్నాయి. నివాస సముదాయం మధ్యలో రాణి నివాసం ఉన్న భవనం ఎదురుగా ఆనాటి పాలకులు ఉపయోగించిన గుర్రపు బండ్లు ఉన్నాయి. వాటిని చూస్తు మేం చరిత్రలోకి జారకున్నట్లు అని పించింది.


ప్యాలస్ మీద వ్యాసరచయిత చందమూరి నరసింహారెడ్డి


కొల్లాపూర్ నిజాం నవాబు క్రింద ఒక సంస్థానం. 1871లో కొల్లాపూర్ ప్యాలెస్ ను నిర్మించినట్లు బోర్డు ఉంది. ఆనాటి పాలకులు ఉపయోగించిన సభా భవనం లోకి మేనేజర్ లక్ష్మన్న మమ్మల్ని తీసుకెళ్ళి అక్కడ ఉన్న రాజులు ఫోటో లను చూపించి వారి గురించి వివరించారు. సభా భవనం లో చాలా పురాతనమైన ఫోటోలు, పెయింటింగ్ లు, అడవి జంతువుల తలలు చూశాం.




ఆతర్వాత మరో గదిలోకి వెళ్లాం . ఆనాటి పాలకులు వాడిన పంకాను చూశాం అది నేటికీ పనిచేస్తుండటం విశేషం. మరో గదిలోకి వెళ్లాం అక్కడ అనేక పురాతన వస్తువులు ఉన్నాయి. గోడ గడియారాలు, కూజాలు , ఆనాటి వాటర్ ఫిల్టర్, వివిధ దేశాల నుంచి దిగుమతి చేసుకున్న వస్తువులు చూడటం జరిగింది.





సంస్థానం లోని పరిపాలన భవనం లో ఆనాటి పాలకులు వేటకు వెళ్ళి వేటాడిన జంతువుల తలలను ఉంచారు. అవి పాడవకుండా నేటికీ కాపాడుతూ వస్తున్నారు. ఆనాడు వాడిన అనేక వస్తువులు , పరికరాలు నేటికీ సాక్ష్యాలు గా మిగిలి ఉన్నాయి. పెయింటింగ్ లు ఉన్నాయి.




సంస్థానం సందర్శించడం ఓ చక్కని అనుభూతిని మిగిల్చింది. ఆనాటి పాలకులు వేటలో హతమార్చిన పెద్ద పులిని కెమికల్ ట్రీట్మెంట్ చేసి కళేబరం ను కాపాడుతూ వస్తున్నారు. దానిని రాజభవనం లో ఉంచారు. అక్కడ మేమందరం కలిసి ఫోటోలకు ఫోజులు ఇస్తూ ఫోటోలు తీసుకోవడం జరిగింది.




సంస్థానం సందర్శన ఓ మధురానుభూతి. వివిధ మార్గాల సమాచారం మేరకు సంస్థానం చరిత్ర ఇలా ఉంది. కృష్ణానది తీరాన ఉన్న నల్లమల ప్రాంతం కొల్లాపూర్ ఆధీనంలో ఉండేది. వీరి వంశంలో ప్రస్తుతం సురభి వెంకటకుమార కృష్ణ బాలాదిత్య లక్ష్మారావు హైద్రాబాద్ లో నివసిస్తున్నట్లు తెలిపారు.ఒకప్పుడు కొలుముల పల్లెగా పిలిచిన కొల్లాపూర్ క్రీ.శ. 1840 నుంచి సురభి వంశస్తులైన వెలమ దొరలకు రాజధానిగా స్వాతంత్య్రం వచ్చేవరకు కొనసాగింది.కొల్లాపూర్ చరిత్రను పరిశీలిస్తే క్రీ.శ.1840 వరకు ఇది రాజధాని కాదు. 'కొలుముల పల్లె' అనే సామాన్య గ్రామం.




పూర్వం ఇక్కడ కంచరి అలియాస్ కమ్మరి కొలుములు నడిపేవారు . ఫలితంగా 'కొలుముల పల్లె'అనే వారు . కాలక్రమంలో కొల్లాపూర్ వాసికెక్కింది. చారిత్రక పరిశోధకుల ప్రకారం సా.శ.6-7 వ శతాబ్దిలో వీరి పాలన ప్రారంభమైనట్లు తెలుస్తుంది.పాలకులందరూ సురభి వంశస్థులే. అందుకే వీరికి సురభి సంస్థానాధీశులందురు. పిల్లలమర్రి బేతల రెడ్డి నాయుడు జటప్రోలు సంస్థానాధీశుల యొక్క మూలపురుషుడు.సుమారు పదహారు తరాలు కొన్ని శతాబ్దాల పాటు పరిపాలన కొనసాగించిన 'సురభి' రాజులంటే కొల్లాపూర్ ప్రాంత జనులకు వల్లమాలిన అభిమానం. గతంలో కొల్లాపూర్ రాజధాని ఎల్లూరు. ఎల్లూరు నుంచి రాజధాని నగరాన్ని రాజ వెంకట లక్ష్మారావు హయాంలో కొల్లాపూర్ కు మార్చి దానిని అభివృద్ధి చేశారు.రాజా లక్ష్మీ జగన్నాథ రావు కొల్లాపూరాన్ని 1851 నుంచి 1854 వరకు పరిపాలించారు.




రాజా వెంకట జగన్నాథరావు హయాంలో కొల్లాపూరం సంస్థానం హైద్రాబాద్ రాష్ఠ్రంలో విలీనమైంది. ఈ సంస్థానం స్థాపించింది బేతాళ నాయుడు అని చెబుతారు. మరొక కథనం ప్రకారం, ఈ వంశానికి చెందిన మాధవరాయుడు అనే కవికి పదహారవ శతాబ్దంలో విజయనగర రాజు ఆళియ రామరాయులు ఈ సంస్థానాన్ని కానుకగా ఇచ్చారని 1961 సెన్సస్ రిపోర్టులో రికార్డు చేశారు. 1507 లో మల్లభూపతినాయుడు, 1650 లో సురభి మాధవరాయ,1694లో నరసింగరావు,1850లో సురభి లక్ష్మారావు , 1851 నుంచి 1884 వరకు లక్ష్మీ జగన్నాథరావు,1884నుంచి 1929 వరకు రాజా వెంకట లక్ష్మారావు ,1929లో రాణీ వెంకట రత్నమ్మ, 1948లో రాజా సురభి వెంకట జగన్నాథరావు పాలించారు. మాధవరాయుడు గొప్పకవి. ఆయన రాసిన ఆరు ఆశ్వాసాల ‘చంద్రికా పరిణయం ’ గొప్ప ప్రబంధమని చెబుతారు. ఈ వంశం కళా పోషణ మీద బాగా పరిశోధన కూడా జరింగి. వీరు సంగీతం, సాహిత్యం, నాటక కళలను బాగా ప్రోత్సహించారు. 191 చ.కిమీ విస్తరించిన ఈ సంస్థానంలో 89 గ్రామాలుండేవి. 1901 జనాభా లెక్కల ప్రకారం సంస్థానం జనాభా 31,613. సంస్థానం రాబడి రు. 1.93 లక్షలు. నిజామ్ ప్రభువుకు ఏటా రు. 73,537 కప్పం చెల్లించేవారు.




మొదట్లో జటప్రోలు సంస్థానం గా ఉండేది. తర్వాత జటప్రోలు నుంచి కొల్లాపూర్ కు మార్చుకొన్నారు. అప్పట్లో వీరికి స్వంత విమానం ఉండటం విశేషం. కొల్లాపూర్ లో ఆ కాలంలోనే విమానాశ్రయం ఉందని ఇదే రాష్ట్రంలో మొదటిదని చెప్పారు. వెంకటగిరి రాజు కుమారుడుని దత్తత తీసుకుని 1884లో కొల్లాపూర్ సంస్థానం కు రాజు గా పట్టాభిషేకం చేశారు. కొల్లాపూర్ సంస్థానం పాలించిన రాజులు అనేక దేవాలయాలు, మసీదులు నిర్మించినట్లు తెలుస్తోంది.


Read More
Next Story