మహదేవ్ పూర్ లో చిక్కిన రౌడీ కోతి
x

మహదేవ్ పూర్ లో చిక్కిన రౌడీ కోతి

ప్రజలను ముప్పు తిప్పలు పెట్టిన కోతి చిక్కడంతో స్థానికుల హర్షం


జయశంకర్ జిల్లా భూపాలపల్లి జిల్లా మహదేవ్ పూర్ మండలంలో రౌడీ కోతి ఆదివారం చిక్కడంతో స్థానికుల్లో హర్షం వ్యక్తమౌతుంది. ఇక్కడ కోతుల బెడద తీవ్రంగా ఉంది. ఈ కోతుల్లో రౌడీ కోతి సమస్యగా మారింది. అసలే కోతి పైగా రౌడీ కోతి కావడంతో ప్రజల మీద దాడులు ఎక్కువయ్యాయి. మహదేవ్ పూర్ గ్రామ పంచాయతీలో ‘మంకీ క్యాచ్ రన్’ కార్యక్రమం విజయవంతంగా కొనసాగినప్పటికీ రౌడీ కోతి చాలాకాలంగా చిక్కడం లేదు. మహాదేవ్ పూర్ మండలంలో జరుగుతున్న ఈ ‘మంకీ క్యాచ్ రన్’ లో ఇప్పటివరకు 200 కోతులు పట్టుకున్నారు. ఒక్కో కోతికి 400 రూపాయల వరకు గ్రామ పంచాయతీ చెల్లించేది. పట్టుకున్న కోతులను అడవుల్లోకి వదిలేసినట్టు మహదేవ్ పూర్ మండల వాసులు చెబుతున్నారు. మహదేవ్ పూర్ మండలంలో ఉన్న కోతులకు ఈ రౌడీ కోతి నాయకత్వం వహించేది. తన గ్యాంగ్ తో వచ్చి ప్రజల మీద దాడులు చేసేది. కోతులు ప్రజల చేతుల్లో నుంచి తిను బండారాలను లాక్కెళ్లడం ఇక్కడ నిత్య కృత్యం. చేతిలో ఉన్న వస్తువును కోతులకు ఇవ్వాల్సిందే. లేకుంటే చుక్కలు చూపించేవి. రౌడీ కోతి గ్యాంగ్ చేస్తున్న హంగామా అంతా ఇంతా కాదు. గ్రామస్థుల మీద దాడులు జరగడంతో ఆస్పత్రి పాలవుతున్నవారి సంఖ్య ఇటీవలి కాలంలో ఎక్కువయ్యాయి. రౌడీ కోతితో బాటు 50 వరకు కోతులు బోనులో చిక్కినట్టు పంచాయతీవర్గాలు పేర్కొన్నాయి. బోనులో చిక్కిన కోతులకు దాణా, నీటి సౌకర్యం కల్పిస్తున్నారు. సిడబ్ల్యుసీ, ముక్తివనం పార్కు, హనుమాన్ నగర్ వైపు కోతుల స్థావరాలున్నాయి. రోడ్డుపై ఎవరైనా కనపడగానే కరుస్తున్నాయి.

Read More
Next Story