ప్రైవేట్ స్కూల్స్ విద్యార్థుల పేరెంట్స్ కి గుడ్ న్యూస్
x

ప్రైవేట్ స్కూల్స్ విద్యార్థుల పేరెంట్స్ కి గుడ్ న్యూస్

కొన్నేళ్లుగా యూనిఫామ్, షూస్, బెల్ట్స్ మా దగ్గరే కొనాలంటూ తల్లిదండ్రుల దగ్గర నుండి అదనంగా డబ్బులు రాబట్టే ప్రైవేట్ స్కూళ్ళపై ప్రభుత్వం కొరడా ఝుళిపించింది.


సెలవులు పూర్తయి స్కూళ్ళు రీఓపెన్ అవుతున్నాయంటే మిడిల్ క్లాస్ మెలోడీస్ మొదలవుతాయి. పిల్లల్ని తిరిగి బళ్లోకి పంపించేందుకు పెద్ద బడ్జెట్ వేసుకోవాలి. అడ్మిషన్ ఫీజులు, బస్సు ఫీజులు, బుక్స్ ఫీజులు.. ఆ ఫీజులు, ఈ ఫీజులు అంటూ సామాన్య మధ్యతరగతి పేరెంట్స్ పై పెనుభారమే పడుతుంది. ఈ రెగ్యులర్ ఫీజులు పక్కన పెడితే... కొన్నేళ్లుగా యూనిఫామ్, షూస్, బెల్ట్స్ మా దగ్గరే కొనాలంటూ తల్లిదండ్రుల దగ్గర నుండి అదనంగా డబ్బులు రాబట్టే పనిలో పడ్డాయి కొన్ని ప్రైవేట్ స్కూళ్ళు. ఇప్పుడు అలా దోచుకోవడానికి వీల్లేదంటూ ప్రభుత్వం కొరడా ఝుళిపించింది.

యూనిఫామ్‌లు, బూట్లు, బెల్టుల అమ్మకాల పేరిట తల్లిదండ్రులను దోచుకుంటున్న ప్రైవేట్‌ స్కూళ్ల అక్రమాలపై ప్రభుత్వం దృష్టి సారించింది. స్టేషనరీ, పుస్తకాలు వంటి వాటిని లాభాపేక్ష లేకుండా అమ్ముకోవాలని ప్రైవేట్ స్కూళ్ళకి ఆదేశాలిచ్చింది. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని వార్నింగ్ ఇచ్చింది. ఈ మేరకు హైదరాబాద్‌ డీఈవో (డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్) ఆదేశాలు జారీ చేశారు. తాజా ఆదేశాల మేరకు ప్రైవేట్‌ పాఠశాలల్లో యూనిఫాం, షూ, బుక్స్, స్టేషనరీ అమ్మకూడదు.


ఈ నిబంధన హైదరాబాద్ జిల్లా వ్యాప్తంగా నడుస్తున్న స్టేట్ సిలబస్ స్కూల్స్ తోపాటు CBSE, ICSE స్కూల్స్ కి కూడా వర్తిస్తుంది. ఈ స్కూల్స్ లో యూనిఫామ్స్, షూస్, బెల్ట్స్ అమ్మకూడదు. కోర్టు ఆదేశాల ప్రకారం.. స్కూల్స్ కౌంటర్‌లో పుస్తకాలు, నోట్ బుక్స్, స్టేషనరీ విక్రయాలు ఏవైనా ఉంటే అవి వాణిజ్యేతరంగా, లాభాపేక్ష లేకుండా అమ్మకాలు జరపాలని పేర్కొన్నారు.

అలాగే ప్రైవేట్ స్కూల్స్ ని క్రమం తప్పకుండా పర్యవేక్షించేందుకు మండల స్థాయి కమిటీని ఏర్పాటు చేయాలని రాష్ట్రంలోని అన్ని డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్లకు ఆదేశాలు జారీ చేశారు. పాఠశాలలో యూనిఫారాలు, షూ, బెల్ట్స్ మొదలైన వాటిని అమ్మకుండా చర్యలు తీసుకోవాలన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే వెంటనే తన దృష్టికి తీసుకురావాలని హైదరాబాద్‌ డీఈఓ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ ఉత్తర్వులతో పేరెంట్స్ పై కొండంత భారం దిగిందని చెప్పొచ్చు.

Read More
Next Story