రైతు రుణమాఫీ అసలు మెలిక ఇదేనా ?
లక్ష రూపాయల రుణమాఫీ అందుకున్న రైతుల సంఖ్య 36.68 లక్షలయితే ఇపుడు రు. 2 లక్షల రూపాయలవరకు రుణాలుమాఫీ అయిన రైతుల సంఖ్య 22.37 లక్షలే.
ప్రభుత్వమేమో రైతు రుణమాఫీ జరిగిపోయిందని చెబుతోంది. మూడో విడత రుణమాఫీ ఖమ్మం జిల్లా వైరాలో పూర్తిచేశామని చెప్పి పార్టీ సంబరాలు చేసుకుంటోంది. కాంగ్రెస్ పార్టీ అంటేనే ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండే పార్టీగా విపరీతంగా ఊదరగొడుతోంది. ఎన్నికల సమయంలో హామీ ఇచ్చినట్లు అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు రుణమాఫీ చేసేశామని రేవంత్ పదేపదే చెప్పుకుంటున్నారు. ఇదే సమయంలో బీఆర్ఎస్, బీజేపీలేమో రుణమాఫీ పేరుతో రైతులను ప్రభుత్వం మోసంచేసిందంటు నానా గోలచేస్తున్నాయి. రుణమాఫీ చేసింది కొంతవరకే అని రుణమాఫీ అందాల్సిన రైతులు లక్షల్లో ఉన్నారంటు బీఆర్ఎస్ అగ్రనేతలు కేటీఆర్, హరీష్ రావు కొన్ని లెక్కలను చూపిస్తున్నారు. రుణమాఫీ అందరి రైతుల కోసం రెండు ప్రధాన ప్రతిపక్షాలు హెల్ప్ లైన్ నెంబర్లను కూడా ఏర్పాటుచేశాయి. అయితే ఇక్కడే చిన్న మెలికుంది. ఆ మెలిక ఏమిటంటే ప్రతిపక్షాలేమో రైతులంటుంటే ప్రభుత్వమేమో రైతు కుటుంబాలంటున్నది.
రాజకీయంగా పార్టీల మధ్య గొడవలు ఎప్పుడూ ఉండేవే. అయితే రుణమాఫీకి సంబంధించి అసలు వాస్తవం ఏమిటి ? ప్రతిపక్షాల ఆరోపణలను బట్టిచూస్తే రుణమాఫీ సంపూర్ణం కాలేదని పైకి అనిపిస్తుంది. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ హామీ ఇచ్చినపుడు రైతు రుణమాఫీ ఎస్ఎల్బీసీ లెక్కల ప్రకారం రు. 49500 కోట్లుంది. దీన్ని అనేక లెక్కల ప్రకారం రు. 41 వేల కోట్లకు కాంగ్రెస్ పట్టుకొచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక నిబంధనలు, నియమాలు, ఫిల్టర్లు చేసిన తర్వాత రుణమాఫీ మొత్తం రు. 31 వేల కోట్లుగా క్యాబినెట్ లెక్కకట్టింది. ఈ మొత్తాన్ని మూడు విడతలుగా మాఫీ చేస్తామని రేవంత్ ప్రకటించారు. క్యాబినెట్ లెక్కప్రకారమే చేయాల్సిన రుణమాఫీ రు. 31 వేల కోట్లయితే బడ్జెట్లో కేటాయించింది మాత్రం రు. 26 వేల కోట్లే. అయితే చివరాఖరుకు మూడు విడతల్లో కలిపి మాఫీ అయిన రైతు రుణాలు రు. 17,933 కోట్లు. సుమారు రు. 18 వేల కోట్లు మాఫీ చేసిన ప్రభుత్వం మొత్తం రుణమాఫీ అయిపోయినట్లు ప్రకటించింది.
ప్రతిపక్షాల ఆరోపణలు, విమర్శలను పక్కనపెట్టేసినా ప్రభుత్వ లెక్కల ప్రకారమే రుణమాఫీ మొత్తంలో తేడా కనిపించటం సహజం. ఎస్ఎల్బీసీ లెక్కల ప్రకారం 2023 డిసెంబర్ 9 నాటికి రైతులు తీసుకున్న రుణాలు రు. 49,500 కోట్లు. రేవంత్ చెప్పింది 2023, డిసెంబర్ 9 వ తేదీకి రైతుకుటుంబాలు తీసుకున్న రుణాలన్నింటినీ ప్రభుత్వం మాఫీ చేస్తుందని. బ్యాంకుల నుండి ప్రభుత్వానికి అందిన లెక్కల ప్రకారమే మాఫీ అవ్వాల్సిన రుణాలు రు. 49,500 కోట్లు. అంటే రుణమాఫీ అవ్వాల్సింది రు. 49,500 కోట్లయితే అయ్యింది రు. 17,933 కోట్లు. మధ్యలో గ్యాప్ రు. 31,567 కోట్లుంది. మరీ మొత్తం ఎటుపోయింది ? ఇవేమీ కాకిలెక్కలో లేకపోతే ప్రతిపక్షాలు చెప్పే లెక్కలో కాదు స్వయంగా బ్యాంకులు ప్రభుత్వానికి ఇచ్చిన లెక్కలే.
సింపుల్ గా చెప్పాలంటే బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్ రావు లెక్క ప్రకారం తమహయాంలో లక్ష రూపాయల రుణమాఫీ అందుకున్న రైతుల సంఖ్య 36.68 లక్షలయితే ఇపుడు రు. 2 లక్షల రూపాయలవరకు రుణాలుమాఫీ అయిన రైతుల సంఖ్య 22.37 లక్షలే. రైతుల సంఖ్య భారీగా పెరగాల్సింది పోయి 14.31 లక్షల మంది రైతులు తగ్గటం ఏమిటి ? అనడుగుతున్నారు. కాంగ్రెస్ హామీ ఇచ్చినపుడు రుణమాఫీ లబ్ది అందుకునే రైతుల సంఖ్య సుమారు 60 లక్షలుగా హరీష్ తేల్చారు. ఆ తర్వాత రకరకాల లెక్కల ప్రకారం రైతులసంఖ్య 40 లక్షలకు దిగిపోయి ఇపుడు పైనల్ గా లబ్దిపొందిన రైతుల సంఖ్య 22.37 లక్షలు మాత్రమేనా అని నిలదీస్తున్నారు. విచిత్రం ఏమిటంటే రైతులసంఖ్య, రుణమాఫీ పెరగాల్సింది పోయి బాగా తగ్గిపోయిందని గోలచేస్తున్నారు.
స్వయంగా క్యాబినెట్ తేల్చిన లెక్కే రు. 31 వేల కోట్లయినపుడు ఇపుడు ఫైనల్ గా అయ్యింది రు. 17,933 కోట్లేనా అని నిలదీస్తున్నారు. హరీష్ కోణంలో చూస్తే క్యాబినెట్ లెక్కల ప్రకారమే సుమారు రు. 13 వేలకోట్లు ఎలా తగ్గిందన్నదే ఎవరికీ అర్ధంకావటంలేదు. అయితే బీఆర్ఎస్ హయాంలో అనర్హులకు కూడా రైతురుణమాఫీ జరిగిందనే ఆరోపణలున్నాయి. ఇందులో నిజముంది అనటంలో సందేహంలేదు. అందుకనే ప్రభుత్వంలో ఉన్నతాధికారులు, అత్యధిక ఆదాయం ఉన్న వ్యక్తులు, వర్తక, వ్యాపార, వృత్తి నిపుణులు, ప్రైవేటు సంస్ధల్లో అధిక జీతాలను అందుకుంటున్న వారందరినీ రుణమాఫీ లబ్దిదారుల నుండి రేవంత్ ప్రభుత్వం తీసేసింది. ఇలాంటి వాళ్ళకు కూడా బీఆర్ఎస్ హయాంలో రుణమాఫీ లబ్ది దొరికింది. రుణమాఫీకి రేవంత్ ప్రభుత్వం చాలా కఠినంగా నిబంధనలు పాటించింది కాబట్టి అనర్హుల సంఖ్య తగ్గిపోయిందని చెప్పటంలో తప్పులేదు. అలాంటి అనర్హల సంఖ్య మహాయితే ఒక 5 లేదా 6 లక్షలుంటుందేమో. ఎంతమంది అనర్హులని తీసేసినా రైతుల సంఖ్యతో పాటు అవ్వాల్సిన రుణమాఫీ మొత్తం పెరగుతుందే కాని తగ్గదు.
తుమ్మల వివరణ
2018-23 మధ్య కేసీఆర్ హయాంలో అప్పులు కూడా తమ ప్రభుత్వమే తీర్చుతోందన్నారు. ఎస్ఎల్బీసీ లెక్కల ప్రకారమే రుణాలు, రైతుకుటుంబాలసంఖ్య వివరాలు 2024, మే నెలలో తీసుకున్నామన్నిరు. 25 లక్షల రైతు కుటుంబాల్లో 42 లక్షల మంది రైతులకు రు. 32 వేల కోట్లు రుణాలున్నట్లుగా లెక్కలు తేలినట్లు చెప్పారు. ఇప్పటికి రు. 2 లక్షల వరకున్న రుణాలు మాఫీ అయిపోయాయన్నారు. 2 లక్షలకు పైగా రుణాలున్న రైతుకుటుంబాల సంఖ్య మరో 7 లక్షలుండవచ్చని చెప్పారు. తొందరలోనే ఎస్ఎల్బీసీ సమావేశం పెట్టి మిగిలిపోయిన రైతుకుటుంబాల వివరాలను సేకరించబోతున్నట్లు చెప్పారు. అలాగే గ్రామసభలు నిర్వహించి లెక్కలను పక్కాగా సరిచూసుకోబోతున్నట్లు తుమ్మల వివరించారు. రు. 2 లక్షలకు మించి రుణాలున్న రైతు కుటుంబాలు పై మొత్తాన్ని బ్యాంకులకు చెల్లించినట్లు తమకు సమాచారం రాగానే రు. 2 లక్షలను ప్రభుత్వం రైతుకుటంబాల ఖాతాలో జమచేస్తుందని చెప్పారు. ఒకింట్లో ముగ్గురు రైతులుంటే ప్రతిపక్షాలు ఒక్కొక్కరిని లెక్కేసి ముగ్గురు రైతులని అంటున్నాయని మంత్రన్నారు. ఇదే సమయంలో ముగ్గురు రైతులను కలిపి ప్రభుత్వం ఒక కుటుంబంగా లెక్కగట్టినట్లు వివరించారు. అందుకనే మొదటినుండి ప్రభుత్వం రైతుకుటుంబాల రుణాలను మాఫీ చేస్తామనే అంటోందన్న విషయాన్ని మంత్రి గుర్తుచేశారు.
ఉదాహరణకు ఒక రైతు కుటుంబానికి రు. 3 లక్షల రుణం ఉందని అనుకుందాం. ప్రభుత్వం చెప్పినట్లుగా 2 లక్షలకు పైన ఉన్న లక్ష రూపాయలను సదరు కుటుంబం బ్యాంకుకు చెల్లించగానే ప్రభుత్వం 2 లక్షల రూపాయలను వెంటనే బ్యాంకుకు చెల్లించేస్తుందని మంత్రి చెప్పారు. ఎస్ఎల్బీసీ ప్రకారమే మాఫీ చేయాల్సిన మొత్తం రు. 31 వేల కోట్లన్నారు. మాఫీ చేయాల్సిన మొత్తం ప్రభుత్వం దగ్గర సిద్ధంగా ఉందని కూడా తుమ్మల స్పష్టంచేశారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ప్రతిపక్షాలేమో రైతుల సంఖ్యను పదేపదే ప్రస్తావిస్తున్నాయి. ప్రభుత్వం ఏమో మొదటినుండి రైతు కుటుంబాలని చెబుతోంది. ఇక్కడే ప్రతిపక్షాలకు, ప్రభుత్వానికి మధ్య రైతుల సంఖ్యలో భారీ తేడా కనబడుతోంది. 2 లక్షల రూపాయలకు పైగా రుణాలున్న రైతుల సంఖ్య సుమారు 8 లక్షలు తాము చెల్లించాల్సిన మొత్తాన్ని చెల్లించేస్తే ప్రభుత్వం మిగిలిన రు. 13 వేల కోట్లను చెల్లించేస్తుందన్నారు. దాంతో రుణమాఫీ హామీ రు. 31 వేల కోట్లు సంపూర్ణమవుతుందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వివరించారు.