తెలంగాణలో లక్షల ఏళ్ల నాటి రాతి గొడ్డలి లభ్యం
తెలంగాణలో ఆది మానవులు వాటిన పురాతన రాతి గొడ్డలిని పరిశోధకులు గుర్తించారు. దీని వయస్సు తెలిసి శాస్త్రవేత్తలు ఆశ్చర్యపోయారు.
తెలంగాణలో ఆది మానవులు వాడిన రాతి గొడ్డలిని చారిత్రక ఔత్సాహిక పరిశోధకులు గుర్తించారు. దొరికిన రాతిగొడ్డలి వయస్సు దాదాపు 30 లక్షల సంవత్సరాలుగా తెలుస్తోంది. ములుగు జిల్లా కన్నాయి గూడేం మండంలోని గుర్రేవుల, భూపతిపురం గ్రామాల నడుమ మధ్య గల ఓ వాగులో ఔత్సాహిక పరిశోధకుడు ఏలేశ్వరం జనార్థన చారి దీనిని కనుగొన్నారు.
రాతి గొడ్డలి 15 సెంటీమీటర్ల పొడవు, 11 సెంటీమీటర్ల వెడల్పు, 5.5 సెంటీమీటర్ల మందంలో ఉంది. ఈ రాతి గొడ్డలిని పరిశీలించిన కొత్త తెలంగాణ చరిత్ర బృందం కన్వీనర్ శ్రీ రామోజు హరగోపాల్.. గొడ్డలి పాతరాతి యుగానికి చెందినగా అభిప్రాయపడ్డారు.
ఇది ద్విపార్శ్వముఖ, ద్వికుంభాకారపు చేతిగొడ్డలని, పురాతన మానవులు ఎక్కువగా ఉపయోగించేవారని పేర్కొన్నారు. ఈ రాతి గొడ్డలి పాతరాతియుగం తొలిదశకు చెందినదని, దీని వయస్సు 30 లక్షల సంవత్సరాలని కర్నాటకకు చెందిన అంతర్జాతీయ ప్రాక్చరిత్రకారుడు రవి కొరిసెట్టర్ అభిప్రాయం వ్యక్తం చేశారు.
ప్రాచీన శిలాయుగాన్ని పేలియోలిథిక్ యుగం (Paleolithic Age) లేదా పాత రాతి యుగం (Old Stone Age) లేదా తొలి రాతి యుగం (Early Stone Age) అని కూడా వ్యవహరిస్తారు. ఇది సుమారు 33 లక్షల సంవత్సరాల కాలం నుంచి క్రీ.పూ. 10,000 సంవత్సరాల వరకూ కొనసాగింది.
పూర్వ ప్రాచీన శిలాయుగ సంస్కృతి - లక్షణాలు
ఈ దశకు చెందిన ఆదిమజాతి మానవులు క్వార్జైట్ (Quartzite)తో తయారు చేసిన గులకరాతి (Pebbles) పనిముట్లను వాడుతూ, వేటాడుతూ ఆహార అన్వేషణ చేసేవారు. ఈ కాలంలో మానవుడు జంతువుల మాంసాన్ని చీల్చడానికి సుత్తి రాళ్లను ఎక్కువగా వాడేవాడు. అలాగే చేతి గొడ్డళ్లు లాంటి పనిముట్లను తయారు చేసేవాడు.
ఈ పరికరాలను ఆస్ట్రలోపితికన్లు (australopithecines), హోమో హబిల్లిస్ (Homo habilis) తరువాతి కాలంలో హోమో ఎరక్టస్ (Homo erectus) జాతులకు చెందిన ఆదిమ మానవులు ఉపయోగించి ఉంటారని భావిస్తున్నారు. పూర్వ ప్రాచీన శిలాయుగానికి చెందిన మానవ నివాస స్థానాలన్నీ ప్రధానంగా నదీ తీరాలు, వాగుల ఓడ్డునే ఉన్నాయి.
పూర్వ ప్రాచీన శిలాయుగానికి చెందిన భారతీయ సంస్కృతులలో మద్రాసి సంస్కృతి కి చెందినది ఈ రాతిగొడ్డలి. దక్షిణ భారత దేశంలో మద్రాస్ (నేటి చెన్నై నగరం) సమీపంలోని అత్తిరాంపక్కం (Attirampakkam) వద్ద ఆదిమ మానవులు రాతితో తయారుచేసి ఉపయోగించిన ద్విముఖ చేతి గొడ్డళ్ళు లభ్యమైనాయి. ఇవి సుమారు 15 లక్షల సంవత్సరాల కాలం నాటివి. ప్రాచీన శిలాయుగపు సంస్కృతిని మద్రాస్ చేతి గొడ్డళ్ళ పరిశ్రమ (Madras Hand- Axe Industry) లేదా మద్రాసి సంస్కృతి (Madrasian Culture) గా పరిగణిస్తారు.
క్షేత్ర పరిశోధన: ఏలేశ్వరం జనార్ధనాచారి, 8332868708, యూట్యూబర్, ఔత్సాహిక పరిశోధకుడు
చారిత్రక సమాచారం: శ్రీరామోజు హరగోపాల్, 9949498698, కన్వీనర్, కొత్త తెలంగాణ చరిత్రబృందం