
ట్యాపింగ్ విచారణలో ట్విస్ట్ ‘వన్ ఆన్ వన్’ మైండ్ గేమ్
మొదటి సిట్ విచారణకు భిన్నంగా రెండో సిట్ బృందం ‘వన్ ఆన్ వన్’ పద్దతిలో విచారణ మొదలుపెట్టింది.
టెలిఫోన్ ట్యాపింగ్ లో కీలకపాత్రధారి, ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ టీ ప్రభాకరరావు విచారణలో సిట్ కొత్త విధానం మొదలుపెట్టింది. హైదరాబాద్ పోలీసు కమిషనర్ వీసీ సజ్జనార్(Hyderabad CP VC Sajjanar) నేతృత్వంలో తొమ్మిది మంది అధికారులతో ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి(Revanth) ప్రభుత్వం రెండో సిట్ ను ఏర్పాటుచేసిన విషయం తెలిసిందే. 2023లో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ప్రభుత్వం ట్యాపింగ్(Telephone Tapping) విచారణకు నియమించిన మొదటి సిట్ అధికారులు విచారణలో పెద్దగా పురోగతిని చూపించలేకపోయారు. అందుకనే తాజాగా ప్రభుత్వం రెండో సిట్ ను ఏర్పాటుచేసింది. నిందితుడిని సుప్రింకోర్టు అనుమతితో రెండో సిట్ శనివారం నుండి రెండోసారి కస్టడీ విచారణ మొదలుపెట్టిన విషయం అందరికీ తెలిసిందే.
మొదటి సిట్ విచారణకు భిన్నంగా రెండో సిట్ బృందం ‘వన్ ఆన్ వన్’ పద్దతిలో విచారణ మొదలుపెట్టింది. ప్రభాకరరావు ట్యాపింగ్ కేసులో కీలక పాత్రధారి అయితే నలుగురు పోలీసు అధికారులు డీసీపీ రాధాకిషన్ రావు, అడిషినల్ ఏసీపీలు తిరుపతయ్య, భుజంగరావు, డీఎస్పీ ప్రణీత్ రావు చురుకైన పాత్రని పోషించారు. వీళ్ళ నలుగురు ఆధ్వర్యంలోనే కేసీఆర్ ప్రభుత్వం వేలాది ఫోన్లను ట్యాప్ చేయించింది. నలుగురు పోలీసు అధికారులను మొదటి సిట్ అరెస్టుచేసి విచారించినపుడు తమదగ్గరున్న సమాచారం మొత్తం చెప్పేశారు. వాళ్ళు చెప్పిన సమాచారాన్ని విచారణలో ప్రభాకరరావు అంగీకరించాలంతే. ట్యాపింగ్ వ్యవహరంలో పాత్రధారులు, కీలక పాత్రధారి ఎవరో తెలిసింది కాని అసలు సూత్రధారి ఎవరన్నది ప్రభాకరరావు నోటిద్వారానే బయటకు రావాలి. అప్పుడే కేసు లాజికల్ ఎండ్ కు వస్తుంది.
ఆ విషయాన్ని ప్రభాకరరావుతో చెప్పించండంలోనే మొదటి సిట్ అధికారులు ఫెయిలయ్యారు. అందుకనే రెండో సిట్ ను రేవంత్ ప్రభుత్వం నియమించింది. సరే, ఇపుడు రెండో సిట్ ఏమిచేస్తోందంటే ప్రభాకరరావుతో పాటు ప్రణీత్ రావును కూడా విచారణకు తీసుకొచ్చింది. శనివారం 9 గంటలు విచారణ జరిగింది. ఆదివారం ఉదయం నుండి మళ్ళీ విచారణ మొదలైంది. ఇద్దరినీ ఇంటరాగేషన్ గదిలో టేబుల్ కు రెండువైపులా ఎదురెదురుగా కూర్చోబెట్టారు. విచారణలో తమకు చెప్పిన విషయాలనే ప్రభాకరరావు సమక్షంలో చెప్పమని ప్రణీత్ రావును అధికారులు అడుగుతున్నారు. ప్రణీత్ రావు ఇప్పటికే అన్నీ విషయాలను ఆధారాలతో సహా చెప్పాడు కాబట్టి ఇపుడిక మాట మార్చేందుకు లేదు. విచారణలో అధికారులకు చెప్పిన విషయాలను ప్రణీత్ కోర్టుకు అఫిడవిట్ రూపంలో కూడా అందించాడు. కాబట్టి ట్యాపింగ్ వ్యవహారంలో ప్రభాకరరావు పాత్ర ఏమిటో ఆయన సమక్షంలోనే మళ్ళీ బయటపెట్టాలి. ప్రణీత్ రావు చెప్పిన విషయాలపై సిట్ అధికారులు ప్రభాకరరావును ప్రశ్నిస్తున్నారు.
ప్రణీత్ రావు చెప్పిన ట్యాపింగ్ వివరాలను ప్రభాకరావు అంగీకరించాలి లేదా తప్పని చెప్పాలి. ప్రణీత్ రావు చెప్పిన విషయాలు తప్పని ప్రభాకరరావు అంటే ప్రణీత్ అంగీకరించడు. అలాగని ప్రణీత్ చెప్పిందంతా నిజమే అని అంగీకరిస్తే ట్యాపింగ్ ఆదేశాలను తనకు ఎవరిచ్చారో వాళ్ళ పేర్లను బయటపెట్టాలి. ఒకవిధంగా సిట్ అధికారులు ప్రభాకరరావుపైన మైండ్ గేమ్ మొదలుపెట్టారనే అనుకోవాలి. ఇపుడు వన్ ఆన్ వన్ లో ప్రభాకరరావు ముందు ప్రణీత్ రాను కూర్చోబెట్టినట్లే రాధాకిషన్ రావు, తిరుపతయ్య, భుజంగరావును కూడా కూర్చోబెట్టి విచారించే అవకాశాలున్నాయి.
రెండో సిట్ మొదలుపెట్టిన వన్ ఆన్ వన్ మైండ్ గేమ్ వర్కవుటవుతుందనే ఆశాభావంతో సిట్ అధికారులున్నారు. అయితే ప్రభాకరరావును తక్కువ అంచనా వేసేందుకు లేదు. ఎందుకంటే దాదాపు 35 ఏళ్ళు ఐపీఎస్ అధికారిగా వివిధ హోదాల్లో పనిచేశాడు. విచారణలో పోలీసు ట్రిక్కులు, మైండ్ గేమ్ నిందితుడికి తెలీకుండా ఉండదు. సుప్రింకోర్టు రక్షణ ఉన్నంతవరకు ప్రభాకరరావు రెండో సిట్ కు ఈ ఆరురోజుల్లో ఏ మేరకు సహకరిస్తాడో చూడాల్సిందే.

