వరంగల్ లో డబుల్ మర్డర్... రెచ్చిపోయిన ప్రేమోన్మాది
x

వరంగల్ లో డబుల్ మర్డర్... రెచ్చిపోయిన ప్రేమోన్మాది

వరంగల్ లో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. ఓ ప్రేమోన్మాది అతికిరాతకంగా ప్రవర్తించాడు.


వరంగల్ లో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. ఓ ప్రేమోన్మాది అతికిరాతకంగా ప్రవర్తించాడు. నిద్రిస్తున్న కుటుంబంపై కత్తితో దాడికి తెగబడ్డాడు. రెండు నిండు ప్రాణాలను బలి తీసుకున్నాడు. ప్రస్తుతం ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపుతోంది.

వరంగల్ జిల్లా చెన్నరావుపేట మండలం 16 చింతల తండాలో అర్ధరాత్రి దారుణం జరిగింది. ప్రేయసిని తనకి దూరం చేశారన్న కోపంతో ఓ యువకుడు అర్ధరాత్రి ప్రియురాలి కుటుంబం పై కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు. ఈ దాడిలో ప్రియురాలి తల్లి సుగుణ అక్కడికక్కడే మృతి చెందగా.. తండ్రి బానోతు శ్రీను చికిత్స పొందుతూ మృతి చెందాడు. ప్రియురాలికి, ప్రియురాలు తమ్ముడికి తీవ్ర గాయాలు అయ్యాయి. స్థానికుల సమాచారంతో పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు.

పోలీసుల కథనం ప్రకారం.. మేకల నాగరాజు అలియాస్ బన్నీ, చింతల తండాకు చెందిన యువతి ప్రేమించుకున్నారు. యువతి ఇంట్లో వీరి ప్రేమని అంగీకరించకపోవడంతో ఇద్దరూ కలిసి ఇంటినుంచి పారిపోయి పెళ్లి చేసుకున్నారు. పెళ్లైన రెండు నెలలకే ఇద్దరి మధ్యా మనస్పర్ధలు తలెత్తడంతో పోలీసులు, పెద్దల సమక్షంలో విడిపోయారు. ప్రేమించిన యువతిని తనకు దూరం చేశారనే కోపంతో నిందితుడు బుధవారం అర్ధరాత్రి కత్తితో ఇంటి బయట నిద్రలో ఉన్న ఆమె కుటుంబ సభ్యులపై దాడికి తెగబడ్డాడు. బాధితుల అరుపులు కేకలు విని చుట్టుపక్కలవారు అక్కడికి చేరుకున్నారు. పోలీసులకు సమాచారం ఇచ్చారు. అయితే అప్పటికే యువతి తల్లి మరణించగా, తండ్రి కొనఊపిరితో ఉన్నాడు. యువతికి, ఆమె సోదరుడికి గాయాలయ్యాయి. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తండ్రి మరణించాడు. దీంతో వారి కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. కుటుంబసభ్యులు బోరున విలపిస్తున్నారు.

Read More
Next Story