Anti Corruption Bureau | తెలంగాణలో ఏసీబీ దూకుడు, వరుస ట్రాప్ కేసులు
x

Anti Corruption Bureau | తెలంగాణలో ఏసీబీ దూకుడు, వరుస ట్రాప్ కేసులు

తెలంగాణలో అవినీతి నిరోధక శాఖ దూకుడు పెంచింది.ప్రభుత్వ కార్యాలయాల్లో అక్రమాలను అరికట్టేందుకు ఏసీబీ చేస్తున్న దాడులను ముమ్మరం చేసింది.17 కేసులు పెట్టింది.


తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ కార్యాలయాల్లో పెరిగిపోతున్న అవినీతి, అక్రమాలకు కళ్లెం వేసేందుకు అవినీతి నిరోధక శాఖ దూకుడు పెంచింది. ఈ ఏడాది 39 రోజుల్లోనే 17 మంది అవినీతి అధికారులను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని వారిపై కేసులు నమోదు చేసింది. ప్రజల నుంచి లంచం తీసుకుంటుండగా 17 మంది అధికారులు రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీ వలలో చిక్కారు. రవాణ శాఖలో అవినీతి తిమింగలం అయిన వరంగల్ డీటీసీ శ్రీనివాస్ పై సంపాదనకు మించిన ఆస్తులున్నాయని ఏసీబీ తనిఖీల్లో తేలడంతో అతనిపై కేసు పెట్టి అరెస్టు చేశారు.


వరంగల్ డీటీసీ అక్రమాస్తులు...
వరంగల్ డిప్యూటీ ట్రాన్స్ పోర్ట్ ఆఫీసర్ పుప్పాల శ్రీనివాస్ అక్రమార్జనకు పాల్పడి సంపాదనకు మించిన ఆస్తులున్నాయని అతనిపై తెలంగాణ అవినీతి నిరోధక శాఖ(ACB) అధికారులు తాజాగా డాడుదలు చేశారు. ఏసీబీ అధికారులు శుక్రవారం హైదరాబాద్, కరీంనగర్, జగిత్యాలలో శ్రీనివాస్, అతని బంధువుల ఇళ్లపై ఆకస్మిక దాడులు చేశారు.కరీంనగర్ డీఎస్పీ రమణమూర్తి నేతృత్వంలోని ఏసీబీ అధికారులు జగిత్యాల పట్టణంలోని డీటీసీ బంధువుల ఇళ్లట్లో సోదాలు నిర్వహించారు.



ఆస్తులు చూసి నివ్వెర పోయిన ఏసీబీ అధికారులు

డీటీసీ ఆస్తులు చూసిన ఏసీబీ అధికారులు నివ్వెర పోయారు. అయిదు ప్రాంతాల్లో రవాణశాఖ డీటీసీపై జరిపిన సోదాల్లో మూడు ఇళ్లు, 16 ఇళ్ల స్థలాలు, 15.2 ఎకరాల వ్యవసాయ భూములు, అయిదు కార్లు, బంగారం, వెండితోపాట 4,04,78,767 కోట్ల ఆస్తులను ఏసీబీ గుర్తించింది. డీటీసీ వద్ద రూ.5.29 లక్షల విలువైన విదేశీ మద్యం బాటిళ్లు కూడా లభించాయి. డీటీసీ శ్రీనివాస్ పై కేసు నమోదు చేసి, అరెస్ట్ చేశామని ఏసీబీ తెలిపింది.



లక్ష రూపాయల లంచం తీసుకున్న ఉద్యోగి

హైదరాబాద్‌ నగర పరిధిలోని ఖైరతాబాద్‌లోని తెలంగాణ వెనుకబడిన తరగతుల కమిషన్ ఛైర్మన్ కార్యాలయంలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగి గొల్ల శ్రీనివాస్, ఫిర్యాదుదారుడి కుల సంబంధిత ఫైల్‌ను ప్రాసెస్ చేయడానికి మొదటి విడతగా ఫిర్యాదుదారుడి నుంచి లక్ష రూపాయల లంచం డిమాండ్ చేసి స్వీకరించినందుకు తెలంగాణ ఏసీబీ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది.

అవినీతి ఎస్ఐ...
కామారెడ్డి జిల్లా లింగంపేట పోలీస్ స్టేషన్ సబ్-ఇన్ స్పెక్టర్ ఆఫ్ పోలీస్ కంది సుధాకర్ లింగంపేట పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులో తన పేరును నిందితుడిగా ఇరికించకూడదని ఫిర్యాదుదారుడి నుంచి రూ.12,500 ల లంచం డిమాండ్ చేసి స్వీకరించినందుకు ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.



సర్టిఫికెట్ జారీకి లంచం డిమాండ్

ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలం శ్యామ్‌పూర్‌లోని వెటర్నరీ హాస్పిటల్‌లోని అసిస్టెంట్ వెటర్నరీ సర్జన్ డాక్టర్ రాథోడ్ రమేష్ అదే ఆసుపత్రిలో వెటర్నరీ అసిస్టెంట్‌గా ఉన్న ఫిర్యాదుదారుడి తండ్రి జీతానికి సంబంధించి అక్టోబర్, నవంబర్ -2023 నెలలకు నాన్-పేమెంట్ సర్టిఫికెట్‌లను జారీ చేయడానికి ఫిర్యాదుదారుడి నుంచి రూ.15వేలు లంచం డిమాండ్ చేసి స్వీకరిస్తూ రెడ్ హ్యాండెడ్ గా దొరికాడు.

ఎస్.ఐ, కానిస్టేబుల్ లంచం తీసుకుంటూ...

బీఎన్ఎస్ఎస్ చట్టం 35 సెక్షన్‌ కింద అరెస్ట్‌కి నోటీసు జారీ చేయడం కోసం ఫిర్యాదుదారుడి నుంచి మొదటగా రూ.1.4 లక్షల లంచం డిమాండ్ చేసి స్వీకరించినందుకు సబ్-ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ వి.సురేష్, సూర్యాపేట జిల్లా తిరుమలగిరి పోలీస్ స్టేషన్‌లోని పోలీస్ కానిస్టేబుల్ నాగరాజును తెలంగాణ ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.

223 మంది అక్రమార్కులపై ఏసీబీ కేసులు
2024వ సంవత్సరంలో తెలంగాణ ఏసీబీ అధికారులు 152 కేసులు నమోదు చేసి, 223 మంది అక్రమార్కులను అరెస్ట్ చేశారు. ఇందులో 129 ట్రాప్ కేసుల్లో 200 మందిని ఏసీబీ రెడ్ హ్యాండెడ్ గా లంచం తీసుకుంటుండగా పట్టుకుంది. ఇందులో 159 మంది ప్రభుత్వ ఉద్యోగులున్నారు.ఏసీబీ అధికారులు రూ.82.78 లక్షల అవినీతి సొమ్మును సీజ్ చేశారు. 11మంది ప్రభుత్వ అధికారులు అక్రమ వసూళ్ల ద్వారా సంపాదనకు మించిన ఆస్తులు కూడబెట్టారని ఏసీబీ ఆకస్మిక దాడుల్లో తేలింది. 11 కేసుల్లో ఏసీబీ అధికారులు విచారణ జరిపారు. 105 మంది అవినీతి అధికారులపై ఏసీబీ అధికారులు చార్జిషీట్లు సమర్పించారు. అక్రమార్కుల్లో 29 మంది పోలీసు అధికారులున్నారు.

లంచం అడిగితే 1064కు డయల్ చేయండి
లంచం అడిగితే 1064కు డయల్ చేయండి అంటూ అవినీతి నిరోధక శాఖ డైరెక్టర్ జనరల్ ప్రజలకు సూచించారు. హైదరాబాద్ కేంద్రంగా, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నల్గొండ, మహబూబ్ నగర్, రంగారెడ్డి, నిజామాబాద్ ప్రాంతీయ కార్యాలయాలతో ఏసీబీ అవినీతి నిరోధానికి పనిచేస్తుంది. అవినీతిని నివేదించడానికి 1064కు డయల్ చేయండి అంటూ ఏసీబీ పిలుపునిచ్చింది.


Read More
Next Story