
అంబేద్కర్ అవినీతి అంతా ఇంతా కాదు.. అరెస్ట్ చేసిన ఏసీబీ
అక్రమ ఆస్తుల విలువ రూ.300 కోట్లకు పైనే..
విద్యుత్ శాఖ ఏడీఈ అధికారి అంబేద్కర్‌ను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్న నేపథ్యంలోనే ఆయనను అరెస్ట్ చేశారు. వైద్య పరీక్షల అనంతరం ఆయనను కోర్టులో హాజరుపరచనున్నారు. ఆయన అవినీతి గురించి సమాచారం అందడంతో ఏసీబీ రంగంలోకి దిగింది. మంగళవారం ఉదయం నుంచి అంబేద్కర్, ఆయన కుటుంబీకులు, బంధువులు, బినాబీలు అని అనుమానం ఉన్న వ్యక్తుల ఇళ్లు, కార్యాలయాల్లో ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు. పలు బృందాలుగా విడిపోయి ఏసీబీ ఏకకాలంలో సోదాలు చేసింది. ఈ సోదాల్లో విస్తుబోయే నిజాలు వెలుగు చూశాయి. అంబేద్కర్ బినామి అయిన సతీస్ అనే వ్యక్తి ఇంట్లో రూ.2 కోట్ల విలువైన నగదు లభించింది. పలు డాక్యుమెంట్లు, నగదును ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకుని పరిశీలిస్తున్నారు. ఈ క్రమంలోనే అంబేద్కర్ ఆస్తుల చిట్టా చూసి అధికారులు కూడా అవాక్కవుతున్నారు.
విద్యుశాఖ ఏడీఈ సంపాదన ఈ రేంజ్‌లో ఉందేంటని నోరెళ్లబెడుతున్నారు. ఇబ్రహీంబాగ్‌లో ఏడీఈగా పనిచేస్తున్న ఆయన.. భారీగా ఆస్తులు కూడబెట్టారు. శేరిలింగపంల్లిలో ఇళ్లు, గచ్చిబౌలిలో 5 అంతస్తుల భవనం, హైదరాబాద్‌లోని ప్రధాన ప్రాంతాల్లో 6 ఇళ్లు, ఓపెన్ ప్లాట్లు, రెండు కార్లు, బంగారు ఆభరణాలు, బ్యాంకు డిపాజిట్లు, వ్యవసాయ భూమి ఉన్నట్టు అధికారులు గుర్తించారు. ఇప్పటి వరకు ఏసీబీ సోదాల్లో లభించిన మొత్తం అక్రమ ఆస్తుల విలువ రూ.300 కోట్లు ఉన్నట్లు తెలిపారు. ఆయన నివాసంలో ఇంకా సోదాలు జరుగుతున్నట్లు అధికారులు చెప్పారు.

