
కాళేశ్వరం మాజీ ఈఎన్సీ మురళీధర రావు అరెస్టు
కేసీఆర్ పదేళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నపుడు ఇరిగేషన్ శాఖలో చక్రంతిప్పినట్లు అనేక ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.
అవినీతి నిరోధక శాఖ అధికారులు మురళీధర రావును అరెస్టుచేయటం సంచలనంగా మారింది. మరళి ఎవరంటే ఇరిగేషన్ శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్ గా పనిచేసి రిటైర్ అయ్యారు. కేసీఆర్ పదేళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నపుడు ఇరిగేషన్ శాఖలో చక్రంతిప్పినట్లు అనేక ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. కాళేశ్వరం, మేడిగడ్డ అవినీతి, అవకతవకల్లో కూడా మురళీది కీలకపాత్రగా ప్రభుత్వం అనుమానిస్తొంది. ఇదే విషయమై విజిలెన్స్ ఎన్ఫోర్స్ మెంట్ అనేకమందిపై కేసులు నమోదుచేసిన విషయం తెలిసిందే. విజిలెన్స్ శాఖ క్రిమినల్ చర్యలకు సిఫారసుచేసిన 17 మందిలో మురళీధరరరావు కూడా ఒకరు.
బంజారాహిల్స్ లోని ఆయన ఇంటిపై మంగళవారం ఉదయం ఏసీబీ అధికారులు దాడులు చేసి అదపులోకి తీసుకున్నారు. ఆదాయానికి మించిన ఆస్తులున్నాయన్న ఫిర్యాదుతో ఏసీబీ మొదటి విచారణ జరిపింది. తమకు అందిన ఫిర్యాదు నిజమే అని నిర్ధారణ చేసుకున్న తర్వాత అన్నీ ఆధారాలతో ఇంటిపై దాడిచేసి అదుపులోకి తీసుకున్నారు. కేసీఆర్ కు మురళి అత్యంత సన్నిహిత ఉన్నతాధికారుల్లో ఒకరుగా బాగా ప్రచారంలో ఉంది. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ముందు మురళి కాళేశ్వరం, మేడిడ్డ అవినీతి, అవకతవకలపై విచారణకు హాజరయ్యారు. హైదరాబాద్ తో పాటు జహీరాబాద్ తదితర ప్రాంతాల్లో మురళి భారీగా ఆస్తులు కూడగట్టినట్లు ఏసీబీకి ఫిర్యాదులు అందాయి.
మురళీధరరావు కొడుకు అభిషేక్ రావు ఇంటితో పాటు హర్ష కన్ స్ట్రక్షన్స్ కంపెనీ ఆఫీసులో కూడా ఏసీబీ సోదాలు చేస్తోంది. కాళేశ్వరం నిధులను కొడుకు అభిషేక్ రావు కంపెనీకి అక్రమంగా మళ్ళించినట్లు ఆరోపణలున్నాయి. కొందరు మిత్రులతో కలిసి కొడుకు హర్ష్ పేరుతో కన్ స్ట్రక్షన్స్ కంపెనీని నిర్వహిస్తున్నారు. జహీరాబాద్, హైదరాబాద్, కరీంనగర్ లాంటి పదిచోట్ల ఏసీబీ ఉన్నతాధికారులు ఏకకాలంలో సోదాలు చేస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో కీలకంగ వ్యవహరించిన మురళి ప్రాజెక్టు పరిధిలోనే చాలాచోట్ల భూములు కొన్నట్లు ఆరోపణలున్నాయి.