డిప్యూటీ కమిషనర్ కిషన్ నాయక్ ఆస్తుల విలువెంతో తెలుసా?
x

డిప్యూటీ కమిషనర్ కిషన్ నాయక్ ఆస్తుల విలువెంతో తెలుసా?

కిషన్ నాయక్ ఇంట్లో ఆదాయానికి మించిన ఆస్తులను కనుగొన్న ఏసీబీ.


మహబూబ్‌నగర్ రవాణా శాఖ డిప్యూటీ కమిషనర్ (డీటీసీ) కిషన్ నాయక్‌ను అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) మంగళవారం అరెస్ట్ చేసింది. అక్రమంగా ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణలపై హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో ఏసీబీ అధికారులు విస్తృతంగా సోదాలు నిర్వహించారు.

ఈ తనిఖీల్లో నిజాంపేట మండలంలో ఉన్న 31 ఎకరాల సాగుభూమిని అధికారులు గుర్తించారు. ఆ భూమిలో డ్రాగన్ ఫ్రూట్ తోటలు సాగు చేస్తున్నట్లు, అలాగే ఒక పాలీ హౌజ్ నిర్మాణంలో ఉన్నట్లు వెల్లడించారు. అదేవిధంగా నిజామాబాద్ పట్టణంలో ఉన్న 10 ఎకరాల వాణిజ్య భూమి, అక్కడే ఉన్న ఒక అపార్ట్‌మెంట్‌, అలాగే 50 శాతం భాగస్వామ్యం ఉన్న అంతర్జాతీయ హోటల్ భవనం కూడా కిషన్ నాయక్‌కు చెందిన ఆస్తులుగా ఏసీబీ అధికారులు గుర్తించారు.

ఇవే కాకుండా, కిషన్ నాయక్‌కు చెందిన రూ.1.30 కోట్ల బ్యాంకు నిల్వలు, అలాగే ఒక కిలో బంగారం లభించినట్లు హైదరాబాద్ నగర ఏసీబీ డీఎస్పీ శ్రీధర్ తెలిపారు. డాక్యుమెంట్ల ప్రకారం ఈ ఆస్తుల విలువ సుమారు రూ.12.50 కోట్లుగా ఉన్నప్పటికీ, బహిరంగ మార్కెట్‌లో వాటి విలువ నాలుగు నుంచి ఐదు రెట్లు అధికంగా ఉండే అవకాశముందని ఆయన పేర్కొన్నారు.

కిషన్ నాయక్ గతంలో మేడ్చల్‌, హైదరాబాద్ ప్రాంతాల్లో రవాణా శాఖ అధికారిగా విధులు నిర్వహించినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. అరెస్ట్ అనంతరం ఆయనను కోర్టులో హాజరుపర్చి, రిమాండ్‌కు తరలించినట్లు డీఎస్పీ శ్రీధర్ వెల్లడించారు. ఈ వ్యవహారంపై మరింత దర్యాప్తు కొనసాగుతోందని ఏసీబీ అధికారులు తెలిపారు.

Read More
Next Story