
KTR and FEO|కేటీఆర్ కోరికతీర్చిన ఏసీబీ
నోటీసు అందిన వారంరోజుల్లోగా విచారణకు హాజరవ్వాలని ఏసీబీ(ACB Inquiry) అధికారులు ఎఫ్ఈవో కంపెనీ సీఈవోకు శనివారం నోటీసులు జారీచేశారు
మొత్తానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఫార్ములా ఈ కార్ రేసు కేసులో ఏ1 నిందితుడైన కేటీఆర్ కోరికను ఏసీబీ తీర్చేసింది. ఇంతకీ ఆ కోరిక ఏమిటంటే ఎప్ఈవో(FEO) కంపెనీ సీఈవోను విచారణకు హాజరవ్వాలని నోటీసులు జారీచేయటం. నోటీసు అందిన వారంరోజుల్లోగా విచారణకు హాజరవ్వాలని ఏసీబీ(ACB Inquiry) అధికారులు ఎఫ్ఈవో కంపెనీ సీఈవోకు శనివారం నోటీసులు జారీచేశారు. బ్రిటన్లో ఉన్నకంపెనీ సీఈవోకు ఏసీబీ నోటీసులు అందినట్లు కంపెనీ ప్రతినిధులు కన్ఫర్మ్ చేశారు. అయితే బ్రిటన్ నుండి రావాల్సిన కారణంగా వారంరోజుల్లో విచారణకు సీఈవో హాజరుకాలేరు కాబట్టి నాలుగువారాల గడువు కోరారు. కంపెనీ ప్రతినిధుల రిక్వెస్టుకు సానుకూలంగా స్పందించిన ఏసీబీ నాలుగువారాల గడువిచ్చింది.
ఇక్కడ విషయం ఏమిటంటే ఫార్ములా కార్ కేసు(Formula E car case)లో ఏసీబీ అధికారులు కేటీఆర్ కు నోటీసులు జారీచేయటం, విచారించటం అందరికీ తెలిసిందే. ఏసీబీ విచారణకు రావాలని నోటీసులు జారీచేయగానే కేటీఆర్(KTR) స్పందించి నిధులు అందుకున్న ఎఫ్ఈవో కంపెనీని ఎందుకు విచారించటంలేదని చాలాసార్లు అడిగారు. నిధులు అందుకున్న ఎఫ్ఈవో కంపెనీకి కూడా నోటీసులు జారీచేయాలని కేటీఆర్ పదేపదే డిమాండ్ చేశారు. ఎఫ్ఈవో కంపెనీకి నోటీసులు ఇవ్వాలని కేటీఆర్ ఎందుకు అడిగారో, ఎందుకు డిమాండ్ చేశారో తనకే తెలియాలి. సరే కేటీఆర్ ఉద్దేశ్యం ఏదైనా తన డిమాండును దృష్టిలో పెట్టుకున్న ఏసీబీ తాజాగా ఎఫ్ఈవో కంపెనీ సీఈవోకు కూడా నోటీసులు జారీచేయటంద్వారా కేటీఆర్ కోరికను తీర్చినట్లయ్యింది.
తనకు నోటీసులు అందకుముందే కాకుండా అందిన తర్వాత కూడా ఫార్ములా కేసు లొట్టపీసు కేసని కేటీఆర్ చాలా తక్కువచేసి మాట్లాడారు. ఏసీబీ విచారణ తర్వాత అధికారులను నోటికొచ్చినట్లు మాట్లాడారు. ఇదేకేసులో విచారించిన ఈడీ(ED Inquiry) అధికారుల విషయంలోమాత్రం నోరుపారేసుకోకుండా కేటీఆర్ చాలా జాగ్రత్తగా వ్యవహరించారు. ఫార్ములా వ్యవహారంలో అసలు అవినీతే జరగలేదని, నిధులు ఎఫ్ఈవో కంపెనీ దగ్గరే ఉన్నాయని చాలాసార్లు మాట్లాడారు. అయితే విషయం ఏమిటంటే నిబంధనలకు వ్యతిరేకంగా హెచ్ఎండీఏ నుండి పంపిన రు. 46 కోట్లు ఎఫ్ఈవో కంపెనీ ఖాతాలోనే ఉన్నాయని ఇపుడు కేటీఆర్ ఎలా చెప్పగలుగుతున్నారు ? 46 కోట్ల రూపాయలు చేరింది ఎఫ్ఈవో కంపెనీకే అన్న విషయం అందరికీ తెలుసు. దాదాపు ఏడాదిక్రితం ఖాతాలో పడిన రు. 46 కోట్లను ఎఫ్ఈవో కంపెనీ ఇంకా అలాగే ఉంచుకుంటుందా ? రు. 46 కోట్లు ఎఫ్ఈవో కంపెనీ ఖాతాలోనే ఉందని కేటీఆర్ చెప్పటమే ఆశ్చర్యంగా ఉంది.
కేటీఆర్ చెబుతున్నట్లుగా అవినీతి జరగలేదని మాటవరసకు అనుకున్నా నిధులు బదిలీలో నిబంధనల ఉల్లంఘన జరిగిందన్నది వాస్తవమే కదా. ఫార్ములా వ్యవహారంలో అసలు పాత్రేలేని హెచ్ఎండీఏ ఖాతానుండి రు. 46 కోట్లను బదిలీచేయటం, ఆర్ధికశాఖ అనుమతి తీసుకోకపోవటం, క్యాబినెట్ ఆమోదంలేకుండానే నిధుల బదిలీచేసేయటం అంతా నిబంధనలఉల్లంఘనే. నిబంధనల ఉల్లంఘన జరిగింది అనటానికి ఆధారం ఏమిటంటే విదేశీకంపెనీకి విదేశీకరెన్సీలో హెచ్ఎండీఏ నిధులు బదిలీచేసిన కారణంగా రిజర్వ్ బ్యాంక్(RBI) తెలంగాణ ప్రభుత్వానికి రు. 8 కోట్లు జరిమానా విధించింది. రిజర్వ్ బ్యాంక్ విధించిన జరిమానాను తెలంగాణ ప్రభుత్వం చెల్లించింది. జరిమానా చెల్లించింది అంటేనే తప్పుచేసినట్లు తెలంగాణ ప్రభుత్వం అంగీకరించినట్లే కదా ? లేకపోతే జరిమానా ఎందుకు కట్టాలని రిజర్వ్ బ్యాంకును ప్రభుత్వం నిలదీసుండేదే.
తెలంగాణ ప్రభుత్వం జరిమానా చెల్లించాల్సిన అవసరం ఏమొచ్చిందంటే నిధుల బదిలీలో నిబంధనల ఉల్లంఘన కారణంగానే. నిబంధనలను హెచ్ఎండీఏ ఎందుకు ఉల్లంఘించింది అంటే మంత్రి కమ్ సీఎం కేసీఆర్(KCR) కొడుకు హోదాలో కేటీఆర్ ఆదేశాల వల్లేని స్పష్టంగా అర్ధమైంది. కేటీఆర్ ఆదేశాల వల్లే తాము నిధులను బదిలీచేయాల్సి వచ్చిందని అప్పటి ప్రిన్సిపుల్ సెక్రటరీ అర్వింద్ కుమార్, హెచ్ఎండీఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బీఎల్ఎన్ రెడ్డి రాతమూలకంగా ఏసీబీ, ఈడీ విచారణలో అంగీకరించారు. కాబట్టి అవినీతి సంగతిని పక్కనపెట్టేస్తే కేటీఆర్ కారణంగానే నిబంధనల ఉల్లంఘన, అధికార దుర్వినియోగం జరిగిందని అర్ధమవుతోంది. ఈ విషయంలో కమిట్ అయితే సమస్య వస్తుందని కేటీఆర్ అవినీతిజరగలేదని అంటున్నారేకాని నిబంధనలఉల్లంఘన, అధికార దుర్వినియోగం అంశాలను మాత్రం ఎక్కడా ప్రస్తావించటంలేదు. ఏదేమైనా ఎఫ్ఈవో సీఈవో విచారణకు హాజరైతే ఇంకెన్ని విషయాలు వెలుగులోకి వస్తాయో చూడాలి.