
ఫార్ములా ఈ కార్ కేసులో అరవింద్ కుమార్ కు మళ్లీ నోటీసులు
గురువారం ఉదయం పదకొండున్నరకు విచారణ
తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫార్ములా ఈ కార్ రేసు కేసు ఉచ్చు బిగుస్తోంది. ఈ కేసులో ఎ2గా ఉన్న ఐఏఎస్ అరవింద్ కుమార్ గురువారం ఉదయం పదకొండున్నర వరకు విచారణకు రావాల్సిందిగా ఎసిబి మరోసారి నోటీసులు జారి చేసింది. నెలరోజుల పాటు యూరప్ పర్యటనలో ఉన్న అరవింద్ కుమార్ గత నెల 30 వ తేదీన హైద్రాబాద్ వచ్చారు.
ఈ కేసులో ప్రధాన నిందితుడైన కెటీఆర్ ఎసిబికి ఇచ్చిన సమాచారం ప్రకారం అరవింద్ కుమార్ ను విచారణకు పిలిచారు.
ఫార్ములా ఈ కార్ రేస్ బిఆర్ఎస్ ప్రభుత్వ హయంలో చోటు చేసుకుంది. కేబినెట్ అనుమతి లేకుండా ఆర్థిక నిబంధనలను పాటించకుండా విదేశీ కంపెనీకి 45 కోట్లు విడుదల చేయడాన్ని కాంగ్రెస్ సీరియస్ గా తీసుకుంది. అనుమతులు లేకుండా కేవలం 10 లక్షల రూపాయల వరకు నిధులు విడుదల చేయొచ్చు. కానీ విదేశీకంపెనీకి 45 కోట్ల రూపాయలను అరవింద్ కుమార్ విడుదల చేశారు. కెటీఆర్ ఫోన్ లో ఆదేశించిన కారణంగా తాను నిధులు విడుదల చేసినట్టు అరవింద్ కుమార్ గతంలో అంగీకరించారు.
కూతురు కాన్వేకేషన్ కోసం విదేశాల్లో ఉన్నఅరవింద్ కుమార్ కు ఏసీబీ నోటీసులిచ్చింది. జులై 1న విచారణకు హాజరుకావాలని ఎసిబి నోటీసు ఇచ్చినప్పటికీ అరవింద్ కుమార్ డుమ్మా కొట్టారు. ఆయన హైద్రాబాద్ లో ఉన్నప్పటికీ ఎసిబి విచారణకు హాజరు కాలేదు. బుధవారం అరవింద్ కుమార్ కు మరోసారి ఎసిబి నోటీసులు జారి చేసింది. గురువారం ఉదయం పదకొండున్నరకు హాజరుకావాలని తాజా నోటీసులో ఎసిబి పేర్కొంది.అరవింద్ కుమార్ మళ్లీ డుమ్మా కొడితే అరెస్ట్ చేసే అవకాశమున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ కేసును సీరియస్ గా తీసుకుంది. మరో ఐఏఎస్ అధికారి దాన కిషోర్ ఫిర్యాదుమేరకు అరవింద్ కుమార్ పై కేసు నమోదైంది.
అరవింద్ కుమార్ ఇచ్చే సమాధానాన్ని బట్టి కెటీఆర్ ను మరో మారు ఎసిబి విచారణకు పిలిచే అవకాశం ఉంది.