కాళేశ్వరం అవినీతి.. రంగంలోకి ఏసీబీ..!
x

కాళేశ్వరం అవినీతి.. రంగంలోకి ఏసీబీ..!

ఇప్పటికే ఫైళ్లను పరిశీలిస్తున్న సీబీఐ.


కాళేశ్వరం నిర్మాణంలో భారీగా ఆర్థిక అవకతవకలు జరిగాయన్న అంశం రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ అంశాన్ని తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే సీబీఐకి సిఫార్సు చేసింది. కాగా తాజాగా ఇందులోకి ఏసీబీ కూడా ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అయింది. ఈ క్రమంలోనే తాజాగా కాళేశ్వరం అవినీతిపై దర్యాప్తు షురూ చేయడానికి అనుమతులు కోరుతూ ప్రభుత్వానికి లేఖ రాశారు ఏసీబీ అధికారులు. ఏసీబీ విజిలెన్స్ డిపార్ట్‌మెంట్ నుంచి వచ్చిన లేఖను సీఎస్‌కు పంపడం జరిగింది. ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే ఏసీబీ డీజీ ఆధ్వర్యంలో విచారణ మొదలవుతుంది. అయితే ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో పనిచేసి ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టుకున్న అధికారులను చాలా మందిని ఏసీబీ గుర్తించింది. ఇంజినీర్ల ఇళ్ల నుంచే వందల కోట్ల రూపాయల అక్రమ సొమ్మును ఏసీబీ స్వాధీనం చేసుకుంది. ఈ కారణంగానే కాళేశ్వరం అవినీతిపై దర్యాప్తు చేపట్టాలని ఏసీబీ భావించింది. దాంతో అందుకు అనుమతి కోరుతూ ప్రభుత్వానికి లేఖ రాసిందని అధికారిక వర్గాల నుంచి అందుతున్న సమాచారం.

పరిశీలిస్తున్న సీబీఐ

కాళేశ్వరం అవినీతి అంశాన్ని ప్రభుత్వం సీబీఐకి సిఫార్సు చేసింది. దీంతో ఈ కేసుకు సంబంధించిన అన్ని ఫైళ్లను సీబీఐ అధికారులు పరిశీలిస్తున్నారు. వారి పరిశీలన పూర్తయిన తర్వాత దర్యాప్తు ప్రారంభించాలా? లేదా కేసును వదిలేయాలా? అన్న నిర్ణయానికి వస్తుంది సీబీఐ. ఈ పరిశీలనలో భాగంగా జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదిక, కమిషన్‌కు అధికారులు, నేతలు సమర్పించిన ఆధారాలు, రికార్డ్ చేసిన వాంగ్మూలాలు సహా మరిన్ని అనేక ఫైళ్లను సీబీఐ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంలో సీబీఐ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

ఇప్పటికే కేసులు పెట్టిన విజిలెన్స్..

అయితే కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో జరిగిన అక్రమాలపై ఇప్పటికే విజిలెన్స్ శాఖ దర్యాప్తు చేసింది. పలువురు అధికారులపై కేసులు కూడా నమోదు చేసింది. కాళేశ్వరం నిర్మాణంలో భారీగా అవినీతి జరిగిందని తేల్చింది కూడా. అధికారులు భారీగా అక్రమాలకు పాల్పడ్డారని, కొందరు ముఖ్యమైన నలుగురు అధికారుల ఆస్తులు వందల కోట్ల రూపాయాలను అధిగమించి ఉన్నాయని విజిలెన్స్ అధికారులు తేల్చారు. వారిపై కేసులు కూడా నమోదు చేసింది. ఇప్పుడు ఏసీబీ ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతుండటంతో విజిలెన్స్ అధికారుల రిపోర్ట్‌లు కీలకంగా మారనున్నాయి.

Read More
Next Story