హనీట్రాప్ ఘటనలో నిందితులకు పోలీసు కస్టడీ
x

హనీట్రాప్ ఘటనలో నిందితులకు పోలీసు కస్టడీ

రూ.2 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేసిన నిందితులు.


హనీట్రాప్ లో చిక్కుక్కున్న యోగాగురువు కేసులో నిందితులను గోల్కొండ పోలీసులు కస్టడీలో తీసుకుని విచారిస్తున్నారు. హనీట్రాప్ ఘటనలో ఐదుగురు నిందితులు అమర్, మౌలాలీ, రాజేశ్, మంజుల, రజనీరెడ్డి ప్రస్తుతం చంచల్ గూడ జైలులో ఉన్నారు. నిందితుల నుంచి మరింత సమాచారం రాబట్టేందుకు కస్టడీకి ఇవ్వాలని పోలీసులు నాంపల్లి కోర్టును ఆశ్రయించారు. నిందితులను రెండ్రోజుల కస్టడీకి కోర్టు అనుమతించడంతో గోల్కొండ పోలీసులు శనివారం అదుపులోకి తీసుకున్నారు.

రంగారెడ్డి జిల్లా చేవెళ్లకు చెందిన యోగా గురువు రంగారెడ్డి (55) తన వ్యవసాయ భూమిలో ఆశ్రమం నిర్మించాడు. ఆశ్రమంలోనే వెల్ నెస్ సెంటర్ నిర్మించాడు. జీవన శైలి (బీపీ, షుగర్ ) వ్యాధులు నయం చేస్తానని సోషల్ మీడియాలో ప్రచారం చేసుకున్నాడు. ఈ వెల్ నెస్ సెంటర్ లో వసతి సౌకర్యం కూడా ఉందని, ప్రత్యేక క్లాసులు కూడా ఉంటాయని విపరీతంగా ప్రచారం చేసుకున్నాడు. ఈ ప్రచారాన్ని సోషల్ మీడియాలో చూసిన అమర్ ముఠా యోగా గురువునుంచి డబ్బులు గుంజాలని ప్లాన్ చేసింది. ఆగస్టు ఆరో తేదీన అమర్ ఇద్దరు మహిళలైన మంజుల, రజనీరెడ్డిలను ఆశ్రమానికి తీసుకెళ్లాడు. వీళ్లు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారని యోగా గురువుకు అమర్ పరిచయం చేశాడు. ఆశ్రమంలోని వెల్ నెస్ సెంటర్ లో ఇన్ పేషెంట్ గా చేర్చితే రోగాన్ని నయం చేస్తానని యోగా గురువు వారికి హామి ఇచ్చాడు. అప్పట్నుంచి అక్కడే ఉన్న మంజుల, రజనీరెడ్డిలు యోగా గురువుకు వలపువల విసిరి ట్రాప్ చేశారు.

స్పై కెమెరాలతో రికార్డు

మంజులతో యోగాగురువు రహస్యంగా గడిపిన సమయంలో రజనీ రెడ్డి తన స్పై కెమెరా లో రికార్డు చేసుకునేది. రజనీరెడ్డి యోగా గురువుకు వంటలో సహాయం చేస్తున్నట్టు నటిస్తూనే యోగా గురువుకు దగ్గరైంది. యోగా గురువుతో గడిపిన సమయంలో మంజుల తన స్పై కెమెరాలో రికార్డు చేసుకునేది. వ్యాధి సంగతి దేవుడెరుగు మొత్తానికి ఈ ఇద్దరు మహిళలు తమ రాసలీలల వీడియోలు తీసుకుని అమర్ దగ్గరికి వచ్చారు. ఆ వీడియోలను చూపించి యోగా గురువును అమర్ బెదిరించేవాడు. శంషాబాద్ లో వారితో గడిపిన సమయాల్లో రికార్డు చేసుకున్న వీడియోలను చూపించి తొలుత 50 లక్షలు వసూలు చేసిన నిందితులు మరో రెండు కోట్లు ఇవ్వాలని యోగా గురువును డిమాండ్ చేసారు. డబ్బులు ఇవ్వకపోతే సోషల్ మీడియాలో ప్రచారం చేస్తామని అమర్ ముఠాలోని ఐదుగురు సభ్యులు బెదిరించారు.

దీంతో యోగా గురువు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అమర్ ముఠాలోని ఐదుగురు సభ్యులను పోలీసులు అరెస్ట్ చేసి చంచల్ గూడ జైలుకు తరలించారు. నిందితుల నుంచి మరింత సమాచారం రాబట్టడానికి కస్టడీకి ఇవ్వాలని గోల్కొండ పోలీసుల పిటిషన్ ను కోర్టు ఆమోదించింది. నిందితుల రెండ్రోజుల కస్టడీలో మరిన్ని వివరాలు రాబట్టే అవకాశం ఉంది. హనిట్రాప్ ముఠా ఇంత వరకు ఎవరెవరిని బెదిరించింది అనే వివరాలు కస్టడీలో బయటపడే అవకాశం ఉంది.

Read More
Next Story