
నిత్య పెళ్లి కూతురు మళ్లీ జంప్
మ్యాట్రీ మోనీ ద్వారా అనేక పెళ్లిళ్లు చేసుకున్న నిందితురాలు
16 ఏళ్ల కూతురు ఉన్న ఒక కిలేడి అనేక పెళ్లిళ్లు చేసుకుంటున్న ఘటన వరంగల్ జిల్లాలో వెలుగు చూసింది. వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం చౌటపల్లి గ్రామానికి చెందిన యువకుడిని మ్యాట్రి మోనీ ద్వారా పరిచయమైన ఈ కిలేడి గత నెలలో పెళ్లి చేసుకుంది. ఇప్పటివరకు అనేక పెళ్లిళ్లు చేసుకుని ఉడాయించింది. పెళ్లిలో అత్తింటి వారు పెట్టిన బంగారు నగలు, నగదు దోచుకోవడడమే టార్గెట్ గా పెట్టుకుని నిత్య పెళ్లికూతురు అవతారమెత్తినట్టు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. తనకింకా పెళ్లి కాలేదని మ్యాట్రిమోనీలో తన ప్రొఫైల్ అప్ లోడ్ చేసి అమాయక యువకులను మోసం చేస్తోంది. తెలుగురాష్ట్రాల్లో ఈ కిలేడిపై కేసులు నమోదైన నేపథ్యంలో పోలీసుల కళ్లు గప్పి తప్పించుకు తిరుగుతోంది.
ఇదే క్రమంలో గత నెలలో చౌటపల్లి గ్రామానికి చెందిన యువకుడిని పెళ్లి చేసుకుంది. ఆంధ్రప్రదేశ్ విజయవాడకు చెందిన ఈ నిత్య పెళ్లి కూతురు ఆన్ లైన్ మ్యాట్రిమోనీ ద్వారా పరిచమైంది. పెళ్లి జరిగిన తర్వాత అత్తింటి వారితో గొడవపడి హనుమకొండలో ఇల్లు అద్దెకు తీసుకుని వేరు కాపురం పెట్టింది. నెల రోజుల పాటు అదే అద్దె ఇంట్లో నివాసముంది. 10 రోజుల క్రితం పెళ్లి సమయంలో పెట్టిన 12 తులాలబంగారం, రెండు లక్షల రూపాయలతో ఉడాయించింది. భార్య కనిపించకపోవడంతో యువకుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.పెళ్లి సమయంలో పరిచమమైన ఈ కిలాడీ తల్లిదండ్రులు, బంధువులు కూడా ఫేక్ అని పోలీసుల దర్యాప్తులో తేలింది.
ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటనపై వరంగల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పెళ్లి సమయంలో తీసిన వీడియో ఫుటేజిని పోలీసులు పరిశీలిస్తున్నారు.

