
నటుడు లోబోకు ఏడాది జైలు శిక్ష
రాష్ డ్రైవింగ్ వల్ల ఇద్దరు వ్యక్తులు మృతి చెందిన కేసులో జనగామ కోర్టు తీర్పు
రాష్ డ్రైవ్ చేస్తూ ఇద్దరి మరణానికి కారణమైన సినీ నటుడు లోబో అలియాస్ మహమ్మద్ ఖయ్యూమ్‌కు ఏడాది జైలు శిక్ష పడింది. ఏడున్నర ఏళ్లతర్వాత జనగామ కోర్టు ఈ తీర్పు వెలువరించింది. 2108 మే21న వరంగల్ నుంచి హైదరాబాద్ వెళ్తుండగా రఘునాథపల్లి మండలం నిడిగొండ గ్రామం వద్ద లోబో కారు ఆటోను ఢీ కొట్టింది. దీంతో ఆటోలోని ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందారు. ఘటనాస్థలిలో పలువురికి గాయాలయ్యాయి. టీవీ ఛానల్ షూటింగ్ ముగించుకుని లోబో తన టీమ్‌తో కలిసి రామప్ప, లక్నవరం, భద్రకాళి చెరువు, వేయి స్తంభాల గుడి తదితర ప్రాంతాల్లో పర్యటించారు. తిరుగు ప్రయాణంలో జరిగిన ప్రమాదంలో ఖిలాషాపురం గ్రామానికి చెందిన మేడెకుమార్,పెంబర్తి మణెమ్మ మరణించారు.కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు రఘునాథపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. అనేక కోణాల్లో విచారించిన పోలీసులు కోర్టులోచార్జ్ షీట్ ఫైల్ చేశారు. వాద ప్రతివాదనలు ముగిసిన అనంతరం జనగామ కోర్టు తీర్పు వెలువరించింది. లోబోకు ఏడాది జైలు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది. రూ.12,500 జరిమానా విధిస్తూ.. తీర్పు వెల్లడించింది.
టాటూ ఆర్టిస్ట్ గా కెరీర్ ప్రారంభించి లోబో టీవీ యాంకర్, నటుడిగా రాణించారు. బిగ్ బాస్ సీజన్ 5లో లోబో కంటెస్టెంట్ గా పాల్గొన్నారు.