MANCHU FAMILY | మోహన్ బాబు ఫ్యామిలీలో మంటలు..తండ్రీ కొడుకుల సవాల్!
x
MOHAN BABU and MANOJ

MANCHU FAMILY | మోహన్ బాబు ఫ్యామిలీలో మంటలు..తండ్రీ కొడుకుల సవాల్!

మంచు మోహన్ బాబు కుటుంబంలో ఆస్తుల వివాదం తారాస్థాయికి చేరుకుంది. మోహన్ బాబు రెండో కొడుకు మంచు మనోజ్ తండ్రిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.


ప్రముఖ సినీనటుడు మంచు మోహన్ బాబు కుటుంబంలో ఆస్తుల వివాదం తారాస్థాయికి చేరుకుంది. మోహన్ బాబు రెండో కొడుకు మంచు మనోజ్ తండ్రిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇప్పుడీ వివాదం సినీ ఇండస్ట్రీలో పెద్ద చర్చనీయాంశంగా ఉంది. ఆస్తులు ఆత్మీయతను దెబ్బతీస్తున్నాయని కొందరు వేదాంత ధోరణిలో మాట్లాడుతుంటే మరికొందరేమో నిర్వేదం వ్యక్తం చేస్తూ ఈ లోకం తీరు ఇంతేలెమ్మంటున్నారు.

మోహన్‌బాబు, ఆయన కుమారుడు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ పోలీస్‌ స్టేషన్‌ కు వెళ్లడంతో వివాదం మరింత ముదిరింది. ఆస్తుల పంపకాల విషయంలో మోహన్‌బాబుకు, ఆయన చిన్న కొడుకు మనోజ్‌కు మధ్య గొడవ జరిగినట్లు, ఇద్దరూ కొట్టుకున్నట్లు డిసెంబర్ 7నుంచి వస్తున్న వార్తలు డిసెంబర్ 10వ తేదీ నాటికి ముదిరి పాకాన పడి సంచలనం రేపుతోంది.

మోహన్ బాబు ట్వీట్ చేసిన గంటకే..


ఇదంతా నిజం కాదని, పుకార్లేనని, అబద్దపు వార్తలు ప్రచారం చేయొద్దని మోహన్‌బాబు సోషల్ మీడియా 'X'లో ప్రకటించిన కొన్ని గంటలకే తనను తన కుటుంబ సభ్యులు కొట్టారనే దానికి సాక్ష్యాధారాలను పోలీసులకు అందించారు మనోజ్. బంజారాహిల్స్‌లోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రి నుంచి తీసుకున్న మెడికల్‌ లీగల్‌ సర్టిఫికెట్‌ ను మనోజ్‌ పహాడీషరీఫ్‌ పోలీసులకు అందించి ఫిర్యాదు చేశారు. తనకు, తన కుటుంబానికి ప్రాణహాని ఉందని, డిసెంబర్ 8న 10 మంది గుర్తుతెలియని వ్యక్తులు తమ ఇంటికి (జల్‌పల్లిలోని మోహన్‌బాబు నివాసం) వచ్చి గట్టిగా అరుస్తూ భయబ్రాంతులకు గురిచేశారని, వారిని అడ్డుకునే సమయంలో తన దాడి చేశారనీ, ఇంటి ఆవరణలోని సీసీటీవీ ఫుటేజీలు ఎత్తుకెళ్లారని, దుండగులను పట్టుకొని చట్ట ప్రకారం శిక్షించాలని మనోజ్‌ ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు.

తన తండ్రి మోహన్‌బాబు (Mohan Babu) తనపైనా, తన భార్య మౌనికపైనా అసత్య ఆరోపణ చేస్తున్నారని ఫిర్యాదు చేశారు. కుటుంబ వ్యవహారాల్లో తనకు రక్షణగా నిలబడాలని ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులను కోరారు. కుటుంబ ఆస్తుల కోసం తాను ఎప్పుడూ ఆశ పడలేదని, కుటుంబ గౌరవాన్ని కాపాడేందుకు ప్రతిసారి ప్రయత్నం చేశానని చెప్పారు. ఈ వివాదాల్లో తన కూతుర్ని తీసుకు రావడం చాలా బాధాకరమని అన్నారు. గత కొన్నాళ్లగా ఆ ఇంటి నుంచి తన కుటుంబంతో దూరంగానే ఉంటున్నామని, తన ముందే తన కుటుంబ సభ్యుల్ని ఉద్యోగులను తీవ్రంగా తిట్టారని, ఇంటిలో ఉండాల్సిన సిసి ఫుటేజీ కెమెరాలు మాయమయ్యాయని, అన్న విష్ణు దుబాయ్‌కు ఎందుకు వెళ్ళాడో అందరికీ తెలుసునని అన్నారు.

మోహన్‌బాబు, ఆయన అనుచరులతో పాటు.. మంచు విష్ణు ప్రధాన అనుచరుడు, మోహన్‌బాబు స్కూళ్ల పర్యవేక్షకుడు వినయ్‌ సహా.. కొంతమంది బౌన్సర్లు మనోజ్‌, ఆయన భార్య మౌనికపై దాడి చేసి గాయపరిచినట్లు తెలిసింది. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న మనోజ్‌ దంపతులు తమకు రక్షణగా సుమారు 40 మంది బౌన్సర్లను రంగంలోకి దింపినట్లు తెలిసింది. అంతేకాకుండా రాయలసీమ నుంచి భూమా అనుచరులు, కొంతమంది మహిళా బౌన్సర్లు మనోజ్‌ దంపతులకు రక్షణగా వచ్చినట్లు తెలిసింది. దాంతో జల్‌పల్లి నివాసం బౌన్సర్ల మయంగా మారిపోయింది.

తన సోదరుడు మంచు విష్ణు అనుచరులే సిసి ఫుటేజ్ మొత్తాన్ని మాయం చేశారని, ఇంటిలో ఉన్న సీసీ కెమెరాలు అన్నిటిని విజయ రెడ్డి , కిరణ్ రెడ్డి తీసుకొని వెళ్ళిపోయారని మంచు మనోజ్ ఆరోపించారు. తాను ఆస్తుల కోసం ఎప్పుడూ ప్రాకులాడ లేదని, ఆస్తుల కోసం ఎప్పుడూ ఇబ్బంది పెట్టలేదని అన్నారు. తాను, తన భార్య సొంత కాళ్ళ మీద నిలబడి సంపాదించుకుంటున్నామని చెప్పారు. విద్యాసంస్థల్లో కొన్ని అక్రమాలు జరుగుతున్నాయని, విద్యాసంస్థలోని బాధితులకు తాను అండగా ఉన్నానని.. బాధితుల పక్షాన నిలబడినందుకు తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మనోజ్ వ్యాఖ్యానించారు.

మనోజ్‌, మౌనికపై సీపీకి ఫిర్యాదు చేసిన మోహన్‌బాబు


తన కొడుకు మనోజ్‌, ఆయన భార్య మౌనిక, వారి అనుచరుల ద్వారా తనకు ప్రాణ హాని ఉందని, రక్షణ కల్పించాలని రాచకొండ సీపీకి మోహన్‌బాబు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు సీపీకి రాసిన లేఖను మోహన్‌బాబు మీడియాకు విడుదల చేశారు. కొంతమంది సంఘ విద్రోహ శక్తులతో కలిసి తన ఇంటిని, ఆస్తులను లాక్కోవాలని చూస్తున్నారని ఆ లేఖలో పేర్కొన్నారు. తన కొడుకు మనోజ్‌, కోడలు మౌనిక ప్లాన్‌ ప్రకారమే ఇదంతా జరుగుతున్నట్లు నమ్ముతున్నానని వెల్లడించారు. తాను 78 ఏళ్ల సీనియర్‌ సిటిజన్‌ననీ, తనకు రక్షణ కల్పించాలని అభ్యర్దిస్తున్నట్లు సీపీకి రాసిన లేఖలో మోహన్‌బాబు పేర్కొన్నారు.

ముంబైలో ఉంటున్న మంచు లక్ష్మి ఈ వివాదం గురించి తెలుసుకుని డిసెంబర్ 9న ఉదయం జల్‌పల్లిలోని ఇంటికి వచ్చారు.. తమ్ముడికి నచ్చజెప్పడానికి ఆమె ప్రయత్నించినట్లు సమాచారం. అయితే మనోజ్‌ తన మాట వినకపోవడంతో చేసేదేమీ లేక మంచు లక్ష్మి వెనుదిరిగి ముంబై వెళ్లిపోయినట్లు తెలిసింది. ఆమె వెళ్లిన కాసేపటికి మోహన్‌బాబు కూడా ఇంటి నుంచి బయటకు వెళ్లారు. ఇలా తండ్రీకొడుకుల మధ్య వివాదం రాను రాను ముదురు తుండడంతో మోహన్‌బాబు కుటుంబానికి సన్నిహితులు, శ్రేయోభిలాషులు రంగంలోకి దిగి వివాదాన్ని పరిష్కరించడానికి ప్రయత్నాలు ప్రారంభించినట్లు తెలుస్తోంది.

Read More
Next Story