ప్రభుత్వం చేయలేని పనిని అదాని గ్రూపు చేయగలదా ?
x
Gautam Adani

ప్రభుత్వం చేయలేని పనిని అదాని గ్రూపు చేయగలదా ?

విద్యుత్ లైన్లు వేయాలన్నా, విద్యుత్ చౌర్యాన్ని అరికట్టాలన్నా, బిల్లులు వసూలు చేయాలన్నా, ట్యాంపరింగ్ అరికట్టాలన్నా అదాని ఉద్యోగులకు ప్రభుత్వం మద్దతుండాల్సిందే.


పారిశ్రామిక రంగంలో అదాని గ్రూపు అంటేనే అనకొండగా పాపులరైపోయింది. జనాలు ఎవరు మాట్లాడుకున్నా అదాని గ్రూపు దాన్ని మింగేస్తోంది, దీన్ని మింగేస్తోందని చెప్పుకోవటం మామూలైపోయింది. అదేదో సినిమాలో అనకొండ కనబడింది మొత్తం మిగేస్తుంది కదా అలాగ అన్నమాట. ఇపుడు విషయం ఏమిటంటే అదాని కన్ను విద్యుత్ శాఖకు సంబంధించి ఓల్డ్ సిటిలోని సౌత్ సర్కిల్ మీద పడింది. ఇంకేముంది సౌత్ సర్కిల్లోని మీటర్ రీడింగ్, బిల్లుల వసూళ్ళను అదాని గ్రూపు తీసుకోబోతోంది. దీనికి సంబంధించిన విది విధానాలు పూర్తయిపోయాయి. మంచి ముహూర్తంచూసుకుని రంగంలోకి దిగేయటమే మిగిలుంది.

మీటర్ రీడింగ్, బిల్లుల వసూళ్ళ వ్యవహారాలను అదాని గ్రూపుకు ఇచ్చేస్తున్నట్లు స్వయంగా రేవంత్ రెడ్డే ఢిల్లీలో ప్రకటించారు. వసూలు చేసే ప్రతి 100 రూపాయల బిల్లులో అదానికి 25 రూపాయలు, ప్రభుత్వానికి 75 రూపాయలు వస్తాయని రేవంత్ చెప్పారు. ముఖ్యమంత్రే ప్రకటించిన తర్వాత ఇక అదానిని అడ్డుకునే వారెవరున్నారు ? అసలు ఓల్డ్ సిటిలో బిల్లుల బకాయిలు ఎందుకు పేరుకుపోతున్నాయి ? ఎందుకు విద్యుత్ సరఫరా నష్టాలు వస్తున్నాయి ? బిల్లులను ప్రభుత్వం ఎందుకు ఎప్పటికిప్పుడు వసూలు చేయలేకపోతోంది ? ఎందుకు సరఫరా నష్టాలను తగ్గించలేకపోతోంది? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పటం కష్టమే. ఎందుకంటే ఈ సమస్యలు ఇఫ్పటికిప్పుడు మొదలైంది కాదు దశాబ్దాలుగా పేరుకుపోయిన సమస్యలు. సౌత్ సర్కిల్ పరిధిలో 7,08,241 కనెక్షలున్నాయి. ఇందులో 5.68 లక్షలు గృహవినియోగం, 1.40 లక్షలు కమర్షియల్, 241 కనెక్షన్లు పరిశ్రమల క్యాటగిరిలో ఉన్నాయి. పై కనెక్షన్లలో చాలావరకు విద్యుత్ ను ఫుల్లుగా వాడుకుంటున్నారు కాని బిల్లులు మాత్రం రావటంలేదు. బిల్లులు చెల్లిస్తున్నవారు కూడా ఉన్నారు కాని వాళ్ళ సంఖ్య తక్కువనే చెప్పాలి. కమర్షియల్, పరిశ్రమల క్యాటగిరిలో అయితే మరీ తక్కువ.

ఓల్డ్ సిటి అంటేనే ముస్లింలకు బాగా ప్రాబల్యమున్న ఏరియాగా పాపులర్. హిందువులు కూడా ఉన్నా వాళ్ళ శాతం, ప్రభావం తక్కువనే చెప్పాలి. ఓల్డ్ సిటిలోని చాలా ప్రాంతాలు ఎంఐఎం ఎలుబడిలోనే నడుస్తోంది దశాబ్దాలుగా. ఎంఐఎం అనగానే అందరికీ గుర్తుకొచ్చేది ఓవైసీ సోదరులు అసదుద్దీన్, అక్బరుద్దీన్ మాత్రమే. ఓల్డ్ సిటీలోని చాలా ప్రాంతాల్లోని మెజారిటి జనాలు తాము వాడుకున్న విద్యుత్ దామాషాలో బిల్లులు చెల్లించటం లేదన్నది ప్రభుత్వం చెబుతున్నమాట. అంటే కరెంటు వాడుకుంటారు కాని దాని బిల్లులు మాత్రం చెల్లించరు. దశాబ్దాల తరబడి ఇదే వైఖరితో చాలామంది జనాలున్న కారణంగా కోట్ల రూపాయల బకాయిలు పేరుకుపోయాయి. రాజకీయ నేతల మద్దతుంటే తప్ప బిల్లులు ఎగ్గొట్టేంత ధైర్యం జనాలకు ఎక్కడినుండి వస్తుంది? ఓల్డ్ సిటిలో జరుగుతున్నదిదే.

విద్యుత్ పంపిణి, బిల్లుల వసూళ్ళలో సౌత్ సర్కిల్ నుండి ప్రతి సంవత్సరం ప్రభుత్వానికి రు. 500 కోట్ల నష్టం వస్తోంది. సౌత్ సర్కిల్ నుండి వస్తున్న 41 శాతం నష్టంలో అత్యధికంగా బర్కాస్ ఫీడర్ నుండే వస్తోందని లెక్కలు చెబుతున్నాయి. బర్కస్ ఫీడర్లో ఏకంగా 90 శాతం నష్టాలు నమోదవుతున్నాయి. సౌత్ సర్కిల్ పరిధిలో రోజుకు రు. 3 కోట్ల విలువైన విద్యుత్ సరఫరా అవుతుంటే కోటిన్నర రూపాయలు మాత్రమే ప్రభుత్వానికి తిరిగొస్తోంది. అంటే ఏడాదికి సుమారు కోటిన్నర రూపాయల నష్టం వస్తున్నట్లు స్పష్టమవుతోంది. ఈ ఒక్క సర్కిల్ నుండే ఏడాదికి రు. 500 కోట్లు నష్టం వస్తోంది.

నష్టాలకు కారణాలు ఏమిటి ?

సౌత్ సర్కిల్లో వస్తున్న నష్టాలకు ప్రధానంగా రెండు కారణాలు కనబడుతున్నాయి. అవేమిటంటే విద్యుత్ సరఫరాలో నష్టాలు, బిల్లులు చెల్లించకపోవటంతో రెవిన్యు నష్టాలు. సరఫరాలో నష్టాలు ఏమిటంటే ఓల్డ్ సిటిలోని ట్రాన్స్ మిషన్ లైన్లలో అత్యధికం నిజాం కాలంలో వేసిన లైనులే ఉన్నాయి. దీనివల్ల ప్రతిరోజు విద్యుత్ సరఫరాలో 12 శాతం లీకేజీలు నమోదవుతున్నాయి. ఇంక రెండో నష్టం ఏమిటంటే విద్యుత్ చౌర్యం, వాడుకున్న విద్యుత్ కు డబ్బులు చెల్లించకపోవటం, మీటర్ ట్యాంపరింగ్ చేసి మీటర్ సరిగా తిరగకుండా చేయటం లాంటి కారణాలున్నాయి.

ప్రభుత్వం ఏమిచేస్తోంది ?

ఏమిచేస్తోందంటే ఏమీ చేయటంలేదనే చెప్పాలి. విద్యుత్ చౌర్యం జరుగుతోందని తెలుసు, బిల్లులు సక్రమంగా చెల్లించటంలేదనీ తెలుసు, మీటర్ల ట్యాంపరింగ్ జరుగుతోందనే సమాచారం కూడా ఉంది. విద్యుత్ చౌర్యాన్ని అరికట్టేందుకు ప్రయత్నించినా, బిల్లులు చెల్లించకపోయినా, ట్యాంపరింగ్ జరగకుండా చూడాలన్నా ప్రభుత్వం వల్ల కావటంలేదు. ఎందుకంటే రాజకీయ అవసరాలు అడ్డుపడుతున్నాయి. బిల్లుల వసూళ్ళు చేయాలని, ట్యాంపరింగ్ కంట్రోల్ చేయాలని, చౌర్యాన్ని అరికట్టేందుకు విద్యుత్ ఉద్యోగులు ప్రయత్నిస్తే వాళ్ళపై దాడులు జరిగిన ఘటనలు చాలా ఉన్నాయి. బాధిత ఉద్యోగులకు ప్రభుత్వం కూడా మద్దతుగా నిలబడటంలేదు. ఉద్యోగం చేసి దెబ్బలు ఎందుకు తినాలన్న ఉద్దేశ్యంతో ఉద్యోగులు కూడా వెళ్ళటం మానుకున్నారు.

అదాని గ్రూపు ఏమి చేయగలదు ?

ప్రభుత్వ మద్దతులేకుండా అదానీయే కాదు ఏ గ్రూపు కూడా ఏమీ చేయలేందు. కొత్తగా విద్యుత్ లైన్లు వేయాలన్నా, విద్యుత్ చౌర్యాన్ని అరికట్టాలన్నా, బిల్లులు వసూలు చేయాలన్నా, ట్యాంపరింగ్ అరికట్టాలన్నా అదాని ఉద్యోగులకు ప్రభుత్వం మద్దతుండాల్సిందే. ప్రభుత్వం మద్దతంటే విద్యుత్ ఉద్యోగులతో పాటు రక్షణగా పోలీసులను రంగంలోకి దింపాల్సిందే తప్ప వేరేదారిలేదు. అదాని ఉద్యోగులకు రక్షణగా పోలీసులను దింపాలన్నపుడు అదేదో ప్రభుత్వ ఉద్యోగుల రక్షణకే పోలీసులను దింపచ్చు కదా. ప్రభుత్వ యంత్రాంగం చేయలేని పనిని అదాని గ్రూపు మాత్రం ఎలా చేయగలదు ?

ఉద్యోగలకు పూర్తి స్వేచ్చ ఇచ్చి ఫుల్లుగా పోలీసులను రక్షణగా దింపితే విద్యుత్ ఉద్యోగులే కొత్త లైన్లు వేసి, విద్యుత్ చౌర్యాన్ని అరికట్టి, మీటర్ల ట్యాంపరింగును కంట్రోల్ చేసి బిల్లును నూరుశాతం వసూలు చేయగలరు. బకాయిలను కూడా వసూలు చేయగల సత్తా తమకుందని విద్యుత్ ఉద్యోగులు నిరూపించగలరు. రాజకీయ ఒత్తిళ్ళకు లొంగకుండా విద్యుత్ శాఖకు సంబందించి ప్రభుత్వం ఓల్డ్ సిటి ప్రక్షాళనకు రెడీ అయితే విద్యుత్ ఉద్యోగులే అద్భుతాలు చేయగలరు ? సంవత్సరాల తరబడి పేరుకుపోయిన నష్టాలు, కష్టాలను నాలుగేళ్ళల్లో విద్యుత్ ఉద్యోగులే సరిచేసేస్తారు. మొత్తం ఓల్డ్ సిటీని విద్యుత్ ఉద్యోగులే ఒకదారికి తీసుకొచ్చేస్తారు. అప్పుడు అదాని గ్రూపు అవసరంలేదు మరో క గ్రూపుతో పనేలేదు.

Read More
Next Story