రేవంత్ నెత్తిన అదాని పిడుగు?
x
Revanth with Gautam Adani

రేవంత్ నెత్తిన అదాని పిడుగు?

తెలంగాణాలో పరిశ్రమలు పెట్టడానికి అదాని గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదాని సీఎం రేవంత్(Revanth) కు ఇచ్చిన హామీలు నీటిమీద రాతలుగా మారిపోయేట్లున్నాయి.


ఉరిమి ఉరిమి మంగళం మీద పడిందనే సామెత రేవంత్ రెడ్డికి సరిగ్గా సరిపోతుంది. విషయం ఏమిటంటే తెలంగాణాలో పరిశ్రమలు పెట్టడానికి అదాని గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదాని సీఎం రేవంత్(Revanth) కు ఇచ్చిన హామీలు నీటిమీద రాతలుగా మారిపోయేట్లున్నాయి. కారణం ఏమిటంటే అదాని పెద్ద చిక్కుల్లో ఇరుక్కున్నారు. విద్యుత్ ప్రాజెక్టుల కాంట్రాక్టులు అందుకునేందుకు అదాని గ్రూపు వేల కోట్ల రూపాయలు లంచాలు ఆఫర్ చేశారనే ఆరోపణలపై గౌతమ్ అదాని(Gautam Adani)తో పాటు మరో ఏడుగురిపైన అమెరికాలో కేసులు నమోదయ్యాయి. ఓ భారీ కాంట్రాక్టు పొందేందుకు అదాని గ్రూపు 265 మిలియన్ డాలర్లు(2069 కోట్లు) ఇవ్వచూపినట్లు అమెరికా(America)లోని బ్రూక్లిన్ ఫెడరల్ కోర్టులో అభియోగాలు నమోదయ్యాయి. న్యూయార్క్(New York) ఈస్టర్న్ డిస్ట్రిక్ట్ అటార్నీ బ్రియాన్ పీస్ ఆదేశాల మేరకు ఐదు అభియోగాలతో గౌతమ్ తో పాటు ఏడుగురిపైన కేసులు నమోదయ్యాయి. దాంతో వీళ్ళ అరెస్టుకు ఆదేశాలు జారీ అయ్యాయి.

భారత్ లో భారీ సోలార్ ఎనర్జీ(Solar Energy) ప్రాజెక్టును దక్కించుకునేందుకు గౌతమ్ అదానితో పాటు మరో ఏడుగురు అధికారులకు లంచాలు ఎరవేసినట్లుగా అమెరికాలోని ఎఫ్ బీఐ(FBI) ఆరోపించింది. అలాగే నిధుల సమీకరణకు బ్యాంకులు, ఆర్ధిక సంస్ధలకు గ్రూపు తప్పుడు సమాచారం ఇచ్చినట్లు కూడా బయటపడింది. నిధుల సమీకరణలో అమెరికాలోని పెట్టుబడిదారులు కూడా ఉన్న విషయం తాజాగా బయటపడింది. దాంతో అమెరికాలోని పెట్టుబడిదారులు అదాని గ్రూపుపై ఫిర్యాదులు చేయటంతో విషయం వెలుగులోకి వచ్చింది. సరే, తమ గ్రూపుపైన వచ్చిన ఆరోపణలన్నీ అవాస్తవాలే అని అదాని అంటున్నారు. తాము తొందరలోనే వాస్తవాలను చెబుతామని కంపెనీ ప్రకటించింది.

నిధుల సేకరణ, నిదుల కోసం తప్పుడు సమాచారం ఇవ్వటం అనే విషయాలు అమెరికా కోర్టులో తేలుతాయి. ఇపుడు తెలంగాణాకు వచ్చిన సమస్య ఏమిటంటే తెలంగాణా(Telangana)లో పెట్టుబడులు పెట్టడానికి గౌతమ్ అదాని చాలా హామీలే ఇచ్చారు. గౌతమ్-రేవంత్ రెడ్డి భేటీ జరిగినపుడు పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన సాయాన్ని అందిస్తమని ఛైర్మన్ హామీ ఇచ్చారు. హామీ అయితే ఇచ్చారు కాని ఇంతవరకు ఒక్క హామీ కూడా అమల్లోకి వచ్చినట్లు లేదు. కాకపోతే రేవంత్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటుచేస్తున్న స్కిల్ యూనివర్సిటి(Skill University) ఏర్పాటుకు అదాని గ్రూప్ రు. 100 కోట్ల విరాళం ప్రకటించింది. మరి ఆ విరాళం ప్రభుత్వానికి అందిందా లేకపోతే ఇంకా ప్రకటనగానే ఉందా అన్నది సస్పెన్స్.

ఇదే సమయంలో అదాని దగ్గర రేవంత్ భారీ ఎత్తున ముడుపులు అందుకున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎప్పటినుండో ఆరోపిస్తున్నారు. అలాగే అమెరికాలో గౌతమ్ అదానితో మంత్రి పొంగులేటి శ్రీనివాసులరెడ్డి(Ponguleti Srinivasula Reddy) ఒక హోటల్లో భేటీ అయినట్లు కూడా చెబుతున్నారు. భేటీ ఎందుకు అయ్యారో చెప్పాలని పదేపదే డిమాండ్ చేస్తున్నారు. అదాని దగ్గర రేవంత్ ముడుపులు తీసుకున్నారా లేదా అన్నది ఎవరికీ తెలీదు. అదానితో అమెరికాలో పొంగులేటి హోటల్లో భేటి నిజమేనా అన్నది కూడా తెలీదు. ఏది నిజమో ఏది అబద్ధమో తెలీదుకాని తెలంగాణాలో పరిశ్రమల ఏర్పాటుకు సంబంధించిన హామీలైతే అమల్లోకి వచ్చే పరిస్దితులు ఇపుడు కబనడటంలేదు. మరి ముందు ముందు ఏమి జరుగుతుందో చూడాలి.

Read More
Next Story